Idream media
Idream media
        
ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సినీ విమర్శకుడు, నటుడు, దర్శకుడు కత్తి మహేశ్ కన్ను మూశారు. చెన్నైలో అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన శనివారం తుది శ్వాస విడిచారు. సినీ విమర్శకుడిగా కెరీర్ ప్రారంభించిన ఆయన పలు సినిమాల్లో నటించారు. ‘మిణుగురులు’ చిత్రానికి కో రైటర్‌గా పని చేశారు. ‘హృదయ కాలేయం’ చిత్రంలో పోలీస్‌గా, ‘నేనే రాజు నేనే మంత్రి’, ‘క్రాక్’ వంటి చిత్రాల్లో నటించారు. ‘పెసరట్టు’ చిత్రానికి దర్శకత్వం వహించారు.
జనసేన పార్టీ అధ్యక్షుడు, సినీ నటుడు పవన్ కల్యాణ్ పై సినీ, రాజకీయ, వ్యక్తిగత విమర్శలు చేసి సంచలనాలకు కేంద్ర బిందువు అయ్యారు. తెలుగు బిగ్‌బాస్ హౌస్‌లో కొన్ని రోజుల పాటు కంటెస్టెంట్‌గా ఆయన పాల్గొన్నారు. సమాజంలోని ఓ వర్గంవారి మనోభావాలను దెబ్బతీస్తుండటంతో.. శాంతి భద్రతల పరిరక్షణ కోసం హైదరాబాద్ పోలీసుల నుంచి ఆరు నెలల పాటు నగర బహిష్కరణను ఎదుర్కొన్నారు. ఇటీవల కాలంలో శ్రీరాముడిపై వివాదస్పద వ్యాఖ్యలు చేసి, హిందువుల ఆగ్రహానికి గురయ్యారు.
గత నెల 26వ తేదీన నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం చంద్రశేఖరపురం వద్ద జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో కత్తి మహేష్ తీవ్రంగా గాయపడ్డారు. ఆయన తల, కంటిభాగంపై తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే ఆయన్ను నెల్లూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన చికిత్స కోసం చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేర్పించారు. అతని చికిత్స కోసం ఏపీ ప్రభుత్వం రూ. 17 లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మంజూరు చేసింది. కోలుకుంటున్నట్లుగా ఇటీవల వార్తలు వచ్చినా.. అకస్మాత్తుగా ఆయన మరణవార్త వెలువడింది.
Also Read : కత్తి మహేష్ స్వరం, ఒక అవసరం