భారత భద్రతా బలగాల ఖాతాలో మరో పెద్ద విజయం చేరింది. కశ్మీర్ ప్రాంతంలో ఉగ్ర కార్యకలాపాలకు తెగబడే హిజ్బుల్ ముజాహిదీన్ కశ్మీర్ చీఫ్(ఆపరేషన్స్) డాక్టర్ సైఫుల్లాను ఎన్‌కౌంటర్లో హతం చేసి ఆ ఉగ్రవాదసంస్థను కోలుకోలేని దెబ్బకొట్టాయి.
శ్రీనగర్ శివారులోని రంగ్రెత్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్లు భారత భద్రతా బలగాలకు సమాచారం అందడంతో ఆ ప్రాంతంలో భారత బలగాలు సోదాలు నిర్వహించాయి. దళాల రాకను గమనించిన ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో భద్రతా దళాలు ఎదురుకాల్పులు జరిపాయి. ఈ ఎన్‌కౌంటర్లో హిజ్బుల్ ముజాహిదీన్ కశ్మీర్ చీఫ్ సైఫుల్లా హతం కాగా మరో ఉగ్రవాది పట్టుబడ్డాడు.
ఇదే సంవత్సరం మే నెలలో హిజ్బుల్ చీఫ్‌గా ఉన్న రియాజ్ నైకూ భద్రతా బలగాలు చేసిన ఎన్‌కౌంటర్‌లో హతం అయిన సంగతి తెలిసిందే.
రియాజ్ నైకూ మరణించిన తర్వాత హిజ్బుల్ ముజాహిదీన్‌కు సైఫుల్లా నాయకత్వం వహిస్తున్నాడు. గతంలో సైఫుల్లా పలు ఉగ్ర దాడులకు పాల్పడ్డాడు.ఎన్‌కౌంటర్ అనంతరం పోలీసులు ఘటనాస్థలి నుంచి ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.ఎన్‌కౌంటర్‌లో మరణించింది హిజ్బుల్ ముజాహిదీన్ కశ్మీర్ చీఫ్ సైఫుల్లా అని కశ్మీర్ ఐజీపీ విజయ్‌కుమార్ ప్రకటించారు. భద్రతా బలగాలు పెద్ద విజయం సాధించాయని ఆయన వెల్లడించారు.సైఫుల్లా మరణించడంతో కశ్మీర్ లో ఉగ్రవాద కార్యకలాపాలకు చెక్ పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.