కరోనా కాలంలో పాపులర్ అయిన వ్యక్తి నెల్లూరుకు చెందిన ఆనందయ్య. కృష్ణపట్నానికి చెందిన అనందయ్య కరోనా నివారణకు ఆయుర్వేద మందు తయారు చేసిన వైద్యుడిగా గుర్తింపు పొందారు. ఆయన మందు కోసం కృష్ణపట్నానికి జనం పోటెత్తేవారు. ఇప్పుడు ఆయన రాజకీయాల్లోకి ప్రవేశించనున్నారు. కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అన్ని కులాలను కలుపుకుని పార్టీ పెట్టాలని ఆనందయ్య యోచిస్తున్నారు. ఈ మేరకు వచ్చే ఏడాది ఏప్రిల్, మే నెలల్లో ఆనందయ్య రథయాత్ర కూడా చేయనున్నారట. జాతీయ నేతల అండదండలతో బలహీన వర్గాలను కలుపుకుని వెళ్లాలని కసరత్తు చేస్తున్నారు.
నెల్లూరులో కరోనా మందు తయారీతో ఆనందయ్య ప్రాముఖ్యత పొందారు. ఏపీవ్యాప్తంగా ఉచితంగా కరోనా మందును పంపిణీ చేశారు. ఆనందయ్య మందుపై ప్రజలు చూపిస్తున్న ఆసక్తిని గమనించిన ప్రభుత్వం సమగ్ర అధ్యయనం చేయాలని ఆయుష్ శాఖకు ఏపీ ప్రభుత్వం సిఫార్సు కూడా చేసింది. అయినప్పటికీ టీడీపీ దీన్ని రాజకీయం చేసేందుకు ప్రయత్నించింది. దీనిపై స్పందించిన ఆనందయ్య సీఎం జగన్ తాను తయారు చేసిన ఆయుర్వేద ఔషధంపై సానుకూలంగా ఉన్నారని గతంలో తెలిపారు. ప్రజలకు మేలు చేసేందుకే మందు తయారు చేశానని, తనను రాజకీయాల్లోకి లాగొద్దని ఆయన పలు సందర్భాల్లో చెప్పారు.
Also Read:కుప్పం ఓటమిని మభ్యపెట్టేందుకేనా పవన్ దాడి?
అలాంటి ఆనందయ్య ఇప్పుడు రాజకీయ పార్టీ స్థాపన వైపు అడుగులు వేస్తాననడం ఆసక్తిగా మారింది. ఆయన ఏపీతో పాటు తెలంగాణలో కూడా కరోనా నివారణ మందును ఉచితంగా అందజేశారు. జిల్లాలు, గ్రామాల్లో కూడా కరోనా మందును ప్రజలకు అందజేశారు. స్వయంగా ఆనందయ్య మందును తయారు చేశారు. కరోనా సెకండ్ వేవ్ సమయంలో ఆనందయ్య మందు బాగా పని చేస్తోందంటూ సోషల్ మీడియాలో బాగా ప్రచారమైంది. దీంతో ఆయన ఒక్కసారిగా పాపులర్ అయిపోయారు. ఆనందయ్య మందు కోసం తెలుగు వారే కాకుండా చుట్టు పక్కల రాష్రాల నుంచి కూడా ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. పలు సంఘాలు ఆయనను సన్మానించాయి. రధయాత్ర తర్వాత పార్టీని పెట్టే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. కరోనా మందు ద్వారా జనంలో ఆనందయ్య సంపాదించిన పాపులారిటీ రాజకీయంగా ఉపయోగపడుతుందా చూడాలి.