దాదాపుగా 40 సంవత్సరాలక్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆనాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు రెండు రూపాయలకే కిలో బియ్యం పథకాన్ని అమలులోకి తెచ్చారు. అప్పటినుంచి దాదాపుగా దేశంలోని అన్ని పార్టీలు ఎన్నికల సమయంలో పార్టీ ప్రయోజనాల కోసం ఆ హామీ ఇచ్చి అమలు చేయాల్సిన పరిస్థితిలోకి వచ్చాయి. ఈ క్రమంలో యూపీఏ సారధ్యంలోని ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఆహారభద్రతా కార్డుల్ని జారీచేసింది. కానీ తాజాగా కర్ణాటక ప్రభుత్వం ఇందుకు భిన్నంగా నిర్ణయం తీసుకుని మళ్లీ గంటల్లోనే నాలుకు కరుచుకున్న సంఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది.
ప్రజల ఆకలితీర్చే రేషన్ కార్డుల విషయంలో మొండిచేయి చూపేలా కర్ణాటక ప్రభుత్వం ఇటీవల సంచలన నిర్ణయం తీసుకున్నది.. టీవీ, ఫ్రిజ్, ద్విచక్రవాహనం ఉన్నవారు రేషన్ కార్డుకు అనర్హులని, ఒకవేళ రేషన్ కార్డు కలిగి ఉన్నవారు వాటిని ప్రభుత్వానికి అప్పజెప్పాలని రాష్ట్ర మంత్రి తేల్చిచెప్పడం జరిగింది. ఒకవేళ ప్రభుత్వాదేశాలను విస్మరిస్తే చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాలంటూ మంత్రి హెచ్చరించారు. అనర్హులంతా తమ రేషన్ కార్డులను మార్చి 31లోపు ప్రభుత్వానికి అప్పగించాలంటూ డెడ్‌లైన్ విధించారు కూడా.. ఈమేరకు పౌరసరఫరాల శాఖా మంత్రి ఉమేశ్ కత్తి సోమవారం బెళగావిలో కీలక ప్రకటన చేశారు. రేషన్ కార్డుదారులకు ఐదెకరాలకు మించి భూమి ఉండకూదని, అలాగే వారి దగ్గర టీవీ, ఫ్రిజ్, బైక్ ఉండరాదని ఈ నిబంధనలు అతిక్రమిస్తూ రేషన్ కార్డు కలిగి ఉన్నవారు వాటిని వెంటనే ప్రభుత్వానికి అప్పగించాలని బెళగావిలో జరిగిన మీడియా సమావేశంలో మంత్రి ప్రకటించారు.
అలాగే వార్షికాదాయం రూ. 1.20 లక్షలకు మించిన వారుకూడా రేషన్ కార్డుకు అర్హులు కారని కత్తి తేల్చి చెప్పారు. మార్చి 31లోపు వీటిని ప్రభుత్వానికి సరెండర్ చేయాలని స్పష్టం చేశారు. అయితే సోమవారం మంత్రి ప్రకటన చేసి 24 గంటలు గడిచేసిరికే ఈ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగింది. ప్రతిపక్ష కాంగ్రెస్, జెడీఎస్ నేతలు పెద్దఎత్తున రియాక్ట్ అయ్యారు. ప్రజల్లో కూడా గంటల్లోపే విస్తృత చర్చజరిగింది. ఈ క్రమంలో ఇంటెలిజెన్స్ ద్వారా సమాచారం తెలుసుకున్నారో లేక ప్రజా వ్యతిరేకతను అర్ధం చేసుకున్నారో గానీ ప్రభుత్వం మళ్లీ మంత్రితో ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డైరక్షన్ చేసినట్టు కనిపిస్తోంది.
ఈ క్రమంలో మంగళవారం మద్యాహ్నం సదరు మంత్రి మళ్లీ విలేకర్ల సమావేశం నిర్వహించి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారు. పేద ప్రజల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, టివి, ఫ్రిజ్ వంటి నిబంధలనపై తాను గానీ, ముఖ్యమంత్రి యాడ్యూరప్ప కానీ ఎలాంటి ఆదేశాలు ఇవ్వడం లేదని వివరణ ఇచ్చారు. అయితే రాష్ట్రమంత్రి ఉమేశ్ కత్తి చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. బెంగుళూరులోని వివిధ రేషన్ షాపుల ముందు కాంగ్రెస్ కార్యకర్తలు నిరసనలు చేపట్టారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. కొన్నిచోట్ల ప్రజలు కూడా స్వచ్ఛంధగా నిరసనలు చేపట్టారు. దీంతో ప్రభుత్వం తరపున వ్యాఖ్యలు చేసిన మంత్రే ఈ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవడం జరిగింది.
ఇదే విషయంపై కాంగ్రెస్ శాసనసభ్యుడు, మాజీమంత్రి ఖాదర్ మాట్లాడుతూ సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ఈ అంశం తమ ముందుకు వచ్చిందని కానీ రేషన్ కార్డులవల్ల ఎక్కువమంది పేద ప్రజలకు లబ్ది జరుగుతుంది కాబట్టి తాము ఇలాంటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకోలేదని వెల్లడించారు. ఏదేమైనా కోట్లాదిమంది పేదప్రజలు వడ్డీ లేని రుణాల ద్వారా లేదా ప్రతీ నెలా మంత్లీ ఇన్ స్టాల్ మెంట్ల ద్వారా ఫ్రిజ్, టీవీ, బైక్ వంటి వస్తువులు కొనుగోలు చేస్తారు. అయితే ప్రస్తుతం ఉన్న బీజేపీ ప్రభుత్వం సాహసోపేతంగా అలాంటి నిర్ణయం తీసుకుంటే ఆ విధానాన్ని మరో రాష్ట్రంలో అమలు చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. అలాగే టీవీ, బైక్ వంటి వస్తువులు ఈరోజుల్లో నిత్యవసర వస్తుల జాబితాలో చేరిపోయాయని ప్రభుత్వాలు గ్రహించడం మంచిది.