iDreamPost
android-app
ios-app

Karnataka congress mlc – రాజకీయాల్లోకి వచ్చి తప్పు చేశాను – ఎమ్మెల్సీ అభ్యర్థి కన్నీరు

  • Published Dec 02, 2021 | 1:26 PM Updated Updated Mar 11, 2022 | 10:33 PM
Karnataka congress mlc – రాజకీయాల్లోకి వచ్చి తప్పు చేశాను – ఎమ్మెల్సీ అభ్యర్థి కన్నీరు

కుటుంబాన్ని కూడా రోడ్డున పడేస్తున్నారు. రాజకీయాల్లోకి వచ్చి తప్పు చేశాను.. అని ఒక జాతీయ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి విలపించారు. తన కుటుంబంతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తనను ఒక చెడ్డ తండ్రిగా, భర్తగా చిత్రీకరించడానికి ప్రయత్నించారని ఆవేదన వ్యక్తం చేస్తూ భోరున విలపించడంతో పాటు ఒక దశలో కింద కూలబడిపోయారు. కర్ణాటకలో ప్రస్తుతం జరుగుతున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో చోటుచేసుకున్న ఈ పరిణామం అక్కడి రాజకీయాల్లో కలకలం రేపింది.

బెంగళూరు స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న యూసఫ్ షరీఫ్ పై ఆ రాష్ట్ర మంత్రి ఒకరు చేసిన ఆరోపణలు వివాదాన్ని రాజేశాయి. ఆ ఆరోపణలను ఖండించేందుకు కుటుంబ సభ్యులతో సహా షరీఫ్ మీడియా ముందుకు వచ్చినప్పుడు ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి. రూ.1744 కోట్ల ఆస్తులతో ఆయన రాష్ట్రంలోనే అత్యంత సంపన్న నాయకుడిగా పేరు పొందడం విశేషం.

మంత్రి ఆరోపణలు.. బీజేపీ ఫిర్యాదులు

అధికార బీజేపీ, కాంగ్రెసుల మధ్య హోరాహోరీగా సాగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలు పరస్పర ఆరోపణలకు దారి తీస్తున్నాయి. అందులో భాగంగా రాష్ట్ర సహకార శాఖ మంత్రి ఎస్.టి.సోమశేఖర్ కాంగ్రెస్ అభ్యర్థి యూసఫ్ షరీఫ్ పై వ్యక్తిగత ఆరోపణలు చేశారు. షరీఫ్ పై పలు కేసులు ఉన్నాయన్నారు. సొంత భార్యే అతనిపై కేసు దాఖలు చేసిందని చెప్పారు. తమ కుమార్తె పట్ల యూసఫ్ అనుచితంగా వ్యవహరించారంటూ రూ. వెయ్యి కోట్ల పరిహారం కోరుతూ గృహ హింస కేసు పెట్టిందని మంత్రి వెల్లడించారు. మరోవైపు బీజేపీ ప్రధాన కార్యదర్శి రవికుమార్ నేతృత్వంలో బీజేపీ ప్రతినిధి బృందం చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ మనోజ్ కుమార్ మీనాను కలిసి యూసఫ్ షరీఫ్ కోడ్ ఆఫ్ కాండక్టును ఉల్లంఘిస్తున్నారని ఫిర్యాదు చేసింది. ఎన్నికల్లో స్థానిక సంస్థల ఓటర్లను ప్రలోభపెడుతున్నారని, తాను గెలిస్తే రూ.500 కోట్లు ఇస్తానని ఆఫర్ చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

Also Read : AIADMK , Anwar Raja – ఆయన గుర్తింపున్న ఒకే ఒక ముస్లిం నేత, అయినా బహిష్కరణ తప్పలేదు

ఇదంతా తన వ్యాపార, రాజకీయ ప్రత్యర్థుల కుట్ర

తనపై మంత్రి చేసిన ఆరోపణలను యూసఫ్ తీవ్రంగా ఖండించారు. అవన్నీ తన వ్యాపార ప్రత్యర్థి కుట్ర అని.. అందులో బీజేపీ భాగస్వామిగా మారిందని ఆరోపించారు. యూసఫ్ తోపాటు ఆయన కుమార్తె చెప్పిన వివరాల సారాంశం ఇలా ఉంది.. కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ ప్రాంతానికి చెందిన యూసఫ్ షరీఫ్ తుక్కు వ్యాపారి. అందుకే ఆయన్ను స్క్రాప్ బాబు గుజరిబాబు అని పిలుస్తారు. ఆయనకు ఇద్దరు భార్యలు, ఐదుగురు పిల్లలు.

అదృష్టం కలిసివచ్చి వేల కోట్ల ఆస్తులకు అధిపతి అయ్యారు. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డి.కె.శివకుమార్ తో 20 ఏళ్లుగా ఉన్న స్నేహం కారణంగా కాంగ్రెస్‌లో చేరారు. కాగా షరీఫ్ స్నేహితుడైన నవీద్ అనే వ్యక్తి ఉమ్మడిగా అభివృద్ధి చేద్దామని నమ్మబలికి షరీఫ్ నుంచి రూ.300 కోట్ల విలువైన ప్రొపర్టీని కొనుగోలు చేశాడు. కానీ చివరికి మోసం చేశాడు. దాంతో ఇద్దరి మధ్య వ్యాపారపరంగా విభేదాలు పెరిగాయి. అదే సమయంలో షరీఫ్ రెండో వివాహం చేసుకోగా దాన్ని ఉపయోగించుకుని అతని మొదటి భార్య రుక్సానా తాజ్ ను నవీద్ తప్పుదారి పట్టించాడు. బ్రెయిన్ వాష్ చేసి భర్త షరీఫ్ కు గుణపాఠం చెప్పాలని నూరి పోశాడు.

రుక్సానాతోపాటు ఆమె కుమార్తెను కిడ్నాప్ చేసి ఆరు నెలలపాటు యూసఫ్ షరీఫ్ కు దూరంగా ఉంచాడు. ఆ సమయంలోనే ఆమె చేత భర్తపై కేసు పెట్టించాడు. ఈ కేసు విచారణ సందర్బంగానే ఆరు నెలల తర్వాత షరీఫ్ రుక్సానాను కలిశారు. ఆ సందర్బంగా ఆమెతో మాట్లాడుతూ ఆస్తులన్నీ నీవేనని.. నీకంటే అవి తనకు ఎక్కువ కాదని చెప్పడంతో.. ఆమె కరిగిపోయింది. తప్పు తెలుసుకొని భర్తపై పెట్టిన కేసును రద్దు చేసుకుంది. ఇక తన కుమార్తె గురించి చెబుతూ యూసఫ్ ఉద్వేగానికి గురై విలపించారు. అక్కడే కూలబడిపోయారు. మాట్లాడలేక బయటకు వెళ్లిపోవడంతో కుమార్తె ఉమే ఉమ్రా షరీఫ్ కల్పించుకుని నవీద్ చేసిన ఘనకార్యాలను వివరించింది. ఇది పదేళ్ల నాటి కేసు అని వివరించింది.

అప్పుడు తన వయసు 18 ఏళ్ల లోపేనని.. తనకు పెద్దగా ఏమీ తెలియదని చెప్పింది. ఆ సమయంలో తన చేత పలు పత్రాలపై బలవంతంగా సంతకాలు చేయించుకున్నారని ఆరోపించింది. తల్లిదండ్రులను కలపడం కోసమే తాము ఇదంతా చేస్తున్నామని నమ్మించారని వివరించింది. వాస్తవానికి తన తండ్రి చాలా మంచివారని.. అతన్ని అమితంగా అభిమానిస్తున్నానని వెల్లడించింది. ఇందులో ఎవరిది వాస్తవమో తెలియదు గానీ కర్ణాటక రాజకీయాలను మాత్రం ఈ పరిణామాలు కుదిపివేశాయి.

Also Read : Akhilesh Yadav, Yogi Adityanath – బాబు బాటలో అఖిలేష్‌.. కుటుంబం లేనివారంటూ యోగిపై విమర్శలు