iDreamPost
iDreamPost
ఎప్పుడైతే నారప్ప నేరుగా ఓటిటిలో వస్తుందనే వార్త బయటికి వచ్చిందో అప్పటి నుంచి నిర్మాత సురేష్ బాబు మీద అటు అభిమానులు ఇటు ఇండస్ట్రీ వర్గాలు ఏ స్థాయిలో గరంగరంగా ఉన్నారో చూస్తూనే ఉన్నాం. థియేటర్లు త్వరలోనే తెరుచుకోబోతున్న తరుణంలో ఇలా ఆఘమేఘాల మీద వెంకటేష్ లాంటి పెద్ద హీరో సినిమాలు డిజిటల్ కు ఇవ్వడం పట్ల చాలా విమర్శలే వచ్చాయి. దీనికి బదులుగా నారప్ప ప్రమోషన్లలో విస్తృతంగా పాల్గొంటున్న సురేష్ బాబు ఈ కామెంట్లకు గట్టిగానే క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. నారప్పను ఇలా రిలీజ్ చేయాలనే నిర్ణయం వెనుక తానొక్కడినే లేనని ఏం జరిగిందనే దాని గురించి వివరణ ఇచ్చారు.
తమిళ నిర్మాత థాను ఏప్రిల్ లో కర్ణన్ రిలీజ్ చేసినప్పుడు కేవలం రెండు వారాల నిడివిలోనే కరోనా సెకండ్ వేవ్ వల్ల హిట్ టాక్ వచ్చినా కూడా లాభాలు పొందలేకపోయారు. మూడో వారానికే థియేటర్లు మూసేశారు. దాని వల్ల తీవ్ర నష్టం కలిగింది. నారప్పకు కూడా ఆ ముప్పు పొంచి ఉందన్న అనుమానంతో సురేష్ బాబుతో ప్రైమ్ నుంచి వచ్చిన మంచి డీల్ గురించి డిస్కస్ చేశారు. ఇద్దరికీ ఆ ప్రతిపాదన నచ్చేసింది. దీంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. థాను ఒకవేళ నిర్మాణ భాగస్వామి కాకపోయి ఉంటే నారప్పని ఓటిటికి ఇచ్చేవాడిని కాదనే రీతిలో సురేష్ మాటలు అర్థాన్ని ఇచ్చాయి. ఏదైతేనేం మొత్తానికి నారప్ప ఇంకో మూడు రోజుల్లో వచ్చేస్తున్నాడు.
ఓటిటి విప్లవం గురించి సురేష్ బాబు ఇంకాస్త క్లియర్ గా ఓపెన్ అయ్యారు. ఇకపై థియేటర్ ఓటిటి రెండు వ్యవస్థలు సమాంతరంగా ఉంటాయని ఒకటి పోయి మరొకటి ఉంటుందనే ప్రశ్నే లేదని తేల్చి చెప్పేశారు. వేల కోట్లతో తీసిన బ్లాక్ విడోని డిస్నీ లాంటి పెద్ద సంస్థ ఒకేరోజు థియేటర్లలో ఓటిటిలో రిలీజ్ చేసిందని దీన్ని బట్టి భవిష్యత్తు ఎలా ఉండబోతోందనేది అర్థం చేసుకోవాలని చెప్పారు. కంటెంట్ చేతిలో ఉన్నప్పుడు అది ఎవరికి ఏ మార్గంలో రిలీజ్ చేయాలనే దాని మీద నిర్మాతకు పూర్తి హక్కులు ఉంటాయి కాబట్టి ఓటిటి తెచ్చిన మార్పులకు ఎవరో ఒకరు శ్రీకారం చుట్టాలనే ఆలోచనతో తాను ముందడుగు వేసినట్టు చెప్పుకొచ్చారు