iDreamPost
iDreamPost
చాలా ఏళ్ళు గ్యాప్ తీసుకుని ఆ మధ్య మళ్ళీ రావాతో మంచి కంబ్యాక్ ఇచ్చిన సుమంత్ ఆ తర్వాత సుబ్రమణ్యపురం, ఇదం జగత్ అని మరో రెండు సినిమాలు చేశాడు కానీ అవి ఆశించినంత ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి. మళ్ళీ కొంత బ్రేక్ తీసుకుని తాజాగా కపటధారితో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. ఇందాకా దీని ట్రైలర్ విడుదల చేశారు. గత ఏడాది కన్నడలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన కవలుదారికి ఇది అఫీషియల్ రీమేక్. ఒరిజినల్ వెర్షన్ కు పెద్దగా మార్పులు చేయకుండా యథాతథంగా తీసినట్టు కనిపిస్తోంది. ఈ మధ్యకాలంలో మంచి ఆదరణ దక్కించుకుంటున్న క్రైమ్ థ్రిల్లర్స్ లో భాగంగా ఇది రాబోతోంది.
ఇక వీడియో సంగతి చూస్తే నగరంలో ఉన్న ఒక ఫ్లై ఓవర్ కింద ఎప్పుడో పూడ్చిపెట్టబడిన మృతదేహాలు బయటపడతాయి. దీన్ని విచారించేందుకు రంగంలోకి దిగిన పోలీసులకు ట్రాఫిక్ డిపార్మెంట్ లో పని చేసే గౌతమ్(సుమంత్ ) ఇన్వెస్టిగేషన్ లో తాను భాగమవుతానని కోరతాడు. అయితే అనుకున్నంత సులువుగా వ్యవహారం సాగదు. ఎన్నో చిక్కుముడులు ఎదురవుతాయి. దీనికి రిటైర్ అయిపోయిన ఓ పెద్దమనిషి(నాజర్)ని లింక్ ఉందని అర్థమవుతుంది. అసలు ఆ హత్యలు ఎవరు చేశారు, ఏ కాలంలో జరిగాయి, గౌతమ్ ఇంత ఆసక్తి చూపించడానికి కారణం ఏమిటి లాంటి ప్రశ్నలకు సమాధానమే కపటధారి.
టేకింగ్ పరంగా చూస్తే మంచి ఇంటెన్సిటీతో రూపొందించినట్టు తెలుస్తోంది. దర్శకుడు ప్రదీప్ కృష్ణమూర్తి ఒరిజినల్ వెర్షన్ లోని సోల్ చెడకూడదనే ఉద్దేశంతో కేవలం క్యాస్టింగ్ లో మార్పులను మాత్రమే జాగ్రత్తగా డీల్ చేశాడు. వెన్నెల కిషోర్, జయప్రకాష్, సంపత్,సుమన్ రంగనాథ్ ఇతర కీలక పాత్రలు పోషించారు. హీరోయిన్ గా నందిత శ్వేతా నటించింది. రసమతి ఛాయాగ్రహణం అందించగా సైమన్ కె కింగ్ సంగీతం సమకూర్చారు. మొత్తానికి సుమంత్ కు మరో మంచి సబ్జెక్టు అయితే పడింది. అసలే థియేట్రికల్ రిలీజులు మహా కష్టంగా మారిన తరుణంలో దీన్ని ఓటిటికి ఇస్తారా లేక లేట్ అయినా సినిమా హాళ్ల కోసం వేచి చూస్తారా ఇంకా తెలియాల్సి ఉంది.
Teaser Link Here @ https://bit.ly/3jEDHwG