‘చదవేస్తే ఉన్న మతిపోయిందని’ అన్న చందంగా చంద్రబాబు పరిస్ధితి తయారైందని ఏపీ వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు ఎద్దేవా చేశారు. శుక్రవారం కాకినాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మొన్నటి ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుకు చంద్రబాబు ఏం మాట్లాడుతున్నారో తెలియని అయోమయస్థితిలో ఉన్నారన్నారు. బోటును వెలికితీసిన ధర్మాడి సత్యంను టీడీపీ సన్మానించడంలో తప్పులేదు. కానీ.. చంద్రబాబు ధర్మాడికి లేఖ రాసి ఆ లేఖలో ప్రభుత్వాన్ని సీఎం జగన్‌ను విమర్శించడం సరికాదన్నారు. అసలు బోటు వెలికితీత పనులను ధర్మాడి సత్యంకు అప్పగించింది మా ప్రభుత్వం కాదా..? అని ప్రశ్నించారు.
‘బోటు ప్రమాదంలో చనిపోయిన బాధిత కుటుంబాలను బాధ్యతగల ప్రతిపక్ష నేతగా చంద్రబాబు ఎందుకు పరామర్శించలేకపోయారు..? మీ పార్టీ తరపున బోటు భాధితులకు సహాయక చర్యలు అందించారా..? గతంలో మీ హయాంలో జరిగిన పుష్కరాల తొక్కిసలాటలో 29 మంది చనిపోవడానికి కారకులు మీరు కాదా’ అని ప్రశ్నల వర్షం కురిపించారు.