iDreamPost
iDreamPost
ఏపీ బీజేపీ అధ్యక్షుడికి ఎసరు పెడుతున్నారు. కన్నా లక్ష్మీనారయణపై కమలనాథులు కారాలు మిరియాలు నూరుతున్నారు. కన్నాను పదవి నుంచి తొలగించాలంటూ రాయబారాలు మొదలుపెట్టారు. దాంతో ఏపీ బీజేపీ అధ్యక్షుడి వ్యవహారం ఎటు మళ్లుతుందోననే చర్చ మొదలయ్యింది.
కన్నా లక్ష్మీనారాయణ గత ఏడాదిన్నరగా బీజేపీ అధ్యక్ష పీఠంపై ఉన్నారు. కంభంపాటి హరిబాబు స్థానంలో కన్నాకు అవకాశం దక్కింది. కాపు కోటాలో సోము వీర్రాజు రాష్ట్ర అధ్యక్ష పదవిని ఆశించినప్పటికీ అప్పట్లో ఆయన వ్యతిరేకులు అడ్డుపుల్ల వేయడంతో కన్నాకు ఛాన్స్ దక్కింది. అయినప్పటికీ కన్నా లక్ష్మీనారాయణ పార్టీని సమర్థవంతంగా నడపలేకపోతున్నారనే అభిప్రాయంతో బీజేపీలో ఓ వర్గం గుర్రుగా ఉంది. విశాఖకు చెందిన పలువురు నాయకులు ఇప్పటికే అధిష్టానానికి ఫిర్యాదులు చేశారు. అదే సమయంలో కన్నా స్థానంలో మళ్లీ కమ్మ సామాజికవర్గానికే చెందిన నాయకుడికి అధ్యక్ష పీఠం కట్టబెట్టాలనే ఒత్తిడి పెరుగుతున్నట్టు కనిపిస్తోంది. ఈరేసులో ఇటీవల టీడీపీ నుంచి బీజేపీలో చేరిన సుజనా చౌదరి పేరు కూడా వినిస్తుండడం విశేషం.
కన్నా లక్ష్మీనారాయణ తన ఆస్తులను కాపాడుకునేందుకు తప్ప పార్టీని అభివృద్ధి చేసేందుకు ప్రయత్నం చేయడం లేదని బీజేపీ నేతలే ఆరోపిస్తున్న తరుణంలో ఏపీ బీజేపీలో వర్గపోరు ముదురుతున్నట్టు కనిపిస్తోంది. తన పీఠాన్ని కాపాడుకోవాలని కన్నా బలంగా ప్రయత్నిస్తున్నారు. ఇటీవల ప్రధాని మోడీ సహా బీజేపీ అధిష్టానాన్ని కలిసి ఆయన తన మనసులో మాట చెప్పుకున్నారు. బీజేపీని బలోపేతం చేసేందుకు మంచి అవకాశం ఉందని, దానికి గాను తనను కొనసాగించాలని కన్నా విన్నవించుకున్నట్టు ప్రచారం సాగుతోంది.
ఇతర పార్టీల నుంచి పలువురు నేతలు బీజేపీ వైపు చూస్తున్న తరుణంలో కొత్త, పాత నేతలను సమన్వయం చేయడం పెద్ద సమస్యగా మారబోతోందని బీజేపీ అధిష్టానం కూడా భావిస్తోంది. దానికి తగ్గట్టుగా పార్టీని సమర్థవంతంగా నడపగల నాయకుడి కోసం ఎదురుచూస్తున్నట్టు తెలుస్తోంది. సుదీర్ఘకాలంగా ఏపీలో బీజేపీ దాదాపుగా వెంకయ్యనాయుడు ఆశీస్సులతో సాగుతోంది. ఆయన ఎవరిని బలపరిస్తే వారే కమల రథసారధిగా సాగుతున్నారు. కంభంపాటి హరిబాబుకి కూడా వెంకయ్య ఆశీస్సులు పుష్కలంగా ఉన్నట్టు కనిపించేది. కానీ ఉపరాష్ట్రపతి హోదాలో క్రియాశీలక రాజకీయాలకు ఆయన్ని దూరం చేసిన తర్వాత బీజేపీ వ్యవహారాల్లో మార్పు కనిపిస్తోంది. ఆ క్రమంలోనే కన్నా తెరమీదకు వచ్చారు. ఇప్పుడు ఆయన పదవి ఊగిసటలాటలో పడడంతో తదుపరి అవకాశం ఎవరికన్నదే ఇప్పుడు ఆసక్తిదాయకంగా మారుతోంది. ఈ విషయంలో ఎవరికి వారు ప్రయత్నాలు చేస్తున్నట్టు కనిపిస్తోంది.