ముఖ్యమంత్రి జగన్ తక్షణం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడికి క్షమాపణ చెప్పాలని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ డిమాండ్. ఎందుకబ్బా అని కన్నా మాటలను శ్రద్ధగా వింటే…ఓరినీ పాసుగులా అని అనిపించకమానదు. ‘‘ఉప రాష్ట్రపతి పదవి దేశంలోనే రెండో అత్యున్నత పదవి. అటువంటి పదవిలో ఉన్న వెంకయ్యనాయుడు లాంటి వ్యక్తిని ఏకవచనంతో సంబోధించటమే కాకుండా కనీస గౌరవం కూడా ఇవ్వనందుకు సీఎం జగన్ క్షమాపణ చెప్పాలి’’ అని కన్నా లక్ష్మినారాయణ డిమాండ్ సారాంశం.
జగన్ తన ఉపన్యాసంలో స్పష్టంగా వెంకయ్య గారు అని సంబోధించారు. ఆయన్నే కాదు చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌లను కూడా గారు అనే సంబోధించారు. మరి కన్నా లక్ష్మినారాయణకు జగన్ ప్రసంగంలో ఎక్కడ ఏకవచనం వినిపించిందో, కనిపించిందో అర్థం కావడం లేదు. అంతేకాదు ఉపరాష్ర్టపతి పదవి దేశంలోనే రెండో అత్యున్నత పదవి అని…అలాంటి పదవిలో ఉన్న వెంకయ్యనాయుడు విమర్శలకు అతీతుడనేది కన్నా లక్ష్మినారాయణ లాజిక్. ప్రజల కంటే ఏ పదవి గొప్పది కాదనే వాస్తవాన్ని కన్నా గ్రహిస్తే మంచిది. అసలు వెంకయ్యనాయుడిని జగన్ ప్రశ్నించడమే కన్నా బాధగా అర్థం చేసుకోవాలేమో.
మరో ఒకట్రెండు నెలల్లో కన్నా పదవీకాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో తన పదవీ రెన్యువల్ కోసం ఆయన ఎక్కని గడప, దిగని గడప అంటూ లేదు. ఈ నేపథ్యంలోనే వెంకయ్యనాయుడి మెహర్బాని కోసమే జగన్‌పై ఇటీవల కన్నా విమర్శలని ఆ పార్టీ నేతలు, కార్యకర్తలే గుసగుసలాడుకుంటున్నారు.
ఇంకో ముఖ్యమైన సంగతి. ఏంటేంటి…ఒక మతాన్ని రాష్ట్ర ప్రజలపై బలవంతంగా రుద్దే ప్రయత్నాల్లో భాగంగానే జగన్ సర్కార్ ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశ పెడుతోందా?…అబ్బా ఎంత గొప్పగా కనుక్కున్నార్ సార్. మీరు పరిశోధించి, శోధించి ఆవిష్కరించిన ఓ గొప్ప సత్యానికి వచ్చే ఏడాది నోబెల్ ప్రైజ్ వచ్చే అవకాశాలు లేకపోలేదు. ఎటూ ప్రపంచంలో నోబెల్ బహుమతి పొందినవారిలో 98శాతం మంది ప్రాథమిక విద్యను వారి మాతృభాషలో చదివిన వారికి వచ్చిందని తమరు చెప్పారు కదా. అందులో మీరూ ఒకరుగా చరిత్రకెక్కుతారు సార్.