iDreamPost
iDreamPost
రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న 12 మున్సిపాలిటీల్లో కడప జిల్లా కమలాపురం ఒకటి. వైఎస్సార్సీపీకి గట్టి పట్టున్న కమలాపురం నియోజకవర్గ కేంద్రంగా ఉంది. ఈ నియోజకవర్గంలో గత రెండు ఎన్నికల్లో సీఎం జగన్ మేనమామ పి.రవీంద్రనాథ్ రెడ్డి గెలిచి ప్రస్తుతం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ వైఎస్సార్సీపీయే అత్యధిక స్థానాలు గెలుచుకుంది. అయితే జగన్ మేనమామ ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గంలోని కమలాపురం నగర పంచాయతీని ఎలాగైనా చేజిక్కించుకుని సత్తా చాటాలని తెలుగుదేశం లక్ష్యంగా పెట్టుకుంది. ఇతర మున్సిపాలిటీల్లో అనేక వార్డులు వైఎస్సార్సీపీకి ఏకగ్రీవంగా దక్కినా.. కొన్ని చోట్ల టీడీపీకి అభ్యర్థులే లేకపోయినా కమలాపురంలో మాత్రం మొత్తం 20 వార్డుల్లోనూ అభ్యర్థులను నిలబెట్టగలిగింది. అంతవరకు బాగానే ఉన్నా ఎన్నికల ఖర్చులకు నిధులు అందక ఆ పార్టీ అభ్యర్థులు కటకటలాడుతున్నారు. ఇటు నియోజకవర్గ ఇంఛార్జిగానీ.. అటు అధిష్టానం గానీ కాసులు రాల్చకపోవడంతో ఆందోళన చెందుతున్నారు.
టికెట్లు ఇవ్వడమే ఎక్కువ!
టీడీపీ తరఫున బరిలో ఉన్న అభ్యర్థులు నిధుల కోసం దిక్కులు చూస్తున్నారు. ఈ ఎన్నికల పర్యక్షణకు అసెంబ్లీ ఇంఛార్జీలనే వారి పరిధిలోని మున్సిపాలిటీలకు పర్యవేక్షకులుగా నియమించిన టీడీపీ అధిష్టానం.. ఎన్నికల ఖర్చులను వారే భరించాలని కూడా స్పష్టం చేసింది. అయితే పార్టీ కమలాపురం అసెంబ్లీ ఇంఛార్జి పుత్తా నరసింహారెడ్డి అన్ని వార్డుల్లో అభ్యర్థులను నిలబెట్టినా.. వారి ఎన్నికల ఖర్చు గురించి పట్టించుకోవడం లేదు. ఆ విషయం ఆయన వద్ద ప్రస్తావిస్తే టికెట్లు ఇవ్వడమే గొప్ప.. మళ్లీ ఎన్నికల ఖర్చులు ఇవ్వడమా.. అని ప్రశ్నిస్తున్నారని కొందరు అభ్యర్థులు వాపోతున్నారు. ఎవరి ఖర్చు వారే భరించుకోవాలి.. ఒక్క పైసా అయినా ఇచ్చేది లేదని ఖరాఖండీగా తేల్చి చెప్పేశారట. మరోవైపు పార్టీ అధిష్టానం కూడా ఇంతవరకు ఆర్థిక సాయం ఊసు ఎత్తకపోవడంతో ఆర్థిక స్థోమత లేని పలువురు అభ్యర్థులు చేతులెత్తేస్తున్నారు.
డబ్బుల్లేకుండా గెలిచేదెలా..
నియోజకవర్గ ఇంఛార్జి పుత్తా నరసింహారెడ్డితో పాటు కమలాపురంలో పర్యవేక్షణకు పక్కనున్న పులివెందుల, ప్రొద్దుటూరు నియోజకవర్గాల ఇంఛార్జీలు బీటెక్ రవి, ప్రవీణ్ కుమార్ లను పార్టీ నియమించింది. వారు కూడా ఖర్చుల విషయంలో చేతులెత్తేశారు. విషయాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి చేతులు దులిపేసుకున్నారు. పార్టీలో పుట్టాకు ధీటుగా ఎదుగుతున్న సాయినాథ్ శర్మ కొంత సర్దుబాటు చేస్తున్నా అది ఏమాత్రం సరిపోవడం లేదని అభ్యర్థులు అంటున్నారు. అధికార పార్టీని ఓడించాలని టార్గెట్ పెట్టిన పెద్దలు ఖర్చుల విషయం పట్టించుకోకపోతే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. అధికార పార్టీని ఢీకొట్టాలంటే ఎంతో కొంత ఖర్చు చేయాలి కదా అని అంటున్నారు. ఎన్నికలకు మరో మూడు రోజులే ఉన్న తరుణంలో వారంతా ఇప్పుడు పార్టీ అధిష్టానం వైపే చూస్తున్నారు. ఈ పరిస్థితుల్లో టీడీపీ ప్రచారం పెద్దగా జరగడంలేదు.