iDreamPost
android-app
ios-app

రాజకీయ ‘కళ’వెల

రాజకీయ ‘కళ’వెల

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో.. టీడీపీ ఆవిర్భావం తర్వాత ఉవెత్తున ఎగిసిన రాజకీయ తారల్లో ముందు వరుసలో ఉండే నేతల్లో కిమిడి కళా వెంకట్రావు ఒకరు. దాదాపు నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో ఎన్నో పదవులు అలంకరించి.. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఏడేళ్లు పనిచేసిన ఈ నేత రాజకీయ ప్రభ మసకబారి.. మళ్లీ మొదటికొచ్చింది. పక్క నియోజకవర్గం నుంచి వచ్చినా ఆదరించి గెలిపించిన ప్రజలను, పార్టీ కార్యకర్తలను విస్మరించడం, తన తనయుడికి రాజకీయ వారసుడిగా వారిపై రుద్దాడానికి చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టడంతో.. పోయినచోటే వెతుక్కోవాల్సిన దుస్థితిలో పడ్డారు.

టీడీపీతో వెలుగులోకి..

టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో ఉన్న కళా వెంకట్రావు అప్పటి ఉనుకూరు నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఎన్టీ రామారావు, చంద్రబాబు మంత్రివర్గాల్లో దేవాదాయ, హోమ్, వాణిజ్యపన్నులు, విద్యుత్తు వంటి కీలక శాఖలకు మంత్రిగా చేశారు. టీటీడీ ఛైర్మన్ గా కూడా పని చేశారు. 1994లో రాష్ట్రమంతటా టీడీపీ గాలి వీచినా.. ఉత్తరాంధ్రలో ఒక్క ఉనుకూరులో మాత్రం కళా వెంటరావు ఓడిపోయారు. అయితే పార్టీ ఆయన్ను గుర్తించి రాజ్యసభ సభ్యత్వం ఇచ్చింది. ఆ తర్వాత టీడీపీలో సంక్షోభం తలెత్తినప్పుడు చంద్రబాబుకు జై కొట్టారు. ఆయన మంత్రవర్గంలో స్థానం పొందారు.

ప్రజారాజ్యంలోకి.. మళ్లీ టీడీపీలోకి..

వైఎస్ హవాతో 2004 ఎన్నికల్లో టీడీపీ ఇతమి చెందడంతో రాజకీయంగా వెనుకబడిన కళా 2008 లో సినీ నటుడు చిరంజీవి ఏర్పాటు చేసిన ప్రజారాజ్యం పార్టీలో చేరారు. నియోజకవర్గాల పునర్విభజనలో కళా సొంత నియోజకవర్గం ఉనుకూరు తెరమరుగైపోయింది. కొత్తగా ఏర్పడిన రాజాం నియోజకవర్గాన్ని ఎస్సీలకు రిజర్వ్ చేశారు. దాంతో 2009 ఎన్నికల్లో ఆయన ఎచ్చెర్ల నుంచి ప్రజారాజ్యం అభ్యర్థిగా పోటీ చేసి కేవలం 22 వేల ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. అనంతర పరిణామాల్లో ప్రజారాజ్యం కాంగ్రెసులో విలీనం కాగా.. కళా మళ్లీ సొంత గూటికి చేరుకున్నారు. 2014 ఎన్నికల్లో ఎచ్చెర్ల నుంచే పోటీ చేసి గెలిచారు. విద్యుత్ మంత్రి పదవి చెప్పట్టారు. అంతకు ముందు రాష్ట్ర విభజన నేపథ్యంలో కళాను పార్ట్ ఏపీ అధ్యక్షుడిగా నియమించారు. ఆ హోదాలో ఆయన దాదాపు ఏడేళ్లు పనిచేశారు.

పార్టీలో తగ్గిన హవా

పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా, సీనియర్ నేతగా కొన్నేళ్లుగా వెలిగిన కళాను.. కొన్నాళ్లుగా పార్టీ అధినేత పక్కనపెట్టారు. అధ్యక్ష పదవి నుంచి తప్పించి.. తప్పదన్నట్లుగా పొలిటీబ్యూరో సభ్యుడిగా పెట్టారు. వాస్తవానికి కాపు సామాజికవర్గానికి చెందిన కళాను.. ఇన్నాళ్లు ఆ కోణంలోనే చంద్రబాబు ప్రాధాన్యత ఇచ్చేవారు. ఉత్తరాంధ్రలో బొత్స సత్యనారాయణ మొదట కాంగ్రెసులో.. ప్రస్తుతం వైఎస్సార్ సీపీలో కాపు వర్గానికి ప్రతినిధిగా ఉండటంతో.. టీడీపీలో అటువంటి నేతలు లేక కళా కు ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు. అయితే కాపు వర్గం నుంచి పార్టీలో యువనేతలను తయారు చేయడంలో విఫలమయ్యారన్న అసంతృప్తి చంద్రబాబులో ఉంది. అందుకే కళా ను పక్కన పెట్టారన్న ప్రచారం ఉంది.

స్థానిక సెగ..

ఎచ్చెర్ల నుంచి 2014లో ఎన్నికై మంత్రి పదవి చేపట్టిన కళా వెంకట్రావు నియోజక వర్గాన్ని మాత్రం పట్టించుకోలేదు. రాజాం కేంద్రంగానే అన్ని కార్యక్రమాలు నిర్వహించేవారు. నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలను సైతం అక్కడికే రప్పించుకునేవారు. ఫలితంగా ఎచ్చెర్ల టీడీపీ శ్రేణులతోపాటు ప్రజాల్లోనూ తీవ్ర అసంతృప్తి రాజుకుంది. దీనికితోడు కళా ప్రతినిధులుగా ఆయన మేనల్లుడైన మాజీ ఎంపీపీ విష్ణుమూర్తి, పి ఏ నాయుడుల అక్రమ దందాలు, పెత్తనం తీవ్ర వ్యతిరేకత పెంచాయి. ఇవన్నీ 2019 ఎన్నికల్లో స్థానిక నినాదాన్ని తెరపైకి తెచ్చాయి. ఫలితంగా స్థానికుడైన వైఎస్సార్ సీపీ అభ్యర్థి గొర్లె కిరణ్ కుమార్ చేతిలో కళా ఓడిపోవాల్సి వచ్చింది.

వారసుడి కోసం తాపత్రయం

తన రాజకీయ వారసుడిగా తనయుడు కిమిడి రామ్ మల్లిక్ నాయుడును ప్రమోట్ చేసేందుకు కళా చేస్తున్న ప్రయత్నాలు కూడా ఫలితమివ్వడం లేదు. రెండు నెలల క్రితం టీడీపీ రాష్ట్ర కార్యవర్గాన్ని ప్రకటించినప్పుడు రాజాంలో ఉండే రామ్ మల్లిక్ ను ఎచ్చెర్ల నియోజకవర్గ కోటాలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి పదవి ఇప్పించుకోవడం.. స్థానిక నేతల్లో ఆగ్రాహం రేకెత్తించింది.

నియోజకవర్గానికి చెందని వ్యక్తిని.. ఇక్కడి కోటాలో ఎలా పదవి ఇస్తారని సహాయనిరాకరణకు దిగారు. బుజ్జగించేందుకు రాజాం రమ్మని కళా కబురు పెట్టినా ఎవరూ వెళ్ళలేదు సరికదా.. నియోజకవర్గ పర్యటనకు వచ్చిన మల్లిక్ ను కలిసేందుకు కూడా చాలామంది ఇష్టపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకున్న కళా వెంకట్రావు గత కొద్ది రోజులుగా నియోజకవర్గంలో పర్యటిస్తూ పరిస్థితిని చక్కదిద్దుకునేందుకు తిప్పలు పడుతున్నారు.