ఒకప్పుడు ఏమో కానీ ఇప్పుడు పాన్ ఇండియా లెవల్ లో మార్కెట్ సంపాదించుకున్న ప్రభాస్ కొత్త సినిమా విడుదలకు బాలీవుడ్ లోనూ ఎవరూ పోటీ రాలేని పరిస్థితి నెలకొంది. గత ఏడాది సాహోకు ఇలాంటి సిచువేషన్ వచ్చినప్పుడు హిందీ నిర్మాతల అభ్యర్థన మేరకు మన సినిమాను రెండు వారాలు వాయిదా వేసుకోవడం తెలిసిన సంగతే. త్వరలో రాబోతున్న రాధే శ్యామ్ మీద కూడా ఏ స్థాయిలో అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జూలై 30 రిలీజ్ ని ఇది వరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇది అనౌన్స్ అయ్యాక ఇంకెవరు దాని దగ్గరకు వెళ్లే సాహసం చేయరు అనుకున్నారందరూ. అయితే కొత్త ట్విస్ట్ వచ్చి పడింది.
అలియా భట్ టైటిల్ రోల్ లో సుప్రసిద్ధ దర్శకులు సంజయ్ లీలా భన్సాలీ రూపొందిస్తున్న గంగు బాయ్ కథియావాడిని కూడా జులై 30నే విడుదల చేయబోతున్నట్టు ఇందాక అధికారికంగా ప్రకటించారు. అంటే రాధే శ్యామ్ తో పోటీకి సై అని క్లియర్ గా చెప్పినట్టే. ఒకవేళ క్లాష్ అవ్వకూడదు అనుకుంటే ముందే ప్రభాస్ సినిమా డేట్ వచ్చింది దానికి ముందో లేదా వెనకో సెట్ చేసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఇంత స్పష్టంగా చెబుతున్నారంటే కంటెంట్ మీద గట్టి నమ్మకమే ఉన్నట్టుంది. ముంబై నేర సామ్రాజ్యాన్ని వణికించిన గంగు బాయ్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా రూపొందింది. అంచనాలు కూడా భారీగా ఉన్నాయి.
తాజాగా సోషల్ మీడియాలో రాధే శ్యామ్ వాయిదా పడుతుందేమోననే ప్రచారం మొదలయ్యింది. నిజానికి రెండు వేర్వేరు కథలు. జానర్లు కూడా సంబంధం లేనివి. అయితే క్రేజ్ పరంగా గంగు బాయ్ ని తక్కువ చేసి చూడలేం. అందులోనూ అక్కడి నేటివిటీ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన రియల్ గ్యాంగ్ స్టర్ కథ కాబట్టి క్రేజ్ కూడా భారీగా ఉంటుంది. అసలే తన మైదాన్ కు పోటీగా ఆర్ఆర్ఆర్ ని దింపారని గగ్గోలు పెడుతున్న బోని కపూర్ ఇప్పుడు రాధే శ్యామ్ కు కాంపిటీషన్ కు తెచ్చిన గంగు బాయ్ గురించి ఏమంటారో. మొత్తానికి సోలోగా వస్తుందనుకున్న రాధే శ్యామ్ కు గంగు బాయ్ గట్టి ట్విస్టే ఇచ్చింది. చూడాలి మున్ముందు ఏమైనా మార్పు ఉంటుందేమో.