iDreamPost
android-app
ios-app

ఉపాధ్యాయుడిపై లైంగిక వేధింపుల ఆరోపణలు – నేరం రుజువైనా శిక్షించలేకపోతున్న కోర్టు

ఉపాధ్యాయుడిపై లైంగిక వేధింపుల ఆరోపణలు – నేరం రుజువైనా శిక్షించలేకపోతున్న కోర్టు

ఒక వ్యక్తిపై అత్యాచార ఆరోపణలు వెల్లువెత్తాయి. పైగా అతనో ఉపాధ్యాయుడు. బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన వృత్తిలో ఉండి ఆ వృత్తికే కళంకం తెచ్చాడు.. తన దగ్గర విద్యను అభ్యసించడానికి వచ్చిన విద్యార్థులను లైంగికంగా వేధించాడు. ఇప్పుడు ఆయనపై లైంగిక దాడికి గురైన బాధితులు పిర్యాదు చేసారు. నేరం చేసినట్లు సదరు వ్యక్తి కూడా ఒప్పుకున్నాడు. కేసు తుది విచారణ దశకు చేరుకుంది. కానీ కోర్టు అతన్ని శిక్షించాలా వద్దా అన్న డోలాయమానంలో పడింది.

నేరం చేసిన వ్యక్తే నేరాన్ని ఒప్పుకున్నాడు కదా శిక్షించడానికి ఇంకేం ఇబ్బంది ఉందనుకుంటున్నారా? కానీ ఆయన్ని శిక్షించాలి అంటే చాలా ఇబ్బందులు ఉన్నాయి. అందుకే కోర్టు కూడా శిక్ష విధించడానికి ఆలోచనలో పడింది.

వివరాల్లోకి వెళితే ఆస్ట్రేలియాలోని కాన్‌బెర్రాకు చెందిన పీటర్ జాన్‌ ఒనీల్‌ (61) గతంలో ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న సమయంలో ఆరుగురు విద్యార్థినులను లైంగికంగా వేధించినట్లు ఆయనపై కేసు నమోదయింది. బాధితుల ఫిర్యాదు మేరకు కోర్టులో విచారణ చేపట్టారు. విచారణలో పీటన్‌ జాన్‌ ఒనీల్‌ కూడా తన తప్పును అంగీకరించడంతో కోర్టు అతడిని శిక్షిస్తుందని అందరూ ఊహించారు. కానీ అతడిని జైలుకు పంపే పరిస్థితి లేక కోర్టు తల పట్టుకుంది. కారణం పీటన్‌ జాన్‌ ఒనీల్‌ కి ఉన్న ఊబకాయ సమస్య ఇప్పుడు కోర్టు సమస్యగా మారిపోయింది.

ఒకప్పుడు మాములు వ్యక్తిగా ఉన్నా పీటర్ క్రమక్రమంగా లావుగా మారిపోయాడు. ఎంత లావంటే తన పనులు కూడా తాను చేసుకోలేనంత లావు అన్నమాట. భారీకాయాన్ని ముందుకు కదపలేక వీల్‌ఛైర్‌కే పరిమితమయ్యాడు. మరొకరు సాయంగా ఉండాల్సిన పరిస్థితి. ఊబకాయంతో పాటు అనేక అనారోగ్య సమస్యలు కూడా పీటన్ చుట్టుముట్టాయి.

పీటర్‌ను జైలుకు తరలించాలంటే కోర్టు ప్రత్యేక ఏర్పాట్లు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో కోర్టు ఆలోచనలో పడింది. ఇప్పుడతన్ని శిక్షించాలి అంటే జైలుకు తరలించాలి. అందుకు ఏకంగా ప్రత్యేక హెలికాప్టర్ కావాలి. అంతేకాకుండా జైల్లో కూడా అతడికి ప్రత్యేక వైద్య సదుపాయాలు కల్పించాలి. ప్రత్యేక జైలు గదిని నిర్మించాలి. అతనికో సహాయకుడిని నియమించాలి. ఇలా పీటర్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయడానికి కనీసం 40 వేల డాలర్లు (భారత కరెన్సీలో రూ. 30 లక్షలు) ఖర్చవుతాయని కోర్టు అంచనా వేసింది. దీంతో కోర్టు పునరాలోచనలో పడింది.

పీటర్‌కు జైలు శిక్ష విధించడం సాధ్యం అవుతుందా లేదా అనే విషయాలపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని అధికారులను కోర్టు ఆదేశించింది.ఈ నేపథ్యంలో అతడి నేరం రుజువైనా సరే శిక్షను పెండింగ్‌లో పెట్టింది. ఎలాగూ అతను పారిపోలేడు కాబట్టి అప్పటివరకు అతడు ఇంట్లోనే ఉండాలని న్యాయస్థానం సూచించింది. నివేదిక వచ్చిన తర్వాత ఈ కేసులో తీర్పును వెల్లడిస్తామని కోర్టు వ్యాఖ్యానించడం విశేషం.