iDreamPost
iDreamPost
జనసేన కీలకనేత, సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ ఆ పార్టీకి గుడ్‌బై చెప్పినట్టు సమాచారం. ఈ విషయమై మరీ ముఖ్యంగా విశాఖపట్నంలో విస్తృత చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఆయన విశాఖ పార్లమెంట్ నుంచి పోటీ చేయడంతో పాటు జనసేన ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన లాంగ్‌మార్చ్‌ను సక్సెస్ చేసేందుకు ఆయన ఎక్కడా కనిపించడం లేదు.
వైసీపీ అధినేత, ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసుకు సంబంధించి లక్ష్మినారాయణ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా గుర్తింపు పొందారు. మహారాష్ర్ట కేడర్ అధికారిగా ఆ రాష్ర్టానికి వెళ్లిన ఆయన వీఆర్ ఎస్ ఇచ్చారు. తన సొంత రాష్ర్టమైన ఆంధ్రప్రదేశ్‌కు వచ్చి రైతుల సమస్యలపై రాష్ర్టమంతా విస్తృతంగా తిరిగారు. రాజకీయాలపై ఆసక్తి కనబరచడంతో బీజేపీ, టీడీపీ, జనసేనలలో చేరుతారని విస్తృత ప్రచారానికి తెరదించుతూ సార్వత్రిక ఎన్నికలకు ముందు పవన్‌కల్యాణ్ పంచన చేరారు. సార్వత్రిక ఎన్నికల్లో విశాఖ పార్లమెంట్ నుంచి పోటీ చేసి 2,88,874 ఓట్లు సాధించి మూడో స్థానంలో నిలిచారు. ఓటమిపాలైనప్పటికీ ఆ జిల్లా ప్రజాసమస్యలను తెలుసుకుంటూ వచ్చారు.
అయితే కొంతకాలంగా ఆయన పవన్‌కల్యాణ్‌తో అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. బీజేపీలో చేరుతారనే వాదన బలంగా వినిపిస్తూ వచ్చింది. అయితే పవన్‌కు అవసరం ఉన్నంత వరకూ జనసేనలోనే ఉంటానని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో ఇసుక కొరతతో భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డునపడ్డారని, వారి సమస్యను పరిష్కరించాలని కోరుతూ జనసేనాని పవన్ విశాఖలో లాంగ్‌మార్చ్‌కు పిలుపునిచ్చారు.
ఈ నెల 3న చేపట్టిన లాంగ్‌మార్చ్‌కు రావాలని టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు, బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణకు పవన్ ఫోన్ చేశారు. అయితే తన పార్టీలో కీలకనేత, విశాఖ నుంచి పోటీ చేసిన జేడీ లక్ష్మినారాయణతో పవన్ ఎలాంటి చర్చలు జరపలేదని సమాచారం.
జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ అధ్యక్షుడు నాదెండ్ల మనోహర్, మరోనేత నాగబాబు విశాఖలో రెండురోజులుగా మకాం వేసి లాంగ్‌మార్చ్ విజయవంతానికి విశాఖ జిల్లాలోని నియోజకవర్గాల వారీగా నేతలతో సమీక్షలు జరుపుతున్నారు. జేడీ లక్ష్మినారాయణ ఎందుకు విశాఖ రాలేదనే చర్చ పార్టీ నేతలతో పాటు జిల్లా ప్రజానీకంలో చర్చ జరుగుతోంది.
సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తర్వాత ఒక్కొక్కరుగా జనసేనను వీడుతున్నారు. విశాఖ జిల్లాలోని పాడేరు నుంచి పోటీ చేసి ఓడిపోయిన మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు నేడోరేపో పార్టీకి రాజీనామా చేస్తారనే ప్రచారం విస్తృతంగా సాగుతోంది. ఈ అందుకే ఆయన లాంగ్‌మార్చ్ వ్యవహారానికి దూరంగా ఉన్నారు. ఇదే జాబితాలో జేడీ లక్ష్మినారాయణ ఉన్నారనే సమాచారం జనసేన కార్యకర్తలను కలవరపెడుతోంది.