iDreamPost
iDreamPost
ఒకప్పుడు ఎన్టీఆర్ ని గద్దెదింపి తాను అధికారంలోకి రావడానికి ఎన్నో ఎత్తులు వేసిన చంద్రబాబు కి ఇప్పుడు చిన్న ఎన్టీఆర్ తో చిక్కులు తప్పేలా లేవు. తనయుడి కోసం చంద్రబాబు ఎంత తపన పడుతున్నా టీడీపీ శ్రేణుల మనసుల్లో మాత్రం ఎన్టీఆర్ ఉన్నట్టు అనేక సందర్భాల్లో రూఢీ అయ్యింది. కుప్పం నుంచి బందరు వరకూ అన్ని చోట్లా బాబు మీటింగులలోనే అది బయటపడుతోంది. టీడీపీని కాపాడేందుకు ఎన్టీఆర్ బరిలోకి దిగాల్సిందేననే డిమాండ్ వినిపిస్తోంది. పరోక్షంగా ఇక చంద్రబాబు పని అయిపోయిందని, చినబాబు వల్ల ఏపని కాదనే అభిప్రాయం తమ్ముళ్ల నుంచే వ్యక్తం కావడంతో బాబుకి పెద్ద తలనొప్పిగా తయారయ్యింది.
తెలుగుదేశం పార్టీని తన వారసుడికి అప్పగించేందుకు చంద్రబాబు చాలా ప్రయత్నాలే చేశారు. ప్రభుత్వంలో ఉన్న కాలంలో కీలక బాధ్యతలు, ప్రధానమైన పోర్టుఫోలియోలు ఆయనకు కట్టబెట్టడం వెనుక కారణమదే. ఇటీవల ఏబీఎన్ రాధాకృష్ణ, తెలంగాణా పీసీసీ చీఫ్ ప్రైవేటు సంభాషణల్లో కూడా లోకేష్ భవితవ్యం మీద ఆందోళన వ్యక్తం కావడం గమనిస్తే బాబు శిబిరం ఎంతగా తల్లడిల్లిపోతుందో అర్థమవుతోంది. సొంత తండ్రిగా చంద్రబాబుకి ఎంత కలవరం కులుగుతోంది ఊహించలేం. అందుకే నారా లోకేష్ నాయకత్వాన్ని పార్టీ స్వీకరించే పరిస్థితి లేకపోవడంతో చంద్రబాబుకి ఎటూ పాలుపోవడం లేదు. స్వయంగా తానే బరిలో దిగి పరిస్థితిని చక్కదిద్దాలని చూస్తున్నా, యంగ్ టైగర్ వ్యవహారం తేల్చాలంటూ కార్యకర్తలు కోరుతున్నారు.
Also Read:‘నెక్స్ట్ సీఎం ఎన్టీఆర్’ నినాదాలతో.. చంద్రబాబుకు తెలుగు తమ్ముళ్ల స్వాగతం
ఇది చంద్రబాబుకి మింగుడపడని వ్యవహారం. ఇప్పటికే ఎన్టీఆర్ కుటుంబాన్ని చంద్రబాబు చాలా ఇబ్బందులు పాలుజేశారని ప్రచారంలో ఉంది. చివరకు ఎన్టీఆర్ మామ నార్నే శ్రీనివాస్ కూడా చంద్రబాబు నుంచి సహకారం లేకపోవడంతో వైఎస్సార్సీపీ గూటిలో చేరారు. జగన్ కి జై కొట్టారు. దాంతో చంద్రబాబుకి ఎన్టీఆర్ మీద ఏమాత్రం సానుకూలత లేదనే వాదన ఉంది. పైగా తనయుడికి పోటీగా వచ్చి, తన ఆశల మీద నీళ్లు జల్లేలా ఎన్టీఆర్ తీరు ఉందని బాబు సందేహిస్తున్నారు. ఈ నేపథ్యంలో నారా లోకేష్ తప్ప టీడీపీకి మరో దారి లేదనే సంకేతాలు ఆయన ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. కానీ పార్టీ శ్రేణులు ఎన్టీఆర్ ని తప్ప మరొకరిని స్వీకరించేందుకు ససేమీరా అనేలా ఉన్నారు. ఈ పరిణామాలు ఎక్కడికి దారితీస్తాయన్నదే ఆసక్తికరం.
చంద్రబాబు రాబోయే ఎన్నికల నాటికి సంపూర్ణ ఆరోగ్యంతో బరిలో దిగితే అప్పుడు చినబాబు పాత్ర ఏమిటన్న ప్రశ్న ఉండదు. కానీ దానికి భిన్నంగా ఏమి జరిగినా పరిణామాలు కొత్త మలుపు తీసుకుంటాయి. టీడీపీలో ఉన్న నాయకుల తనయులతో కలిసి తనకంటూ ఓ టీమ్ ఏర్పాటు చేసుకోవాలని లోకేష్ యత్నిస్తున్నారు. కానీ అందులో కొందరు లోకేష్ నాయకత్వాన్ని అంగీకరించే అవకాశం లేదనే వాదన ఉంది. అన్నింటికీ మించి ఎన్టీఆర్ కి రాజకీయ ఆసక్తి ఏమేరకన్నది కీలకాంశం. నిజంగా ప్రత్యక్ష రాజకీయాల పట్ల చాలా ఆసక్తి ఉన్నట్టే కనిపిస్తున్న ఎన్టీఆర్ తీసుకునే నిర్ణయాన్ని బట్టి లోకేష్ భవిష్యత్తు, టీడీపీ నడత ఆధారపడి ఉంటాయని చెప్పవచ్చు. దాంతో అందరూ ఎన్టీఆర్ వైపు మొగ్గుచూపే స్థితి వస్తే బాబు ఏమేరకు దానిని సహించగలరన్నది కూడా సందేహమే.