iDreamPost
android-app
ios-app

నిరాడంబరంగా జో బైడెన్ ప్రమాణ స్వీకారం

నిరాడంబరంగా జో బైడెన్ ప్రమాణ స్వీకారం

అత్యంత నిరాడంబరంగా, సాదాసీదాగా కేవలం 1000 మంది అతిథుల సమక్షంలో దాదాపు 25 వేలకు పైగా మంది సిబ్బందిని నేషనల్‌ గార్డ్స్‌ సిబ్బంది పహారాలో అమెరికా 46 వ అధ్యక్షుడిగా జో బైడెన్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. 78 సంవత్సరాల జో బైడెన్ అమెరికా చరిత్రలోనే అత్యంత పెద్ద వయసు అధ్యక్షునిగా ఆయన చరిత్ర సృష్టించారు.

జనవరి 6 న క్యాపిటల్ భవనంలో జో బైడెన్ ఎన్నికను ధ్రువీకరించేందుకు సమావేశం జరుగుతుండగా ట్రంప్ మద్దతుదారులు దాడి జరపడంతో ఐదుగురు మరణించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బైడెన్‌ ప్రమాణ స్వీకారం రోజు కూడా ఇలాంటి అల్లర్లే జరిగే అవకాశం ఉందని, ముఖ్యంగా అన్ని రాష్ట్రాల్లోని క్యాపిటల్‌ భవనాలపై దాడులు జరగవచ్చని ఎఫ్‌బీఐ, రక్షణశాఖ వర్గాలు హెచ్చరించడంతో భారీగా భద్రతా బలగాలు నేషనల్ గార్డ్స్ బ్యూరో మోహరించింది. భద్రతా ఏర్పాట్లలో భాగంగా ఈ కార్యక్రమాన్ని అమెరికా విమానాలు గగనతలం నుంచి పర్యవేక్షించడం గమనార్హం.

కాగా జోబైడెన్ ప్రమాణ స్వీకారానికి 20 నిమిషాల ముందు అమెరికా 49వ ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్‌ (56) ప్రమాణ స్వీకారం చేశారు. ఈ పదవి చేపట్టిన తొలి మహిళగా, తొలి ఆఫ్రికన్‌-ఆమెరికన్‌గా, దక్షిణాసియా మూలాలున్న వ్యక్తిగా, భారతీయ మూలాలున్న వ్యక్తిగా ఆమె చరిత్ర సృష్టించారు. కమలా హారీస్‌ను ప్రమాణ స్వీకార వేదిక వద్దకు నల్లజాతి పోలీసు అధికారి యూజీన్‌ గుడ్‌మ్యాన్‌ తోడుగా రావడం విశేషం. క్యాపిటల్ భవనంపై దాడి జరిగినప్పుడు ఆందోళనకారులను అడ్డుకోవడంలో యూజీన్ కీలకపాత్ర పోషించారు. కమలా హ్యారీస్ భర్త డగ్‌ ఎంహాఫ్‌ చెంతనుండగా బైబిల్‌ సాక్షిగా అమెరికా ఉపాధ్యక్షురాలిగా ప్రమాణ స్వీకారం చేశారు. కమలా దేవీ హారిస్‌ అనే నేను ఈ దేశాన్ని, రాజ్యాంగాన్ని అంతర్గతచ విదేశీ శత్రువుల నుంచి పరిరక్షిస్తానని, సత్య నిష్టతో బాధ్యతలు నెరవేరుస్తానని ప్రమాణం చేస్తున్నానని కమలా హ్యారీస్ ప్రమాణ స్వీకారం చేశారు.

127 సంవత్సరాల బైబిల్ సాక్షిగా జో బైడెన్ ప్రమాణ స్వీకారం

భారత కాలమానం ప్రకారం బుధవారం రాత్రి సరిగ్గా 10- 30 గంటలకు అమెరికా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జాన్‌ రాబర్ట్స్‌ జో బైడెన్ చేత ప్రమాణం చేయించారు. 46 వ అమెరికా అధ్యక్షుడిగా 127 సంవత్సరాలుగా తన కుటుంబం వద్ద ఉన్న బైబిల్ పై చేయి ఉంచి జో బైడెన్ ప్రమాణస్వీకారం చేయడం గమనార్హం.ఇదే బైబిల్‌ సాక్షిగా ఆయన గతంలో రెండుసార్లు ఉపాధ్యక్షుడిగా, ఏడుసార్లు సెనేటర్‌గా కూడా ప్రమాణం చేశారు.

ప్రమాణ స్వీకారం అనంతరం జో బైడెన్ అమెరికా ప్రజలకు తొలి ప్రసంగం చేశారు. ఇది ప్రజా విజయమని పేర్కొన్న ఆయన ప్రజాస్వామ్యం అత్యంత విలువైనదని అదే సమయంలో బలహీనమైనదని వ్యాఖ్యానించారు. హింసతో క్యాపిటల్ భవనం పునాదులు కదపాలని చూసినా చివరకు ప్రజాస్వామ్యమే గెలుపొందిందని చెప్పుకొచ్చారు. వ్యక్తిగత లాభం కోసం కాకుండా ప్రజా క్షేమానికి కృషిచేస్తానని హామీ ఇచ్చారు. అధ్యక్షుడిగా దేశ రాజ్యాంగాన్ని పరిరక్షిస్తానని విభేదాలకు తావులేని సమైక్య కథనాన్ని, కొత్త వెలుగును విరజిమ్మే కథనం రాద్దామని వ్యాఖ్యానించారు.

కరోనా వైరస్ రెండో ప్రపంచ యుద్ధం కంటే ఎక్కువమందిని పొట్టనపెట్టుకుందని వైరస్ కారణంగా వేల ఉద్యోగాలు పోయాయి. వేల కోట్ల డాలర్ల వ్యాపార నష్టం జరిగింది. దేశం సంక్షోభ పరిస్థితిని ఎదుర్కొంటుంది ఈ సంక్షోభం నుండి సత్వరం బయటపడాలి అని ఆయన పేర్కొన్నారు. ఒకపక్క విజృంభించిన కరోనా మహమ్మారి, మరోవైపు ప్రజాస్వామ్యంపై దాడి, పర్యావరణ సంక్షోభం, వర్ణవివక్ష, అసమానతలు ఇవన్నీ విడివిడిగా కాకుండా అన్ని సంక్షోభాలూ ఒక్కసారే వచ్చిపడ్డాయని ధైర్యంగా వాటిని ఎదుర్కొందాం అని జో బైడెన్ వెల్లడించారు. ఇందుకోసం ఒక్కొక్కరిగా అందరూ కలిసిరావాలని ఒకటిగా ఎదుర్కోవాలని,పోరాడాలని ప్రజలను కోరారు.

అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు

అమెరికా అధ్యక్షుడిగా జోబైడెన్ ప్రమాణ స్వీకారం సందర్భంగా ఏర్పాటుచేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ప్రముఖ పాప్ సింగర్ లేడీ గాగా జాతీయ గీతాన్ని ఆలపించగా ప్రముఖ నటి జెన్నిఫర్‌ లోపెజ్‌ ‘దిస్‌ ల్యాండ్‌ ఈజ్‌ యువర్‌ ల్యాండ్‌’ అమెరికా ద బ్యూటిఫుల్‌ గీతాలను ఆలపించి ఆకట్టుకున్నారు. అనంతరం ప్రముఖ గాయకుడు గార్త్‌ బ్రూక్స్‌ అమేజింగ్‌ గ్రేస్‌ అంటూ సాగే గీతాన్ని ఆలపించగా ప్రముఖ నటుడు టామ్‌ హ్యాంక్స్‌ నేతృత్వంలో 90 నిమిషాల పాటు సెలబ్రేటింగ్‌ అమెరికా పేరుతో ప్రముఖ కళాకారులు ప్రదర్శనలిచ్చారు.

కాగా 1000 మంది మాత్రమే పాల్గొన్న ఈ కార్యక్రమంలో బిల్‌ క్లింటన్‌, జార్జ్‌ డబ్ల్యూ బుష్‌, బరాక్‌ ఒబామా లాంటి ప్రముఖులు పాల్గొనగా బైడెన్‌ ప్రమాణ స్వీకారానికి ట్రంప్‌ హాజరు కాలేదు.1869లో ఆండ్రూ జాన్సన్‌ తర్వాత తదుపరి అధ్యక్షుని ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరుకాని వ్యక్తిగా డొనాల్డ్ ట్రంప్ నిలిచారు. కాగా ట్రంప్ వీడియో సందేశం ద్వారా బైడెన్ కు శుభాకాంక్షలు తెలిపారు. సాధారణ ప్రజలు ఈ కార్యక్రమానికి రాలేకపోయారన్న లోటు లేకుండా ప్రజలకు గుర్తుగా 2 లక్షల జెండాలను ఈ కార్యక్రమం జరుగుతున్న నేషనల్‌ మాల్‌లో ఉంచారు. అమెరికాలోని 50 రాష్ట్రాలను, ఆ దేశ అధీనంలో ఉన్న ప్రాంతాలను సూచించేలా 56 విద్యుద్దీపాలను అమర్చారు.

అమెరికా చరిత్రలో గతంలో లేని విధంగా జో బైడెన్‌ తన బృందంలో 20 మందికిపైగా భారత సంతతి వ్యక్తులను కీలక పదవుల్లో నియమించడం విశేషంగా చెప్పుకోవచ్చు. వీరిలో 13 మంది మహిళలే కావడం గమనార్హం. అమెరికా తాత్కాలిక విదేశాంగ మంత్రిగా డేనియల్‌ స్మిత్‌ వ్యవహరించనున్నారు. ఆంటోనీ బ్లింకెన్‌ నియామకాన్ని సెనేట్‌ ఖరారు చేసేవరకు స్మిత్‌ ఈ బాధ్యతలు నిర్వర్తిస్తారు.