iDreamPost
android-app
ios-app

జియో టీవీతో పెను సంచలనాలు

  • Published Jul 21, 2020 | 9:13 AM Updated Updated Jul 21, 2020 | 9:13 AM
జియో టీవీతో పెను సంచలనాలు

జియో 4జి రావడానికి ముందు మొబైల్ ఇంటర్నెట్ అనేది ఇండియన్స్ కి చాలా ఖరీదైన సర్వీస్. కేవలం 1 జిబి డేటా కోసం నెలకు 250 రూపాయల దాకా ఖర్చు పెట్టాల్సి వచ్చేది. అందులోనే పొదుపుగా ఉంటూ యుట్యూబ్ తదితర వీడియోల జోలికి వెళ్లకుండా గుట్టుగా వాడుకునేవారు వినియోగదారులు. జియో వచ్చాక సీన్ మారిపోయింది. స్మార్ట్ ఫోన్ సామాన్యుడికి ఇంకా చేరువయ్యింది. సగటు 1 జిబి డేటా ఇప్పుడు కేవలం 6 రూపాయలకే దొరుకుతోందంటే అదంతా ముఖేష్ అంబానీ అద్భుతమైన వ్యాపార ఎత్తుగడే కారణం. ఈయన రంగప్రవేశం తర్వాతే వీడియో స్ట్రీమింగ్ యాప్స్, సైట్స్ కి ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోయి డేటా వినియోగం భారీ ఎత్తున పెరిగిపోయింది.

దోపికికి అలవాటు పడిపోయి విర్రవీగిన పోటీ కంపెనీలు సైతం తోక ముడుచుకుని రాజీ మంత్రాన్ని పఠించాయి. ఇప్పుడు జియోటీవీ రాబోతోంది. సెటప్ బాక్స్ తో ఇచ్చే చానెల్స్ తో పాటుగా ఏకంగా 12కు పైగా టాప్ డిజిటల్ యాప్స్ తో ఒప్పందాలు కుదుర్చుకుని పెను సంచలనాలు రేపెలా ఉంది. అంటే ఏడాదికి ఒక చందా కడితే వేల సినిమాలు వెబ్ సీరీస్ లు ఇంట్లోనే కూర్చుని దర్జాగా చూసేయొచ్చు. ఇంకా సబ్క్రిప్షన్ గురించి వివరాలు బయటికి రాలేదు కానీ కాంపిటీషన్ తో పోల్చుకుంటే అతి తక్కువ ధర ఉండటం అయితే ఖాయం. ఇప్పటికే దీనికి బ్రాండ్ ప్రమోటర్స్ గా చేయడానికి మన దగ్గర మహేష్ బాబు, నార్త్ లో అక్షయ్ కుమార్ తో ఒప్పందాలు చేసుకున్నట్టుగా తెలిసింది. ఇదే నిజమైతే రీచ్ ఇంకా ఎక్కువగా పెరుగుతుంది. మారుమూల పల్లెటూళ్లలో కూడా జియో టీవీ అందుబాటులోకి వచ్చేలా ప్లానింగ్ చేస్తున్నారట.

జియో ఎలాగూ స్వంతంగా ఒక యాప్ ని లాంచ్ చేసుకుంటుంది. స్వయంగా సినిమాలు, సీరీస్ లు నిర్మించే ప్రణాళిక ఇప్పటికే సిద్ధం చేసుకుంది. ఈ లెక్కన చూస్తే కనివిని ఎరుగని వినోదాల విందు రాబోయే రోజుల్లో ప్రేక్షకులకు సిద్ధంగా ఉందన్న మాట. జియో టీవీ అఫీషియల్ గా లాంచ్ అయ్యాక చాలా సంచలనాలే ఆశించవచ్చు. సగటు భారతీయుల టీవీ వీక్షణల్లో చాలా మార్పులు చోటు చేసుకోవడం ఖాయం. రేటింగ్స్ లో ఇకపై సీరియల్స్ పెత్తనమూ తగ్గిపోవచ్చు. ఏది జరిగినా ఈ పోటీ వల్ల అవకాశాలు మాత్రం ఖచ్చితంగా పెరుగుతాయి. జియో 4జితో మొబైల్ ఇంటర్ నెట్ లో ఓ విప్లవాత్మక మార్పును తీసుకొచ్చిన అంబాని ఇప్పుడీ టీవీ ద్వారా దానికి మించే చేస్తారని విశ్లేషకుల అంచనా. లాక్ డౌన్ పూర్తిగా సద్దుమణిగేలోగా దీనికి సంబంధించిన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.