వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ప్రతి ప్రభుత్వ నిర్ణయాన్నీ తప్పు పట్టడమే పనిగా పెట్టుకున్న కొందరు అవి ఈ ప్రభుత్వమే కొత్తగా తీసుకున్న నిర్ణయాలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. జెరూసలేం సందర్శించే క్రైస్తవులకు వార్షిక ఆదాయం మూడు లక్షల కన్నా ఎక్కువ ఉన్న వారికి ముప్పై వేలు(ప్రస్తుత ఇరవై వేల రూపాయల నుంచి), మూడు లక్షల కన్నా తక్కువ ఉన్న వారికి అరవై వేలు(ప్రస్తుత నలభై వేల రూపాయల నుంచి) ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సాధారణంగా ఇటువంటి అంశాల మీద ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్న వారిలో ఏదో ఉనికి కోసం తపన పడే చోటామోటా రాజకీయ నాయకులు తప్ప వేరే ఎవరూ ఎక్కువగా మాట్లాడరు. అది మైనారిటీ వర్గాల ఓట్ల కోసం అయ్యుండచ్చు లేదా కొందరు నాయకులు, కార్యకర్తలు పార్టీ నుంచి దూరం అయ్యే అవకాశం ఉంటుందని కావచ్చు. కానీ ఈ విషయం మీద ఆంధ్రప్రదేశ్ లో అటు సామాజిక మాధ్యమాల్లో, ఇటు టీవీ ఛానెళ్లలో మొదలైన చర్చ, ప్రచారం చూస్తుంటే వెనకాల ఎవరో కొందరు ఉండి ఇదంతా ఒక ప్రణాళిక ప్రకారం జరిపిస్తున్న తంతులా ఉంది. ఇటువంటి దుష్ప్రచారం – మనుషుల్లో మతపరమైన చీలికను తెచ్చేంత ప్రమాదకరంగా పరిణమిస్తుంది.
క్రైస్తవులకు వారి పుణ్యక్షేత్రమైన జెరూసలేం సందర్శనకు వెళ్లేందుకు యాత్రికులకు 20 వేల రూపాయలు చొప్పున ఇవ్వాలని 2008లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జీవో జారీ చేసింది. సంవత్సరానికి రెండు కోట్ల రూపాయల చొప్పున బడ్జెట్ దీనికి కేటాయించారు. 2009 ఎన్నికల్లో కొత్తగా తెర మీదకు వచ్చిన ‘ప్రజారాజ్యం’ పార్టీ జెరూసలేం యాత్రకు క్రైస్తవులకు ప్యాకేజి లాంటిది ఇస్తామని ఎన్నికల సభల్లో చెప్పినట్టుగా ఒక వార్త చక్కర్లు కొడుతోంది. 2016 లో విజయవాడలో జరిగిన ‘క్రిస్మస్ హై టీ’ కార్యక్రమంలో పాల్గొన్న అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్రైస్తవులకు ఇచ్చిన హామీ ప్రకారం ఆ మొత్తాన్ని ఇరవై వేల రూపాయల నుంచి నలభై వేల చొప్పున పెంచాల్సిందిగా ఆ ప్రభుత్వం కూడా జీవో జారీ చేసింది (జీవో నెంబర్ 40 / డిసెంబర్ 23, 2016). ఆ జీవో ప్రకారం మూడు లక్షల కన్నా ఎక్కువ వార్షిక ఆదాయం ఉన్నవారికి ఈ పెంపు వర్తించదు. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వీటిని నలభై నుంచి అరవై వేలకు. ఇరవై నుంచి ముప్పయ్ వేలకు పెంచుతూ జీవో జారీ చేసింది. కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్రైస్తవాన్ని ఆచరిస్తాడనే ఒకే ఒక కారణంతో కొందరు దీనికి మతకోణాన్ని ఆపాదించి మనుషుల్లో చీలిక తీసుకుని వస్తుండటం బాధాకరం. గత డిసెంబర్లో విజయవాడలో ఒక చర్చి కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబునాయుడు జెరూసలేం యాత్ర కోసం ఇచ్చే నలభై వేల రూపాయల్ని డెబ్భై ఐదు వేలకు పెంచుతానని హామీ ఇచ్చారు, తమ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా అదే విషయం చెప్పారు.
మతపరమైన కార్యక్రమాలకు ప్రభుత్వాలు ఖర్చుపెట్టడం, అవసరానికి మించి ఖర్చుపెట్టడం కూడా కొత్తేమి కాదు. ఎన్నికల ముందు మైనారిటీ వర్గాల ఓట్ల కోసం రకరకాల హామీలు ఇవ్వడంలో ఏ పార్టీ మినహాయింపు కాదు. కాంగ్రెస్, భాజపాలు రెండూ నాగాలాండ్ లో జెరూసలేం యాత్రకు పంపిస్తామని 2018 ఎన్నికల మ్యానిఫెస్టోల్లో ప్రకటించినట్టుగా వార్తలు వచ్చాయి. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ‘కుంభమేళా’ వంటి కార్యక్రమాలకు వచ్చే భక్తుల కోసం ఏర్పాట్లు చేయడానికి ఖర్చులు చేసేది కూడా ప్రభుత్వ ఖజానా నుంచే. ఉత్తరాఖండ్ నుంచి మానసరోవర్ వెళ్లే భక్తులకు 25 వేల రూపాయల చొప్పున ఇచ్ఛే సబ్సీడీని గత ఏడాది 30 వేలకు పెంచారు. ఉత్తరప్రదేశ్ నుంచి మానసరోవర్ కు వెళ్లే భక్తులకు పాతికవేల రూపాయల చొప్పున ఇచ్చే సబ్సీడీని అఖిలేష్ యాదవ్ యాభై వేల రూపాయలు చేస్తే; ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి అయ్యాక దాన్ని 2017లో లక్ష రూపాయలకు పెంచారు. ఛత్తీస్ ఘడ్, ఢిల్లీ, ఉత్తర్ ప్రదేశ్, హర్యానా, గుజరాత్, కర్ణాటక, మధ్యప్రదేశ్ లలో కూడా ఇలా సబ్సీడీలు ఇస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ కానీ, దేశంలో ఏ ప్రాంతమైనా కానీ అన్ని మతాల వారు ఉంటారు. మరి ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి హిందూ సంప్రాదాయాల ప్రకారం అదేదో కొందరి వ్యక్తిగత శుభకార్యంలాగా భూమిపూజ అని, నవరత్నాలు మట్టిలో ఉంచడమని, హెలికాప్టర్లో నుంచి మట్టి – నీళ్లు చల్లడమని, హోమాలని వెచ్చించిన లక్షల రూపాయలు ప్రజాధనం కాదా ? ‘నదుల అనుసంధానం’ పేర చేసిన హడావుడికి, ఏ ఆచారాల ప్రకారం పూజలు చేశారు, ఎవరి డబ్బులు ఖర్చు పెట్టారు ? కృష్ణా, గోదావరి పుష్కరాలకు ఖర్చు చేసిన కోట్లెన్ని ? ఆ పుష్కరాలకు వచ్చే భక్తులకు వసతులు కల్పించడం ప్రభుత్వ బాధ్యతే అయినా వేలకోట్ల రూపాయలు అవినీతి జరిగిందని పలువురు ఆరోపించే స్థాయిలో ఖర్చు పెట్టడం మాత్రం సమర్ధనీయమా ?
మతపరమైన ఆచారాలకు, నమ్మకాలకు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం ఖర్చుపెడుతున్న విషయాలు, నిధుల సంగతులు అందరికీ తెలిసినవి కావు, తెలియనివీ కావు. కానీ ఇలాంటి సందర్భాల్లో ఈ విషయాలన్నింటినీ సోదాహరణంగా అందరికీ తెలియజేయాల్సిన బాధ్యతను మీడియా మర్చిపోవడం మాత్రం శోచనీయం. ‘క్రైస్తవులకు సబ్సీడీ పెంచి హిందువులకు దేవాలయాల సందర్శన కోసం ఏర్పాటు చేసిన ‘దివ్యదర్శనం’ పథకాన్ని నిలిపేశారు’ అంటూ మతవిద్వేషాలకు బీజాలు పడేలా వార్తలు రాయడం సమాజానికి ప్రమాదకరం. ఆరు నెలల నుంచి నిలిపివేసిన(ట్టుగా చెబుతున్న) ‘దివ్యదర్శనం’ పథకం గురించి జెరూసలేంయాత్రకు సబ్సీడీని పెంచగానే ఉన్నట్టుండి తెరమీదకు తీసుకురావడం ఉద్దేశపూర్వకం అనిపిస్తోంది. ఆ సబ్సీడీ పెంపు దేశంలోనే
ప్రప్రధమంగా జరిగిన వింత లాగా కొన్ని పార్టీల శ్రేణులు ప్రచారం చేయడం అనైతికం. ఎన్నికల ముందు మైనారిటీ వర్గాల మీద ఎనలేని ప్రేమ చూపించే మన నాయకులు – ఇలాంటి విషయాల మీద సామాజిక మాధ్యమాలు, టీవీ డిబేట్లు వేదికలుగా మనుషుల్లో చీలిక తెచ్చేందుకు ప్రయత్నిస్తున్న ‘కొందరి’ మాటల్ని ఖండించకపోవడం అవకాశవాద రాజకీయం.