iDreamPost
android-app
ios-app

జేసీకి హైకోర్టులో చుక్కెదురు..!

జేసీకి హైకోర్టులో చుక్కెదురు..!

ఫోర్జరీ పత్రాలతో బీఎస్‌ 3 వాహనాలను బీఎస్‌ 4 వాహనాలుగా మార్చి విక్రయించిన కేసులో అరెస్ట్‌ అయి కడప సెంట్రల్‌ జైలులో ఉన్న తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌ రెడ్డి, ఆయన కుమారుడు జేసీ అస్మిత్‌ రెడ్డిలకు హైకోర్టులో చుక్కెదురైంది. బెయిల్‌ మంజూరు చేయాలని వారు దాఖలు చేసుకున్న పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. వారు చేసిన నేరాలపై విచారణ సాగుతున్న తరుణంలో బెయిల్‌ మంజూరు చేయరాదన్న పోలీసు తరఫు వాదనలను హైకోర్టు సమర్థింస్తూ బెయిల్‌ను తిరస్కరించింది. అంతుకు ముందు అనంతపురం జిల్లా కోర్టులోనూ జేసీ బెయిల్‌ పిటిషన్‌ తిరస్కరణకు గురైంది.

గత నెల 13వ తేదీన వాహనాల అక్రమ విక్రయాల వ్యవహారంలో అనంతపురం పోలీసులు జేసీ ప్రబాకర్‌ రెడ్డి, ఆయన తనయుడు జేసీ అస్మిత్‌ రెడ్డిలను హైదరాబాద్‌లో అరెస్ట్‌ చేసి అదే రోజు అనంతపురం ఒన్‌ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌కు తీసుకొచ్చారు. వారికి వైద్య పరీక్షల తర్వాత అనంతపురం కోర్టులో హాజరపర్చగా న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్‌ విధించారు. ఆ తర్వాత పలుమార్లు పొడిగించారు. ప్రస్తుతం తండ్రీకొడుకులు ఇద్దరూ కడప సెంట్రల్‌ జైలులో ఉన్నారు. అనంతపురం జిల్లా కోర్టు బెయిల్‌ తిరస్కరించడంతో హైకోర్టులో బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. తాజా తీర్పుతో హైకోర్టులో కూడా జేసీకి ఊరట లభించలేదు.

Also Read:అచ్చెం నాయుడు ఆస్పత్రిని వదలాల్సిన సమయం వచ్చిందా..?

కాగా, తమపై వివిధ ప్రాంతాల్లో నమోదైన కేసులన్నింటినీ కలిపి ఒకే ఎఫ్‌ఐఆర్‌ వేయాలని మరో పిటిషన్‌ను జేసీ ప్రభాకర్‌ రెడ్డి కుటుంబీకులు హైకోర్టులో దాఖలు చేయగా.. ప్రస్తుతం అది విచారణ మధ్యలో ఉంది. వాహనాలు కొనుగోలు చేసి మోసపోయిన వారు తాడిపత్రి పట్టణం, రూరల్, అనంతపురం, ఓర్వకల్లు, పెదపప్పూరు పోలీస్‌ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. నేరం పలు విధాలుగా జరగడంతో ఒకే ఎఫ్‌ఐఆర్‌ సాధ్యం కాదని హైకోర్టు ఆదేశాల మేరకు ఏపీ హోం శాఖ అఫిడవిట్‌ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌లో వాదనలు ఇంకా జరగాల్సి ఉంది.