iDreamPost
android-app
ios-app

ఊరట కోసం జేసీ ప్రయత్నం..!

ఊరట కోసం జేసీ ప్రయత్నం..!

తమపై రాజకీయ కక్ష సాధింపుతోనే అక్రమ కేసులు పెట్టారంటూ నిన్నమొన్నటి వరకూ మాట్లాడిన జేసీ కుటుంబీకులు.. తాజాగా ఆ విషయం వదిలేసి బీఎస్‌ 3 వాహనాలను బీఎస్‌ 4గా ఫోర్జరీ పత్రాలతో విక్రయించిన కేసులో ఊరట కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ కేసులో టీడీపీ నేత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌ రెడ్డి, ఆయనకుమారుడు అస్మిత్‌రెడ్డిలు గత నెల 14వ తేదీన అరెస్ట్‌ అయ్యారు. బెయిల్‌ తిరస్కరణకు గురవడంతో అప్పటి నుంచి కడప సెంట్రల్‌ జైలులోనే తండ్రీకొడుకులిద్దరూ రిమాండ్‌ ఖైదీలుగా ఉంటున్నారు.

ఫోర్జరీ పత్రాలతో వాహనాలను పలు ప్రాంతాలకు చెందిన వారికి విక్రయించడంతో వారందరూ తమ పరిధిలోని పోలీస్‌ స్టేషన్‌లలో ఫిర్యాదులు చేశారు. సదరు ఫిర్యాదులపై ఆయా స్టేషన్ల పోలీసులు విచారణలు సాగిస్తున్నారు. ఈ క్రమంలో బెయిల్‌ రాదని నిర్థారించుకున్న జేసీ ఫ్యామిలీ.. కేసు తీవ్రతను తగ్గించేందుకు అవసరమైన ప్రయత్నాలు చేస్తోంది. తాడిపత్రి పట్టణం, రూరల్, అనంతపురం, ఓర్వకల్లు, పెదపప్పూరు పోలీస్‌ స్టేషన్లలో నమోదైన కేసులన్నింటినీ కలిపి ఒకే కేసు కింద పరిగణించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఒకే తరహా ఫిర్యాదులున్నప్పుడు వేర్వేరు ఎఫ్‌ఐఆర్‌లు సరికాదంటూ వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అన్నింటిపై ఒకే ఎఫ్‌ఐఆర్‌ వేయాలని కోరారు.

జేసీ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ విషయంపై అఫిడవిట్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. విచారణను బుధవారానికి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో బుధవారం ఈ పిటిషన్‌పై హైకోర్టులో మళ్లీ విచారణ జరిగే అవకాశం ఉంది. ప్రభుత్వం అఫిడవిట్‌ను పరిశీలించిన తర్వాత హైకోర్టు జేసీ కోరినట్లు ఒకే ఎఫ్‌ఐఆర్‌ వేయాలని ఆదేశిస్తుందా..? లేదా ప్రభుత్వం తన పని తాను చేసుకుని వెళ్లమంటుందా..? చూడాలి. బెయిల్‌ రాకపోయినా కనీసం ఈ ఊరట అయినా తమ నేతకు దక్కుతుందని జేసీ అనుచరులు ఆశాభావంతో ఉన్నారు.