iDreamPost
iDreamPost
గత నెలలో వాయుగుండం సృష్టించిన విధ్వంసం నుంచి రాయలసీమ ఇప్పుడిప్పుడే కోలుకుంటుండగా.. తాజాగా జవాద్ తుఫాన్ ఉత్తరాంధ్ర పై పంజా విసిరేందుకు దూసుకువస్తుంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం. రానున్న ఆరు గంటల్లో ఇది తుఫానుగా మారనుంది. దీనికి జవాద్ గా పేరు పెట్టారు.
ప్రస్తుతం ఇది విశాఖకు 480 కి.మీ.. ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు 600 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. గంటకు 30 కి.మీ వేగంతో ఇది పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తోంది. రేపు ఉదయానికి ఉత్తరాంధ్ర- ఒడిశా తీరానికి దగ్గరగా వచ్చే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. బంగాళాఖాతంలో జవాద్ దోబూచులాడుతుంది. తుఫాన్ ఈరోజు ఉదయం సమయంలో బంగ్లాదేశ్ వైపు వెళుతుందని వాతావరణ శాఖ చెప్పింది కానీ ఇది దిశ మార్చుకుని మన వైపు వస్తున్నట్టు తాజా అంచనా.
జవాద్ ప్రభావంతో ఇవాళ రాత్రి నుంచి ఉత్తరాంధ్రలో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు.. అక్కడక్కడా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముంది. శనివారం ఉత్తరాంధ్రలో అక్కడక్కడా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయి. ఇవాళ అర్ధరాత్రి నుంచి తీరం వెంబడి గంటకు 45-65 కి.మీ వేగంలో ఈదురుగాలులు వీచే అవకాశముంది. రేపు ఉదయం నుంచి 80-90కి.మీ వేగంలో బలమైన గాలులు వీస్తాయి. మత్స్యకారులు సోమవారం వరకు చేపలవేటకు వెళ్లవద్దని ప్రభుత్వం హెచ్చరించింది.
తూర్పు తీరంలో తుపాను ప్రభావం అప్పుడే కనిపిస్తుంది. సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఉప్పాడ లో బీచ్ రోడ్ ను సముద్రం ముంచేసింది. కెరటాలు రోడ్డు మీదకు వస్తున్నాయి.
ప్రభుత్వం సర్వం సిద్ధం:
తుఫానును ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సర్వం సిద్ధమైంది. ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. తుఫాను ప్రభావిత ప్రాంతంగా గుర్తించిన ఉత్తరాంధ్ర తో పాటు ఉభయ గోదావరి జిల్లాల్లో అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. నాలుగో తేదీ శనివారం పాఠశాలలకు సెలవు ప్రకటించింది. అధికారుల సెలవులు రద్దు చేసింది.
మండలంలో తహసీల్దార్ కార్యాలయం, డివిజన్లో ఆర్డిఓ కార్యాలయం తో పాటు జిల్లా కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు. మండల ప్రత్యేక అధికారి తోపాటు తహసీల్దార్లు, ఎంపీడీవోలు మండల కేంద్రాల్లో అందుబాటులో ఉండాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి. అత్యవసర చర్యలు తీసుకునేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసుకోవాలని ప్రభుత్వం తెలిపింది. తుఫాన్ ఎదుర్కొనేందుకు తీసుకున్న చర్యలపై ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తుఫాన్ ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఆర్డీవోలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. తుఫాన్ సహాయక చర్యల కోసం ఇప్పటి వరకు 11 ఎన్డీఆర్‌ఎఫ్, 4 ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలను సిద్ధం చేసింది. అదనంగా మరో 4 బృందాలను అందుబాటులో ఉంచారు.
శ్రీకాకుళం.. 11 మండలాల్లో తీవ్రత ఉండే అవకాశం:సమీక్షలో ధర్మాన కృష్ణదాస్
జవాద్ తుఫాను హెచ్చరికల నేపథ్యంలో శ్రీకాకుళం కలెక్టరేట్‌లో ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ సమీక్ష నిర్వహించారు. తుఫాను నేపథ్యంలో చేపట్టాల్సిన ముందస్తు చర్యలపై జిల్లా కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులకు ఆయన దిశానిర్దేశం చేశారు. జిల్లాలోని 11 మండలాల్లో తుఫాను తీవ్రత ఉండే అవకాశముందన్నారు. విద్యుత్ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని.. తాగునీటి కోసం ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు.
Also Read : December Cyclones, Coastal Andhra- 200 ఏళ్లలో మూడుసార్లే ఇలా..! ఎందుకిలా జరుగుతోంది..?