iDreamPost
iDreamPost
మొదటి నాలుగు రోజులు పోటీ సినిమాలు బిత్తరపడిపోయి ఓటిటికి పరుగులు పెట్టేలా విశ్వరూపం చూపించిన జాతిరత్నాలు బిసి సెంటర్స్ లో కాస్త నెమ్మదించినప్పటికీ హైదరాబాద్ లాంటి ప్రధాన కేంద్రాల్లో మాత్రం వసూళ్ల సునామి కొనసాగిస్తోంది. బ్లాక్ బస్టర్ కు మించి అనే స్థాయిలో కలెక్షన్లు వస్తున్నాయి. ఇప్పటికే డబుల్ ప్రాఫిట్ ఇచ్చేసి పెట్టుబడి రాబడి సూత్రం ప్రకారం ఉప్పెనను కూడా దాటేలా కనిపిస్తున్న ఈ కామెడీ ఎంటర్ టైనర్ అంత ఈజీగా స్లో అయ్యేలా కనిపించడం లేదు. రేపు మూడు కొత్త సినిమాలు వస్తున్నా కూడా జాతిరత్నాలు మీద పెద్ద ఎఫెక్ట్ ఉండదని అడ్వాన్స్ బుకింగ్ ట్రెండ్స్ ని బట్టి అర్థం చేసుకోవచ్చు.
ఇక తెలుగు రాష్ట్రాల్లోనే సెంటర్ పాయింట్ గా చెప్పుకునే ఆర్టిసి క్రాస్ రాడ్స్ లో జాతిరత్నాలు ఏకంగా బాహుబలిని దాటేసి మూడో స్థానానికి చేరుకోవడం ఇప్పుడు అందరినీ షాక్ కు గురి చేస్తోంది. సుదర్శన్ 35 ఎంఎంలో ఉన్న ఫస్ట్ వీక్ కలెక్షన్ 35 లక్షల పై చిలుకు రికార్డుని 3 లక్షల మార్జిన్ తో దాటేసి అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరూ తర్వాత సగర్వంగా చోటు సంపాదించుకుంది. ఇంకా రన్ చాలా స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి కోటి రూపాయలు టచ్ చేసినా ఆశ్చర్యం లేదని ఓ అంచనా. ఇప్పటిదాకా స్టార్ హీరోలకు తప్ప ఆ సెంటర్ లో ఎవరికీ ఆ ఫీట్ సాధ్యం కాలేదు. ఇలాంటి చిన్న సినిమాకు అంటే అద్భుతమే.
ఇక ఓవర్సీస్ లోనూ హాఫ్ మిలియన్ మార్కు అందుకుని విజయ్ మాస్టర్ ని దాటేసిన జాతిరత్నాలు ఫైనల్ రన్ అయ్యేలోపు ఈజీగా మిలియన్ ని టచ్ చేసేస్తుంది. రాబోయే సినిమాలకు అక్కడ బిజినెస్ చేయడానికి ఇది మంచి దిక్సూచిగా నిలిచింది. ఈ ఎఫెక్ట్ వల్లే రంగ్ దేకి మంచి ఆఫర్ వచ్చినట్టు సమాచారం. ఇప్పటిదాకా జాతిరత్నాలు వరల్డ్ వైడ్ షేర్ 27 కోట్లు దాటేసింది. జరిగిన థియేట్రికల్ బిజినెస్ 11 కోట్లు మాత్రమే. రిలీజై పది రోజులు కూడా కాలేదు. రేపు వచ్చే సినిమాల టాక్ ఎంత బాగున్నా అవన్నీ జాతిరత్నాలుతో సంబంధం లేని కాన్సెప్టులు కాబట్టి ఇంకొన్ని రికార్డులకు రంగం సిద్ధమవుతోంది.