2021వ సంవత్సరం మొదటి నెల నుంచీ ఆంధ్రప్రదేశ్ లో ఏదో రకంగా ఎన్నికల కోలాహలం కొనసాగుతూనే ఉంది. వరుస ఎన్నికలతో పొలిటికల్ హీట్ పెరుగుతూనే ఉంది. తొలుత పంచాయతీ ఎన్నికలు, ఆ తర్వాత మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలు, ఆ వెంటనే తిరుపతి ఉప ఎన్నిక, అది కొనసాగుతుండగానే మండల, పరిషత్ ఎన్నికలు.. ఇలా వరుసగా నోటిఫికేషన్లు జారీ అవుతూనే ఉన్నాయి. 2019లో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన అనంతరం రెండేళ్ల తర్వాత వరుసగా జనవరి నుంచి ఏప్రిల్ నెలలు ఎన్నికల మాసాలుగా మారాయి. రాజకీయ పార్టీలు, నాయకులు, అధికారులు ఇలా ప్రతి ఒక్కరూ వరుస ఎన్నికలలో నిమగ్నమై ఉన్నారు. పార్టీల పోటాపోటీ ప్రచారాలు, ఒకరిపై మరొకరు ఆరోపణలు, దూషణలతో పొలిటికల్ ఫైర్ కనిపించింది.
2018లో జరగాల్సిన స్థానిక సంస్థల ఎన్నికలను అప్పటి టీడీపీ ప్రభుత్వం నిర్వహించేందుకు వెనుకడుగు వేసింది. 2019లో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర తర్వాత ఎన్నికల నిర్వహణకు ఎస్ఈసీ సిద్ధమైంది. 2020 మార్చిలో స్వల్ప వ్యవధిలోనే జిల్లా, మండల పరిషత్ ఎన్నికలతో పాటుగా మునిసిపల్, పంచాయితీ ఎన్నికలకు కూడా రంగం సిద్ధం చేసింది. జిల్లా, మండల పరిషత్ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ పూర్తికాగా, మునిసిపల్ ఎన్నికలకు నామినేషన్లు దాఖలు చేయడం పూర్తి అయ్యింది. అనూహ్యంగా మొత్తం ఎన్నికల ప్రక్రియను తాత్కాలికంగా నిలుపివేస్తున్నట్టు నాటి ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రకటించారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో నిర్ణయం తీసుకున్నట్టు ఎస్ఈసీ ప్రకటించగా, వైద్య ఆరోగ్య శాఖతో గానీ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో గానీ కనీసం సంప్రదించకుండానే ఈ నిర్ణయం తీసుకోవడంపై ప్రభుత్వం సవాల్ చేసింది. సుప్రీంకోర్టు మాత్రం రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారాల్లో జోక్యం చేసుకోలేమని చెబుతూనే వాయిదా వేసేముందు సంబంధిత అధికారులతో సంప్రదించి ఉండాల్సిందంటూ వ్యాఖ్యానించింది. ఈ వివాదంలో నిమ్మగడ్డ పదవిని కూడా కోల్పోయారు. కొన్ని నెలల వాదోపవాదాల అనంతరం నిమ్మగడ్డ మళ్లీ ఎస్ఈసీగా నియమితులయ్యారు.
అనంతరం ఈ ఏడాది జనవరి 23న పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశారు. అనంతరం కొంత మంది కలెక్టర్లు ఎస్ఈసీ దృష్టికి తెచ్చిన సూచనల మేరకు ఆ నోటిఫికేషన్ లో స్వల్ప మార్పులు చేస్తూ ఎస్ఈసీ మరో నోటిఫికేషన్ విడుదల చేసింది.
మొత్తంమ్మీద ఫిబ్రవరి నెలలో నాలుగు దశలలో పంచాయతీ ఎన్నికలు పూర్తయ్యాయి. అనంతరం మార్చి నెలలో మున్సిపల్ ఎన్నికల నగరా మోగింది. గతేడాది మార్చి 15న నిలిచిన ప్రక్రియ నుంచే కొనసాగించేలా ఉత్తర్వుల్లో పేర్కొంది. 11 కార్పొరేషన్లు, 75 మున్సిపల్, నగర పంచాయతీ ఎన్నికలకు ఎస్ ఈసీ ఫిబ్రవరిలో షెడ్యూల్ విడుదల చేసింది. మార్చి 10న మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. 14న ఓట్ల లెక్కింపు జరిగి ఫలితాలు వెలువడ్డాయి. వరుసగా పంచాయతీ, మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో అధికార వైసీపీ ప్రభంజనం సృష్టించింది. పంచాయతీ ఎన్నికల్లో మొత్తం 13081కు గాను 10098 స్థానాలను వైసీపీ కైవసం చేసుకుంది. అలాగే మున్సిపల్ ఎన్నికల్లో 11 కార్పొరేషన్లకు గాను 11, 75 మున్సిపాల్టీలకు 74 సాధించి చరిత్ర సృష్టించింది.
ఎంపీటీసీ, జడ్ పీటీసీ ఎన్నికలకు కూడా నిమ్మగడ్డ నోటిఫికేషన్ జారీ చేస్తారని అందరూ భావించగా ఆయన చేతులెత్తేశారు. దీనిపై పలు ఆరోపణలు వెల్లువెత్తాయి. కరోనా ఉధృతి నేపథ్యంలో మొదట్లో పంచాయతీ ఎన్నికలను ప్రభుత్వం వ్యతిరేకించగా నిమ్మగడ్డ పట్టుబట్టి, కోర్టుల్లో పోరాడి మరీ ఎన్నికలు జరిపించారు. ఫలితాలన్నీ అధికార పార్టీకే అనుకూలంగా వచ్చాయి. టీడీపీ సానుభూతిపరుడిగా ముద్రపడ్డ నిమ్మగడ్డ వైసీపీ వేవ్ నేపథ్యంలో ఎంపీటీసీ, జడ్ పీటీసీ ఎన్నికల నిర్వహణకు ఆసక్తి చూపలేదన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. మార్చి చివర్లో నిమ్మగడ్డ పదవీ విరమణ పొందారు.
ఈ ఏడాది ఏప్రిల్ 1న ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్‌గా నీలం సాహ్ని బాధ్యతలు స్వీకరించారు. అదే రోజు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశమైన ఎస్‌ఈసీ కీలక ఆదేశాలు జారీ చేశారు. పరిషత్ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించేశారు. ఈ నెల 8వ తేదీన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. అవసరమైన చోట్ల మరుసటి రోజు 9న రీపోలింగ్ నిర్వహిస్తారు. ఎన్నికల ఫలితాలు 10వ తేదీ ప్రకటించనున్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ పోలింగ్ జరగనుంది. 10 వ తేదీ ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడిస్తారు. అయితే, ఈ ఎన్నికలను బహిష్కరిస్తూ టీడీపీ నిర్ణయం తీసుకుంది. దీనిపై ఆ పార్టీలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. చంద్రబాబు నిర్ణయాన్ని పలువురు వ్యతిరేకించారు. అది చారిత్రక తప్పిదంగా పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు.
ఏపీలో స్థానిక ఎన్నికల క్రమం కొనసాగుతుండగానే మండల, పరిషత్ ఎన్నికలకు ముందే కేంద్ర ఎన్నికల సంఘం తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల చేసింది. ఏప్రిల్ 17వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. మే రెండవ తేదీన కౌంటింగ్ నిర్వహించి ఫలితాలను వెల్లడించనున్నారు. ఈ క్రమంలో అక్కడ ప్రస్తుతం హోరాహోరీ ప్రచారం కొనసాగుతోంది. ఇలా వరుసగా 2021 సంవత్సరం జనవరి నుంచి ఎన్నికలు, దానికి సంబంధిత నోటిఫికేషన్లు, వార్తలతో రాష్ట్రంలో పొలిటికల్ వేడి రాజుకుంటూ వస్తోంది.