iDreamPost
android-app
ios-app

జ‌న‌సేన ప్ర‌స్థానం ముగిసిన‌ట్టేనా?..ఇంకా ఉందా?

  • Published Jan 16, 2020 | 2:29 AM Updated Updated Jan 16, 2020 | 2:29 AM
జ‌న‌సేన ప్ర‌స్థానం ముగిసిన‌ట్టేనా?..ఇంకా ఉందా?

ఆంధ్రప్రదేశ్  రాజ‌కీయాల్లో విభిన్న రాజ‌కీయాలు చేస్తామంటూ పురుడు పోసుకున్న పార్టీ ప్ర‌స్థానం అర్థాంత‌రంగా ముగిసిపోతున్న సంకేతాలు అందుతున్నాయి. ఇప్ప‌టికే ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న పార్టీని బీజేపీలో విలీనం చేసేందుకు స‌న్న‌ద్ధంగా ఉన్నార‌నే అభిప్రాయం క‌మ‌లం క్యాంప్ నుంచి వ‌స్తోంది.

దానికి అనుగుణంగానే చ‌ర్చ‌లు జ‌రిపేందుకు హ‌స్తిన నుంచి అందిన క‌బురుతో హుటాహుటీన ఆయ‌న ప‌య‌న‌మ‌య్యి వెళ్లారు. చివ‌ర‌కు జేపీ న‌డ్డాని క‌లుసుకుని మాట్లాడ‌గ‌లిగారు. ఆయ‌న ఆదేశాల మేర‌కు విజ‌య‌వాడ‌లో ఇరు పార్టీల మ‌ధ్య చ‌ర్చ‌లు జ‌ర‌గ‌బోతున్నాయి. బీజేపీ నుంచి ఏపీ ఇన్ఛార్జ్ సునీల్ దేవ‌ద‌ర్, జీవీఎల్ న‌రసింహ‌రావు, క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ పాల్గొంటారు. జ‌న‌సేన త‌రుపున పార్టీ అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో పాటు ఆయ‌న తోడుగా ఉంటున్న నాదెండ్ల మ‌నోహ‌ర్ హాజ‌ర‌వుతున్న‌ట్టు ప్ర‌క‌టించారు. చ‌ర్చ‌ల సారాంశాన్ని గురువారం సాయంత్రం ప్ర‌క‌టిస్తామ‌ని మీడియాకు స‌మాచారం అందించారు. దాంతో చ‌ర్చ‌లు ముగిసి, తుది నిర్ణ‌యం ప్ర‌క‌టించే అవ‌కాశం క‌నిపిస్తోంది.

ఆది నుంచే ఆప‌సోపాలు…

జ‌న‌సేన రాజ‌కీయంగా తెర‌మీద‌కు రావ‌డ‌మే అనూహ్యంగా జ‌రిగింది. ఆ త‌ర్వాత అడుగ‌డుగునా అదే తంతు. ఆపార్టీలో ఏం జ‌రుగుతుందో అధినేత‌కు తెలియ‌దు. అధ్య‌క్షుడు ఎప్పుడు ఏం చేస్తారో పార్టీ కీల‌క నేత‌ల‌కు కూడా అంతుబ‌ట్ట‌దు. అంతా సందిగ్ధం. పూర్తిగా గంద‌ర‌గోళం అన్న‌ట్టు క‌నిపిస్తుంది.

2014 సాధార‌ణ ఎన్నిక‌ల‌కు నెల‌న్న‌ర ముందు హ‌ఠాత్తుగా త‌న సొంత పార్టీని ప‌వ‌న్ క‌ళ్యాణ్ హైద‌రాబాద్ నోవాటెల్ వేదిక నుంచి ప్ర‌క‌టించారు. అప్ప‌టికే అన్న‌య్య ప్ర‌జారాజ్యంలో యువ‌జ‌న విభాగానికి సార‌ధిగా ప‌నిచేసిన అనుభ‌వం ఉండ‌డంతో జాగ్ర‌త్త‌లు పాటిస్తార‌ని చాలామంది ఆశించారు. సినీ అభిమానులు పెద్ద సంఖ్య‌లో అనుస‌రించారు. కానీ అనూహ్యంగా పార్టీ పెట్టిన‌ప్ప‌టికీ పోటీ చేయ‌డం లేద‌ని చెప్పి ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. సంప్ర‌దాయ రాజ‌కీయాల‌కు త‌మ పార్టీ దూరంగా ఉంటుంద‌ని చెబుతూ బీజేపీ- టీడీపీ కూట‌మికి మ‌ద్ధ‌తు ప్ర‌క‌టించారు. ఊరూరా తిరిగి బాబు హామీల అమ‌లుకి త‌న‌దీ హామీ అంటూ కూడా చెప్పుక‌న్నారు. చివ‌ర‌కు చంద్ర‌బాబు కి అధికారం ద‌క్క‌డంలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించిన ప‌వ‌న్ కి టీడీపీ నేత‌లు మాత్రం ఎప్ప‌టిక‌ప్పుడు కౌంట‌ర్లు ఇస్తూనే వ‌చ్చారు. సొంత అన్న‌య్య‌నే గెలిపించుకోలేనోడు చంద్ర‌బాబుని సీఎం చేశారా..అదంతా టీడీపీ బ‌లం అంటూ ప‌దే ప‌దే ఎద్దేవా చేయ‌డం అంద‌రూ చూశారు.

అదే స‌మ‌యంలో ఐదేళ్ల స‌మ‌యంలో పార్టీని బ‌లోపేతం చేసుకోవాల‌నే ధ్యాస గానీ, దానికి అనుగుణంగా వ్య‌వ‌హ‌రించాల‌నే ఆలోచ‌న గానీ ప‌వ‌న్ లో క‌నిపించ‌లేదు. ఆఖ‌రిలో క‌వాతులు, యాత్ర‌లు అంటూ కొంత సంద‌డి చేసినా జ‌నంలో విశ్వాసం ద‌క్కించుకునే స్థాయిలో జ‌న‌సేన క‌నిపించ‌లేదు. పైగా చంద్ర‌బాబు మీద వ్య‌తిరేక‌త ప‌వ‌న్ మీద అనుమానాల‌కు కార‌ణం అయ్యింది. ముఖ్యంగా ఆయ‌న సొంత సామాజిక‌వ‌ర్గానికి చెందిన స‌మ‌స్య విష‌యంలో ప‌వ‌న్ తీరు హార్డ్ కోర్ ఫ్యాన్స్ ని కూడా ఇక్క‌ట్లు పాలుజేసింది. ముద్ర‌గ‌డ వంటి వారు మీద చంద్ర‌బాబు స‌ర్కారు సాగించిన అణ‌చివేతను నిల‌దీయ‌డంలో విప‌లమ‌యిన ప‌వ‌న్ ని ఆయ‌న వ‌ర్గీయులే విశ్వ‌సించ‌లేని స్థితి వ‌చ్చేసింది.

ఎన్నిక‌ల ముందు దూరం..బాబు జేబుసేన‌గానే..!

ఓవైపు చంద్ర‌బాబు ప్ర‌భుత్వం మీద వ్య‌తిరేక‌త‌, మరోవైపు ప‌వ‌న్ త‌న బ‌లం మీద అతి విశ్వాసం క‌లిసి మొన్న‌టి ఎన్నిక‌ల్లో తొలిసారిగా బ‌రిలో దిగేందుకు దారితీసింది. కానీ దారీతెన్నూలేని రీతిలో పార్టీ మారిపోయింది. చివ‌ర‌కు అద్య‌క్షుడు కూడా రెండు చోట్లా ఓడిపోవ‌డంతో ప‌రువు పోయింది. ఈ ప‌రిస్థితుల్లో పార్టీ ప్ర‌స్థానం పెద్ద ప్ర‌శ్నార్థ‌కం అయ్యింది. కీల‌క నేతలంతా ఒక్కోక్క‌రుగా జారిపోయారు. చివ‌ర‌కు జ‌న‌సేన ఆవిర్భావం నుంచి ప‌వ‌న్ వెంట ఉన్న వారు కూడా ఇప్పుడు ఆయ‌న తీరుని తీవ్రంగా త‌ప్పుబ‌డుతూ గుడ్ బై చెప్పేశారు. రాజా ర‌వితేజ వంటి వారు ఘాటు విమ‌ర్శ‌లే చేశారు. అయినా ప‌వ‌న్ ఇప్ప‌టికీ అలాంటి వాటికి స‌మాధానం చెప్ప‌క‌పోగా తాజాగా బీజేపీతో బంధం బ‌ల‌ప‌రుచుకోవ‌డం ద్వారా వారి విమ‌ర్శ‌ల‌కు ఊత‌మిచ్చారు.

ఇక 2019 ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ ఎంత‌గా అర‌చి గీపెట్టినా జ‌నంలో ఆద‌ర‌ణ ద‌క్కించుకోలేక‌పోయారు. సొంత వ‌ర్గ‌మే ఆయ‌న్ని చేర‌దీయ‌లేదు. అంద‌రూ చంద్ర‌బాబు మ‌నిషిగానే ప‌వ‌న్ ని చూశారు. బాబు జేబు పార్టీగా జ‌న‌సేన గురించి జ‌నాల్లో అభిప్రాయం బ‌ల‌ప‌డింది. ఈ ప‌రిస్థితుల్లో ఆపార్టీకి కేవ‌లం ఒక్క సీటు మాత్ర‌మే ద‌క్క‌డంతో క్యాడ‌ర్ దాదాపుగా నీరుగారిపోయింది. అన్న‌య్య పార్టీకి ఆంధ్రా ప్రాంతంలో 16 సీట్లు వ‌స్తే త‌మ్ముడికి మాత్రం బోణీ కొట్ట‌డానికే ప‌రిమితం అయిపోవ‌డంతో జ‌న‌సేన జ‌వ‌స‌త్వాలు నీరుగారిపోయే స్థితికి చేరింది. పార్టీ  నుంచి గెలిచిన ఒక్క‌గానొక్క ఎమ్మెల్యే కూడా ప‌వ‌న్ కి మొఖం చాటేశారు. జ‌గ‌న్ కి పాలాభిషేకాలు చేస్తూ ప్ర‌భుత్వానికి మ‌ద్ధ‌తు ప్ర‌క‌టించేశారు. ఈ ప‌రిస్థితుల్లో ప‌వ‌న్ పార్టీకి మ‌నుగ‌డ ప్ర‌శ్నార్థ‌కంగా మారింది.

బీజేపీలో విలీన ప్ర‌య‌త్నాలు కొలిక్కి వ‌స్తున్న‌ట్టేనా?

గ‌త ఎన్నిక‌ల‌కు ముందు బీఎస్పీ అధినేత్రి నుంచి సీపీఎం మ‌ధు వ‌ర‌కూ అంద‌రి కాళ్ళు మొక్కిన ప‌వ‌న్ ఫ‌లితాలు చూసి ఖంగుతిన్నారు. ఆనాటి నుంచి క‌మ‌ల‌నాధుల‌ను ఆశ్ర‌యించేందుకు ఆయ‌న చేయ‌ని ప్ర‌య‌త్న‌మే లేదు. కానీ ఇప్ప‌టి వ‌ర‌కూ ఫ‌లితాన్నివ్వ‌లేదు. మ‌ధ్య‌లో నాలుగు రోజుల పాటు ఢిల్లీలో మ‌కాం వేసి క‌ళ్లు కాయ‌లు కాసేలా ఎదురుచూసినా మో-షా లు క‌నిక‌రించ‌లేదు. ఆఖ‌రికి రామ్ మాధ‌వ్ ద‌ర్శ‌నంతో వెనుదిర‌గాల్సి వ‌చ్చింది. తాజాగా కూడా అదే ప‌రిస్థితి. ఈసారి జేపీ న‌డ్డా తో భేటీకి దారి దొరికింది. అందుకు అనుగుణంగానే విజ‌య‌వాడ స‌మావేశం జ‌ర‌గ‌బోతోంది. అయితే ప‌వ‌న్ క‌ళ్యాణ్ క‌న్నా త‌మ‌కు చిరంజీవి ద్వారా ఎక్కువ ప్ర‌యోజ‌నం క‌లుగుతుంద‌నే అంచ‌నాలో క‌మ‌ల‌ద‌ళం ఉంది. అందుకు అనుగుణంగా వారంతా ప్ర‌య‌త్నాలు చేశారు. కానీ ఆయ‌న మాత్రం ఇటీవ‌ల కాస్త రాజ‌కీయాలు ఒంట‌బ‌ట్టించుకున్న‌ట్టు క‌నిపిస్తోంది. తాజా ప‌రిణామాల‌తో ఆయ‌న జ‌గ‌న్ కి జై కొట్టేస్తున్నారు. ఎవ‌రూ నోరు మెద‌ప‌క‌పోయినా ఆయ‌న మాత్రం ముందే స్పందిస్తున్నారు. త‌ద్వారా బీజేపీకి ఆయ‌న త‌లుపులు మూసేసిన‌ట్టుగా క‌నిపిస్తోంది.

ఈ ప‌రిస్థితుల్లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇప్ప‌టికే ప్ర‌జ‌ల్లో పెద్ద‌గా ప్ర‌భావం చూప‌లేని నేత‌గా మిగిలిపోయినప్ప‌టికీ ఏదో మేర‌కు ప్ర‌యోజ‌నం ఉంటుంద‌నే అభిప్రాయం బీజేపీ నేత‌ల్లో ఉంది. అందుకు అనుగుణంగానే వారు ముంద‌డుగు వేస్తున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో జ‌న‌సేన ఆరు శాతం ఓట్లు సాధిస్తే, బీజేపీకి ఒక్క శాతం ఓట్లు కూడా ద‌క్క‌లేదు. దాంతో ఇరు పార్టీల క‌ల‌యిక వ‌ల్ల క‌లిగే మార్పులు ఏమేర‌కు అన్న‌ది ఇప్ప‌టికిప్పుడు స‌మాధానం క‌ష్ట‌మే. పైగా పునాదుల్లేని, నిర్మాణ‌మే జ‌ర‌గ‌ని పార్టీగా జ‌న‌సేన ఉంది. పార్టీ ఆవిర్భ‌వించి ఆరేళ్లు గ‌డిచినా ఇంకా ఆరంభ ద‌శ‌లోనే ఉంది. ప‌వ‌న్ ఫ్యాన్స్ ఆసోసియేష‌న్ మాదిరిగా న‌డుస్తోంది. ఈ నేప‌థ్యంలో ఇరు పార్టీల నేత‌ల మంత‌నాల ప్ర‌భావం ఏమిట‌న్న‌ది కాల‌మే స‌మాధానం చెప్పాల్సి ఉంటుంది.

బీజేపీకి అత్య‌వ‌సం..అయినా ఫ‌లితం ఎంత‌మేర‌కో?

బీజేపీకి ఏపీలో గుర్తింపు ఉన్న నాయ‌కులే క‌నిపించ‌డం లేదు. దేశ‌వ్యాప్తంగా ఎదురుగాలి మొద‌లు కావ‌డం , మోడీ ఇమేజ్ బాగా డ్యామేజ్ అవుతుంద‌నే అభిప్రాయం బ‌ల‌ప‌డుతున్న ద‌శ‌లో ఏపీలో బ‌ల‌ప‌డాల‌నే బీజేపీ ఆశ‌లు అత్యాశే అవుతుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. కానీ ప‌వ‌న్ వంటి క్రౌడ్ ఫుల్ల‌ర్ ని వెంటేసుకుని ఆర్ఎస్ఎస్ స‌హాయంతో అడుగులు వేద్దామ‌నే అంచ‌నాలో ఆపార్టీ ఉంది. అందుకు ప‌వ‌న్ ని వినియోగించుకునే ఆలోచ‌న చేస్తోంది.  ఇప్ప‌టికే ప‌వ‌న్ ప‌ట్ల సొంత సామాజిక‌వ‌ర్గ నేత‌ల్లోనే సానుకూల‌త లేని ద‌శ‌లో బీజేపీకి ఎంత‌మేర‌కు బ‌లం అవుతార‌న్న‌ది చెప్ప‌లేమ‌ని ప‌లువురు చెబుతున్నారు. అదే స‌మ‌యంలో ప‌వ‌న్ ఒక‌సారి పార్టీ విలీనం చేయాల‌ని నిర్ణ‌యానికి వ‌స్తే ప్ర‌జ‌ల్లో మ‌రింత ప‌లుచ‌న‌య్యే ప్ర‌మాదం ఉంద‌ని హెచ్చ‌రిస్తున్నారు. ఇప్ప‌టికే చిరంజీవి అనుభ‌వాన్ని చూపుతున్నారు. దాంతో బీజేపీ ఆశ‌ల‌కు ప‌వ‌న్ నిచ్చెన వేస్తారా లేక నీళ్లొదులుతారా అన్న‌ది ఎదురుచూడాల్సిన అంశం.