Idream media
Idream media
జనసేన పార్టీకి అంతో ఇంతో బలం ఉన్నది ఉభయగోదావరి జిల్లాల్లోనే. 2014 ఎన్నికలకు ముందే జనసేన పార్టీని సినీ నటుడు పవన్ కళ్యాణ్ స్థాపించారు. సమయం లేదనే కారణంతో ఆ ఎన్నికల్లో పోటీ చేయని జనసేనాని.. టీడీపీ, బీజేపీ కూటమికి మద్ధతు తెలిపారు. 2019లో భిన్నమైన పరిస్థితి. తొలిసారి పోటీ చేశారు. ఒంటరిగా బరిలోకి దిగారు. ఉభయ గోదావరి జిల్లాల్లోనే జనసేన అభ్యర్థులు చెప్పకోదగ్గ ఓట్లు సాధించారు. ఆ పార్టీ గెలిచిన ఏకైక రాజోలు సీటు కూడా తూర్పుగోదావరి జిల్లా నుంచే లభించింది.
ఊహించని ఫలితాలు..
తాము బలంగా ఉన్నామనుకుంటున్న ఉభయ గోదావరి జిల్లాల్లోనే బలహీన పడుతున్నామనే ఆందోళన జనసైనికుల్లో నెలకొంది. తాజాగా వెల్లడైన ఏలూరు కార్పొరేషన్ ఫలితాలను చూసిన జనసైనికులు ఖంగుతింటున్నారు. ఊహించని విధంగా వచ్చిన ఫలితాలతో ఆ పార్టీ క్యాడర్ డీలా పడింది. 50 డివిజన్లకు గాను ఏకగ్రీవమై మూడు డివిజన్ల మినహా 47 డివిజన్లకు ఎన్నికలు జరగ్గా.. జనసేన కేవలం 20 డివిజన్లలోనే పోటీ చేసింది. పోటీ చేసిన 20 డివిజన్లలో ఒక్క చోట కూడా పార్టీ గెలవలేకపోయింది. కనీసం రెండో స్థానంలోనూ నిలవలేకపోవడంతో జనసైనికులు జీర్ణించుకోలేకపోతున్నారు.
పరిస్థితి దిగజారింది..
సాధారణ ఎన్నికలతో పోల్చుకుంటే స్థానిక ఎన్నికల్లోనే ఆయా పార్టీలు ఎక్కువగా ఓట్లు సాధించేందుకు అవకాశాలున్నాయి. స్థానికంగా అనేక అంశాలు, అభ్యర్థి, బంధుత్వాలు ఈ ఎన్నికల్లో ప్రభావం చూపుతాయి. పార్టీ బలంతోపాటు అభ్యర్థి ఛరిష్మా ఇక్కడ అదనపు బలంగా మారుతుంది. కానీ జనసేన పార్టీ పరిస్థితి ఇందుకు భిన్నంగా మారింది. కార్పొరేషన్ ఎన్నికలతో పోల్చుకుంటే సాధారణ ఎన్నికల్లోనే ఆ పార్టీ అంతో ఇంతో ప్రభావం చూపింది. అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అభ్యర్థికి 16,681 ఓట్లు రాగా.. తాజాగా ఆ పార్టీ పోటీ చేసిన 20 డివిజన్లలో కేవలం 7,407 ఓట్లు వచ్చాయి. అన్ని డివిజన్లలో అభ్యర్థులు నిలబడితే అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగా ఓట్లు వచ్చేవని జనసైనికులు తమకు తాము సర్ధిచెప్పుకుందామనుకున్నా.. నోటాకు వచ్చిన ఓట్లు కేవలం 1915 మాత్రమే కావడంతో తీవ్ర నిరుత్సాహంలో కూరుకుపోయారు.
Also Read : టీడీపీ పరువు తీసిన ఏలూరు ఫలితాలు