iDreamPost
android-app
ios-app

పవన్ ఇచ్చిన వివరణలోనూ అర్థ సత్యాలు, అవాస్తవాలు

  • Published Feb 10, 2022 | 5:23 AM Updated Updated Feb 10, 2022 | 5:23 AM
పవన్ ఇచ్చిన వివరణలోనూ అర్థ సత్యాలు, అవాస్తవాలు

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తనపై చేసిన విమర్శలను ఖండిస్తూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ బుధవారం
విడుదల చేసిన వీడియోలోనూ అర్థ సత్యాలు, అవాస్తవాలను మాట్లాడారు అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వైఎస్సార్ సీపీ నాయకులు ఏం చేసినా, ఏ తప్పులు చేసినా ఎవరూ ప్రశ్నించకూడదా? ఎవరైనా లోపాలను ఎత్తి చూపితే సుప్రీంకోర్టు న్యాయమూర్తి దగ్గర్నుంచి ఉపాధ్యాయులు వరకు ఎవరినీ‌ వదలరా అని పవన్ ప్రశ్నించారు. సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలకు సమాధానంగా తాను ప్రజలకు మాత్రమే దత్తపుత్రుడిని అని చెప్పారు.

అది ఎప్పటి నుంచో చేస్తున్న విమర్శే..

చంద్రబాబునాయుడికి పవన్ కల్యాణ్ దత్తపుత్రుడిలా వ్యవహరిస్తున్నారని సీఎం జగన్మోహన్ రెడ్డి ఎప్పటి నుంచో విమర్శిస్తున్నారు. తాను స్థాపించిన పార్టీని పూర్తిగా చంద్రబాబు కనుసన్నల్లో పవన్ నడుపుతున్నారన్న ఉద్దేశంతో జగన్ ఈ విధంగా వ్యాఖ్యానించారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు సూచన మేరకు జనసేన పోటీ చేయకుండా టీడీపీకి మద్దతు ఇచ్చింది. ప్రశ్నించడానికి పుట్టింది అన్న పార్టీ అధికారంలో ఉన్న టీడీపీని కాకుండా ప్రతిపక్షంలో ఉన్న వైఎస్సార్ సీపీనే ఐదేళ్ళూ ప్రశ్నించింది. పైగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఎప్పుడు ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొన్నా జనం దృష్టిని మళ్లించడానికి పవన్ కల్యాణ్ తన సినీ గ్లామర్ అడ్డు వేసేవారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో ఓటమి అనంతరం చంద్రబాబు సూచన మేరకే బీజేపీతో జనసేన పొత్తు పెట్టుకుంది అన్న ఆరోపణలు ఎదుర్కొంది. ఈ చర్యలను దృష్టిలో ఉంచుకునే సీఎం జగన్.. దత్త పుత్రుడు వ్యాఖ్యలు చేశారని వైఎస్సార్ సీపీ నేతలు అంటున్నారు. తాను ప్రజలకు దత్తపుత్రుడిని అంటున్న పవన్ ఆ విధంగా ఎప్పుడూ వ్యవహరించలేదని చెబుతున్నారు. ప్రజా సమస్యలపై స్పందించకుండా చంద్రబాబు ప్రయోజనాల కోసం పనిచేయడమే పవన్ కు తెలిసిన రాజకీయం అని ఎద్దేవా చేస్తున్నారు.

ఎవరు ఎవర్ని రెచ్చగొట్టారు?

మంత్రులు ఉద్యోగులను రెచ్చగొట్టేలా ఇష్టానుసారంగా మాట్లాడటం వల్లే ఆధిపత్య ధోరణి అని నేను మాట్లాడాను. నా వ్యాఖ్యలను వక్రీకరించ వద్దని సజ్జల రామకృష్ణారెడ్డి‌కి సూచిస్తున్నా అని తన వ్యాఖ్యలను పవన్ సమర్థించుకొనే ప్రయత్నం చేశారు. అయితే ఎవరు ఎవర్ని రెచ్చగొట్టేలా మాట్లాడారు అన్నది తెలియకుండానే పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు చేశారని ఆయన వివరణను బట్టి అర్థం అవుతోంది. విజయవాడలో నిర్వహించిన ర్యాలీ సందర్భంగా ఉద్యోగులే ముఖ్యమంత్రిని, మంత్రుల కమిటీలో సభ్యులను కించపరుస్తూ వ్యక్తిగత విమర్శలు చేశారు. మంత్రుల కమిటీ సంయమనం పాటిస్తూ చర్చలకు ఉద్యోగ సంఘాల నాయకులు వస్తారని గంటల తరబడి వేచి చూసింది. వాస్తవం ఇది కాగా సమస్యలపై పోరాడుతున్న వారిని వెక్కిరించడం మంచి పద్ధతి కాదని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. ఉద్యోగ సంఘాల నేతల మితిమీరిన వ్యాఖ్యలు పవన్ కు తెలియదేమోకానీ రాష్ట్రంలో ప్రజలు గమనించారు. అందుకే చర్చల అనంతరం ఉద్యోగులు చేసిన మితిమీరిన వ్యాఖ్యలపై ఆయా సంఘాల నాయకులు విచారం వ్యక్తం చేశారు.

ఈ మొత్తం ఎపిసోడ్ పై అవగాహన లేకుండా ప్రభుత్వం ఆధిపత్య ధోరణితో వ్యవహరించింది అని స్టేట్మెంట్ ఇచ్చి, దాన్ని సమర్థించుకోవడానికి మరిన్ని అవాస్తవాలను మాట్లాడడం పవన్ కే చెల్లింది అని వైఎస్సార్ సీపీ నాయకులు అంటున్నారు. లోపాలను ఎత్తి చూపితే సుప్రీంకోర్టు న్యాయమూర్తి దగ్గర్నుంచి ఉపాధ్యాయులు వరకు ఎవరినీ‌ వదలరా అని ప్రశ్నిస్తున్న పవన్ ఈ డైలాగ్ టీడీపీ నేతలు నిత్యం చేసే విమర్శల నుంచి కాపీ కొట్టారని వైఎస్సార్ సీపీ నేతలు అంటున్నారు. ఉపాధ్యాయులు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎప్పుడు ఈ ప్రభుత్వం లోపాలు ఎత్తిచూపారు? ప్రభుత్వం వారిని ఎప్పుడు వేధించింది? పున్నమికి, అమావాస్యకి బయటకు వచ్చి అర్థంపర్థం లేని ఇలాంటి విమర్శలు చేస్తే జనం ఏమనుకుంటారు? అన్న సోయ లేకుండా పవన్ వ్యవహరించడం చిత్రంగా ఉందని వైఎస్సార్ సీపీ నేతలు అంటున్నారు. టీడీపీ యొక్క, టీడీపీ కొరకు, టీడీపీ చేత నడపబడుతున్న పార్టీగా జనంలో జనసేనకు ముద్ర పడిందని చెబుతున్నారు. దాని నుంచి బయట పడే వరకు పవన్ కల్యాణ్ ఎన్ని వివరణలు ఇచ్చుకున్నా జనం నమ్మరని అధికార పార్టీ నేతలు సూచిస్తున్నారు.

Also Read : ముందు ఎర్ర జెండా.. వెనుక పచ్చ అజెండా – తూర్పారబట్టిన సీఎం జగన్‌