iDreamPost
iDreamPost
తన కుటుంబాన్ని ఎవరో.. ఏదో అన్నారంటూ అసెంబ్లీ లోపలా.. బయటా టీడీపీ అధినేత చంద్రబాబు ఏడ్చారు..ప్రజల నుంచి సానుభూతి కోరుకుంటున్నారు. జనసేన నేత పవన్ కళ్యాణ్ తో సహా పలు పార్టీల నాయకులు ఆ సీను చూసి.. అసలు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం కూడా చేయకుండా చంద్రబాబుకు సంఘీభావం ప్రకటించేశారు. ఈ తరుణంలో గతంలో చంద్రబాబు వల్ల రాజకీయంగా, కుటుంబపరంగా తీవ్ర ఇబ్బందుల పాలైన కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం చంద్రబాబుకు రాసిన లేఖ టీడీపీలో కలకలం సృష్టించడమే కాకుండా.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను రాజకీయంగా సంకట స్థితిలోకి నెట్టింది.
చంద్రబాబు అణచివేతను కళ్లకు కట్టిన ముద్రగడ
రాష్ట్రంలో గణనీయంగా ఉన్న కాపు సామాజికవర్గ పెద్దగా ముద్రగడ పద్మనాభానికి మంచి పేరుంది. కాపు రిజర్వేషన్లు, ఆ సామాజికవర్గ సంక్షేమానికి పోరాడుతున్న నేతగా ఆ వర్గం ఆదరాభిమానాలు చూరగొన్న నేత ఆయన. 1993లో కాపు రిజర్వేషన్లు కోరుతూ మొదట ఉద్యమం ప్రారంభించిన ఘనత ఆయనదే. 2014 ఎన్నికల సమయంలో ఆ సామాజికవర్గానికి రిజర్వేషన్లు అమలయ్యేలా చూస్తామని చంద్రబాబు హామీ ఇవ్వడంతో టీడీపీకి మద్దతు పలికారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు తన సహజ శైలిలో మొండిచెయ్యి చూపడంతో ముద్రగడ మళ్లీ ఉద్యమించారు.
కుటుంబంతో సహా స్వీయ గృహ నిర్బంధంలోకి వెళ్లారు. ఆ సందర్బంగా చంద్రబాబు ప్రభుత్వం, లోకేష్.. పోలీసుల ద్వారా తమ కుటుంబం పట్ల ఎంత దారుణంగా వ్యవహరించారో.. కేసులు, నిర్బంధాలతో ఎంత అణచివేతకు పాల్పడ్డారో వివరిస్తూ చంద్రబాబుకు ముద్రగడ ఒక బహిరంగ లేఖ రాశారు. తన భార్యను అసెంబ్లీలో అవమానించారంటూ చంద్రబాబు ఏడవటాన్ని ప్రస్తావిస్తూ.. ఆనాడు మా కుటుంబానికి చేసింది అవమానం, అన్యాయం కాదా అని తాజాగా నిలదీశారు. ఈ లేఖ టీడీపీలో కలకలం సృష్టిస్తోంది.
Also Read : Mudragada Chandrababu Letter – మీ పతనం చూసేందుకే బ్రతికి ఉన్నా.. చంద్రబాబుకు ముద్రగడ సంచలన లేఖ
జనసేనకు ఇబ్బందేమిటి?
ముద్రగడ చంద్రబాబుకు లేఖ రాస్తే జనసేనకు ఇబ్బందేమిటి అనుకోవచ్చు. రాజకీయ పరిణామాలు పరిశీలిస్తే ఆ విషయం అర్ధం అవుతుంది. జనసేనాని పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు మొదటి నుంచీ జతగాడు. పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత 2014 ఎన్నికల్లో పోటీ చేయకుండా టీడీపీ-బీజేపీ కూటమికి మద్దతు ఇచ్చారు. 2018లో ఆ రెండు పార్టీలకు బై చెప్పి 2019 ఎన్నికల్లో వామపక్షాలు, బీఎస్పీతో పొత్తు పెట్టుకుని పోటీ చేసిన పలు నియోజకవర్గాల్లో టీడీపీతో లోపాయికారీగా పొత్తు పెట్టుకున్నారు. ఎన్నికల అనంతరం మళ్లీ బీజేపీతో చెలిమి చేసి కొనసాగిస్తున్నా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీని కాదని టీడీపీతోనే పలు చోట్ల అంట కాగారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీతోనే పొత్తు పెట్టుకుంటారన్న సంకేతాలు వస్తున్నాయి.
కాగా పార్టీ పెట్టిన కొత్తలో సామాజిక వర్గాల విషయంలో పవన్ కొంత జాగ్రత్తగానే ఉండేవారు. ఇటీవల ఆ తెర కూడా తొలగిపోయింది. సొంత సామాజికవర్గం అండ కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ తరుణంలో ఆ సామాజికవర్గ పెద్దగా ఉన్న ముద్రగడ గతంలో చంద్రబాబు తన కుటుంబానికి, సామాజికవర్గానికి చేసిన అన్యాయాన్ని, అవమానాన్ని బట్ట బయలు చేస్తూ.. బాబు పతనం చూడటానికే బతికి ఉన్నానని అంటూ బహిరంగ లేఖ రాయడంతో పవన్ పరిస్థితి కుడితిలో పడిన ఎలుక చందంగా మారిందంటున్నారు. సొంత సామాజికవర్గానికి అన్యాయం చేసిన చంద్రబాబు పార్టీతో జత కడితే వారి ఆగ్రహానికి గురి కావలసి వస్తుంది. టీడీపీతో కాకుండా ఒంటరిగా ఎన్నికలను ఎదుర్కొనే సత్తా లేదు. దాంతో ఏం చేయాలో అర్థం కాని అయోమయం నెలకొంది.
Also Read : TDP, Mudragada, Chinarajappa – ముద్రగడ లేఖ.. టీడీపీలో ఉలుకెందుకు..?