iDreamPost
iDreamPost
సినిమా విడుదల తేదీలు ప్రకటించినట్లుగా జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వరుసగా డెడ్ లైన్లు విధిస్తోంది. డెడ్ లైన్ విధించడమే గాని ఆనక ఆ విషయం పట్టించుకోని జనసేన తాజాగా మిర్చి రైతులను ప్రభుత్వం సంక్రాంతిలోగా ఆదుకోవాలంటూ డెడ్ లైన్ ప్రకటించింది. అప్పటికీ స్పందించకపోతే ఆ తర్వాత జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్వయంగా రంగంలోకి దిగనున్నారట. ఈ విషయాన్ని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.
గుంటూరు జిల్లాలో పంట నష్టపోయిన రైతులను పరామర్శించిన మనోహర్ కీలక వ్యాఖ్యలు చేశారు. సంక్రాంతి లోపు ధాన్యం కొనుగోలు చేసి, నష్టపోయిన రైతులకు భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో సంక్రాంతి వెళ్లిన మొదటి వారంలో జిల్లా కేంద్రాలలో దీక్షలు చేపడతామని హెచ్చరించారు. గుంటూరు దీక్షలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్వయంగా పాల్గొంటారని మనోహర్ స్పష్టం చేశారు. పల్నాడు ప్రాంతంలో మిర్చి రైతులు తీవ్రంగా నష్టపోయారని, ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని మనోహర్ ఆరోపించారు. నాలుగున్నర లక్షల ఎకరాలలో మిర్చి సాగు చేసి నష్ట పోయారని, రైతులు సగటున ఎకరాకు రూ.70 వేలు నష్టపోయారని అన్నారు. ధాన్యానికి మద్దతు ధర కల్పిస్తామని జగన్ రెడ్డి హామీ ఇచ్చిన అమలు కావడం లేదన్నారు. 151 శాతం సీట్లు గెలుచుకున్న వైసీపీ ప్రజలను మోసం చేసిందని మనోహర్ విమర్శించారు.
గతంలో ఉద్యమాలు ఇలా..
గత అక్టోబరు 31వ తేదీన విశాఖపట్నంలో బహిరంగ సభ నిర్వహించి 10 రోజుల్లోగా స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం అఖిల పక్షం ఏర్పాటు చేయాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డెడ్ లైన్ విధించారు. అయితే స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రయత్నాలూ చేసింది. దీనిపై నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్ర ప్రభుత్వం కనుక పవన్ కేంద్రాన్ని ప్రశ్నించాలని రాష్ట్ర మంత్రులు సూచించారు. పవన్
డెడ్ లైన్లకు తాము భయపడబోమని కొట్టి పారేశారు.
తాను విధించిన డెడ్ లైన్ దాటి పోయినా, రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోక పోయినా పవన్ అప్పటిలో స్పందించలేదు. ఓ 40 రోజుల తర్వాత మంగళగిరిలో కొన్ని గంటల నిరసన దీక్ష చేసిన పవన్ రాష్ట్ర ప్రభుత్వంపై, ఎంపీలపై రాజకీయ విమర్శలు చేసి అజ్నాతంలోకి వెళ్లిపోయారు. మళ్లీ మూడు రోజులపాటు డిజిటల్ ఫైట్ చేయాలి అంటూ ఆ మధ్య పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. దాదాపు ఏడాది కాలంగా స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు ఉద్యమం జరుగుతుంటే రెండు నెలల క్రితం స్పందించిన పవన్ ఈ విధంగా తూతూమంత్రంగా పోరాడారు. ఏ సందర్భంలోనూ కేంద్ర ప్రభుత్వాన్ని పల్లెత్తు మాట కూడా అనలేదు. దీంతో పవన్ రంగంలోకి దిగడం వల్ల తమకు మేలు జరుగుతుందని ఆశపడ్డ స్టీల్ ప్లాంట్ కార్మికులు నిరుత్సాహపడ్డారు. అంతకు ముందు రాష్ట్రంలో రోడ్లు బాగోలేవంటూ రాజమహేంద్రవరంలో జనసేన కార్యకర్తలతో శ్రమదానం అంటూ ఉద్యమం ప్రారంభించారు. నాలుగు తట్టల మట్టి రోడ్లపై ఉన్న గోతుల్లో పోసి అయిందనిపించారు. ఆ తర్వాత రోడ్ల గురించి పట్టించుకోలేదు.
పరిజ్ఞానం కన్నా.. ప్రచారం మిన్న..
ఒక రాజకీయ పార్టీగా రాష్ట్ర సమకాలీన పరిస్థితులపై జనసేన అవగాహన పెంచుకోకుండానే వ్యవహరిస్తోంది అన్న విమర్శలను ఎదుర్కొంటున్నది. సమస్యల లోతుల్లోకి వెళ్లి పరిజ్ఞానం పెంచుకుని ఉద్యమాలకు దిగడం కాకుండా ఆవేశంగా స్టేట్మెంట్లు ఇచ్చేసి, తేదీలు ప్రకటించి, ఏవేవో విమర్శలు చేసేసి ఒక్కసారిగా సైలెంట్ అయిపోతోంది. ఈ తరహా వైఖరి వల్ల ఆ పార్టీకి సమస్యల పరిష్కారంపై చిత్తశుద్ధి లేదని, ప్రచారం కోసమే ఇదంతా చేస్తోందని జనం భావిస్తున్నారు.
స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు కేంద్రంలో అధికారంలో ఉన్న తన మిత్ర పక్షమైన బీజేపీని ప్రశ్నించక పోవడం ఆ సమస్యపై జనసేన పార్టీకి ఉన్న అవగాహనా రాహిత్యాన్ని సూచిస్తోందని పరిశీలకులు అంటున్నారు. తన మిత్ర పక్షాన్ని ప్రశ్నించే సమయం వచ్చేసరికి నాలిక కరుచుకొని హఠాత్తుగా సైలెంట్ అయిపోవడమే ఆ పార్టీ అవగాహన లేమికి నిదర్శనం అని అంటున్నారు. సమస్య ఏదైనా సరే, ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా వైఎస్సార్ సీపీని, జగన్మోహనరెడ్డిని జనసేన అధినేత పవన్ కళ్యణ్ టార్గెట్ చేస్తారని ఇప్పటికే జనానికి అర్థమైంది. సమస్యలపై అవగాహన లేమికి తోడు, ఈ విధమైన రాజకీయ దురుద్దేశంతో ప్రభుత్వంపై
చేసే విమర్శలు బూమరాంగై ఆ పార్టీ ఇమేజ్ పై ప్రభావం చూపుతున్నాయి.
పంటల కొనుగోళ్లపైనా అవగాహన లేమి..
రైతు భరోసా కేంద్రాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పంటల కొనుగోళ్ళూ ఒక పద్దతి ప్రకారం జరుగుతున్నాయి. 50 లక్షల టన్నుల సేకరణ లక్ష్యంలో డిసెంబర్ 30వ తేదీకి 20.64 శాతం పూర్తయింది. ఇప్పటికి రూ.2,007.46 కోట్ల విలువైన 10,32,039 టన్నుల ధాన్యాన్ని సేకరించారు. తద్వారా 1,36,745 మంది రైతులు మద్దతు ధర పొందారు. 10 జిల్లాల్లోని 8,557 ఆర్బీకేల ద్వారా ధాన్యం సేకరిస్తున్నారు. చిత్తూరు జిల్లాలో వరద కారణంగా పంట దెబ్బతినగా, ప్రకాశం, అనంతపురం జిల్లాల్లో కోతలు ఆలస్యమయ్యాయి.
వాస్తవాలు ఇలా ఉంటే ధాన్యానికి మద్దతు ధర కల్పిస్తామని జగన్ రెడ్డి హామీ ఇచ్చిన అమలు కావడం లేదని మనోహర్ చేసిన విమర్శలను జనం ఎలా అర్థం చేసుకుంటారు.? మిర్చి రైతులు తీవ్రంగా నష్టపోయారని, ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని మనోహర్ చేసిన ఆరోపణలపై రైతులే ఆశ్చర్య పోతున్నారు. పవన్ రంగంలోకి దిగుతారు అంటూ డెడ్ లైన్ ప్రకటించడం కన్నా రాష్ట్రంలో పంటల కొనుగోళ్లను జనసేన నాయకులు పరిశీలిస్తే ప్రభుత్వం చిత్తశుద్ధి అర్థమవుతుంది అన్న సూచనలు వినిపిస్తున్నాయి.