ప్రజాభిప్రాయాన్ని గౌరవించి ప్రభుత్వ భూముల అమ్మకం జాబితా నుంచి గుంటూరులోని పి.వి.కె.నాయుడు మార్కెట్‌ను మినహాయిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ప్రజలతో ముడిపడిఉన్న మార్కెట్‌ను అమ్మకూడదని నిర్ణయం తీసుకున్న ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. మార్కెట్ స్థల అమ్మకాన్ని అడ్డుకోవడానికి జనసేన కార్యకర్తలు పోరాటాలు చేశారని పేర్కొన్నారు.
మిషన్ ఏపీ బిల్డ్ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ భూములను విక్రయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో మొదటి విడతలో గుంటూరు, విశాఖ తదితర ప్రాంతాల్లో 16 స్థలాలను విక్రయించాలని ప్రణాళికలు సిద్ధం చేసింది. అయితే వీటిలో కొన్ని ప్రజా ప్రయోజనాల ముడిపడి ఉన్నాయని తేలడంతో వాటిని అమ్మకం నుంచి మినహాయించింది. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో 16 స్థలాలకు గాను 11 స్థలాలను మాత్రమే విక్రయించాలని మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది.