Idream media
Idream media
ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి రావాలని బీజేపీ, జనసేన నేతలు కలలు కంటున్నారు. ఆ కలలను సాకారం చేసుకునేందుకు కలసి నడవాలని ఎన్నికలకు నాలుగేళ్ల సమయం ఉండగానే జనసేన, బీజేపీల మధ్య పొత్తు పొడిచింది. స్థానిక సంస్థల్లోనూ ఇరు పార్టీలు కలసి వెళ్లాయి. రాజకీయ కార్యక్రమాలు ఉమ్మడిగా నిర్వహిస్తామని పొత్తు సమయంలో బీజేపీ, జనసేన నేతలు ప్రకటించినా.. అప్పటి వరకూ ఆ దిశగా చొప్పుకొదగ్గ ఒక కార్యక్రమం కూడా ఇరు పార్టీలు నిర్వహించలేదు.
ఇరు పార్టీలు కలసి ఎన్నికల క్షేత్రంలోకి వెళ్లాలంటే వారి మధ్య అన్ని విషయాల్లోనూ ఏకాభిప్రాయం రావాలి. ప్రజలకు సంబంధించిన విధానాలు ఒకేలా ఉండాలి. అప్పుడు వారి పయనం సాఫీగా సాగుతుంది. స్పష్టమైన విధానంతో ప్రజల ముందుకు వెళ్లడం వల్ల వారి ఆదరణ చూరగొనే అకాశం పుష్కలంగా ఉంటుంది. 2024 ఎన్నికల్లో అధికారం చేజిక్కించుకుంటామని జనసేన, బీజేపీ నేతలు చెబుతున్నారు. జనసేన కన్నా.. బీజేపీ నేతలు ఈ విషయంలో గట్టి నమ్మకంతో ఉన్నారు. జనసేన– బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని కమలం అధ్యక్షుడు సోము వీర్రాజు తన ప్రమాణ స్వీకార సభలో ఆత్మవిశ్వాసంతో ప్రకటించారు.
అయితే జనసేన, బీజేపీల మధ్య పొత్తు ఉన్నప్పటికీ వారి మధ్య రాజకీయ, ప్రజా విధానాల్లో మాత్రం ఏకాభిప్రాయం లేదని తెలుస్తోంది. ఈ విషయంలో ఎంతో ప్రాముఖ్యత ఉన్న రాజధాని విషయంలో స్పష్టమైంది. అమరావతే రాష్ట్ర ఏకైక రాజధానిగా ఉండాలని హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసేందుకు జనసేన సిద్ధమైంది. ఈ మేరకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన పార్టీ నేతలతో ఇప్పటికే చర్చించి నిర్ణయం కూడా తీసుకున్నారు. బీజేపీ మాత్రం అమరావతి రైతులకు న్యాయం చేయాలంటూనే.. వికేంద్రీకరణకు సై అంటోంది. ఈ నేపథ్యంలో ఎంతో ముఖ్యమైన విషయంపై పొత్తులో ఉన్న జనసేన, బీజేపీ మధ్య భిన్నాభిప్రాయాలు భవిష్యత్‌లో వారి పయనంపై ప్రభావం చూపుతాయనేది ఓ విశ్లేషణ.
ఒక రాజధాని కావాలని జనసేన, మూడు రాజధానులు కాదు జిల్లాకో రాజధాని పెట్టినా మాకు అభ్యంతరం లేదనే బీజేపీలు.. ఎన్నికల క్షేత్రంలో వెళ్లినప్పుడు ప్రజలకు ఏమి చెబుతాయన్నదే ఇక్కడ ప్రశ్న. భిన్నవిధానాలు గల పార్టీల మధ్య పొత్తు రాజకీయ కార్యక్రమాలు చేసే వరకూ కొనసాగినా.. ఎన్నికలు, ఓట్లు అనే అంశం వచ్చేసరికి తేలిపోతుంది. ప్రజల విశ్వాసం పొందలేరన్నది జగమెరిగిన సత్యం. అందుకే బీజేపీ, జనసేన పొత్తు పయనంపై ప్రస్తుతం అనుమానాలు తలెత్తుతున్నాయి. ఎన్నికల నాటికి రెండు పార్టీల మధ్య అన్ని విషయాల్లోనూ ఏకాభిప్రాయం వస్తుందా..? లేదా ఎవరి దారి వారు చూసుకుంటారా.. ? కాలం నిర్ణయిస్తుంది. ఒకరి భూజాలపై చేతులు వేసి వెళ్లే ఆలోచన నుంచి బయటకు రావాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్ సూచించినట్లుగా.. రాష్ట్ర బీజేపీ నేతలు ఒంటరిగా పోరుకు సిద్ధమవుతారా..? అనేది వేచి చూడాలి.