iDreamPost
android-app
ios-app

యూటీ గా జమ్మూ కశ్మిర్

  • Published Oct 31, 2019 | 3:57 AM Updated Updated Oct 31, 2019 | 3:57 AM
యూటీ గా జమ్మూ కశ్మిర్

జమ్మూ కశ్మీర్‌ కేంద్ర పాలిత ప్రాంతంగా మారింది. ఆర్టికల్‌ 370ని రద్దు చేస్తూ, రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజిస్తూ ఈ ఆగస్టు 5న ఎన్‌డీఏ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం నిన్న అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ అర్థరాత్రి 12 గంటలు దాటగానే ఓ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. జమ్మూ కశ్మీర్‌ రాష్ట్రం అన్న పదాన్ని తీసేసి కేంద్ర పాలిత ప్రాంతం అని మార్పు చేసింది. ఇకపై శాశ్వత నివాసులు, వారసత్వంగా వచ్చే రాష్ట్రాంశాలు.. మొదలైనవి ఉండబోవని స్పష్టం చేసింది. మిగిలిన అన్ని రాష్ట్రాలకు మాదిరిగానే కేంద్ర చట్టాలన్నీ ఈ రెండు కేంద్ర పాలిత ప్రాంతాలకూ వర్తిస్తాయని పేర్కొంది.

పార్లమెంటు ఆమోదించిన రాష్ట్ర విభజన చట్టం ప్రకారం.. జమ్మూ-కశ్మీర్‌ ఓ కేంద్ర పాలిత ప్రాంతంగా, లద్దాఖ్‌ రెండో కేంద్ర పాలిత ప్రాంతంగా గురువారం నుంచి పాలనా వ్యవహారాలు సాగుతాయి. గుజరాత్‌కు చెందిన మాజీ బ్యూరోక్రాట్‌ జీసీ ముర్ము జమ్మూ కశ్మీర్‌కు తొలి లెఫ్టినెంట్‌ గవర్నర్‌గానూ, మరో సీనియర్‌ ఐఎఎస్‌ రాధాకృష్ణ మాధుర్‌ లద్దాఖ్‌ ప్రాంతానికి తొలి లెఫ్టినెంట్‌ గవర్నర్‌గానూ గురువారం ప్రమాణస్వీకారం చేస్తారు. ఈ విభజనతో దేశంలో కేంద్ర పాలిత రాష్ట్రాల సంఖ్య ఏడుకు పెరుగుతాయి. రాష్ట్రాల సంఖ్య 28కి తగ్గుతాయి.