iDreamPost
iDreamPost
ప్రపంచంలోనే అత్యున్నత సినీ పురస్కారంగా గుర్తింపు పొందిన ఆస్కార్ కు మన దేశం నుంచి మలయాళం బ్లాక్ బస్టర్ మూవీ జల్లికట్టు ఫైనల్ నామినేషన్ దక్కించుకోవడం దక్షిణాది సినిమా ప్రేమికులను విపరీతమైన ఆనందాశ్చర్యాలకు గురి చేస్తోంది. గత ఏడాది విడుదలై కేరళ నుంచే 10 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ కాన్సెప్ట్ మూవీని ఇటీవలే ఆహా యాప్ లో తెలుగు డబ్బింగ్ విడుదల చేశారు. లిజో దర్శకత్వం వహించిన జల్లికట్టు కథ మొత్తం ఓ చిన్న పల్లెటూరు, గేదె మాంసం కోసం జరిగే వర్గ పోరు చుట్టూ సాగుతుంది. పశువును కేంద్రబిందువుగా తీసుకుని మనుషుల మనస్తత్వాల లోని వైరుధ్యాలను లిజో డీల్ చేసిన తీరుకి అద్భుతమైన ప్రశంసలు దక్కాయి.
ఇప్పుడు ఏకంగా ఆస్కార్ రేస్ లో నిలవడంతో ఇండియన్ ఫిలిం మేకర్స్ గెలుస్తుందనే ఆశాభావంతో ఉన్నారు. శకుంతలా దేవి, గుంజన్ సక్సేనా, చపాక్, స్కై ఈజ్ పింక్, చెక్ పోస్ట్, గులాబో సీతాబో లాంటి భారీ పోటీని తట్టుకుని మరీ జల్లికట్టు రేస్ లో ముందు నిలిచింది. ముఖ్యంగా ఎమోషన్స్ ని అత్యంత సహజంగా తెరకెక్కించిన తీరుకి అగ్ర తాంబూలం ఇచ్చినట్టు ఇక్కడి జ్యురి బోర్డు చైర్మన్ చెబుతున్నారు. గత ఏడాది గల్లీ బాయ్ ని పంపినప్పటికీ ఫైనల్ లిస్టులో కూడా నిలవలేక వెనక్కు వచ్చింది. దానికన్నా మంచి సినిమాలను కాదని పంపడం పట్ల అప్పట్లో చాలా విమర్శలు వచ్చాయి.
కానీ జల్లికట్టు విషయంలో అలాంటి వివాదాలు ఏవి వినిపించడం లేదు. 2002లో అమీర్ ఖాన్ లగాన్ తప్ప ఇప్పటిదాకా ఆస్కార్ ఫైనల్ లిస్ట్ లో ఒక్క భారతీయ సినిమా లేదు. అయినా అది సాధించడమే ఉత్తమ సినిమాకు ప్రామాణికం కాదు కానీ ఆస్కార్ అంటే ఉన్న గౌరవం, క్రేజ్ వేరు కాబట్టి అదొస్తే దక్కే కిక్కే వేరు. వచ్చే ఏడాది ఏప్రిల్ 25 ఆస్కార్ వేడుకలు జరగబోతున్నాయి.కరోనా పరిస్థితుల దృష్ట్యా ఘనంగా చేసే అవకాశాలు కనిపించడం లేదు. జల్లికట్టు ఆస్కార్ కి వెళ్తోందని తెలిసిన వెంటనే ఇది అందుబాటులో ఉన్న ప్రైమ్, ఆహాలవైపు సినిమా చూడని వాళ్ళు వెళ్లడం గమనార్హం. నేటివిటీ సమస్య కారణంగా తెలుగు వెర్షన్ అంతగా మనవాళ్ళకు కనెక్ట్ కాలేకపోయింది.