iDreamPost
iDreamPost
ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య చేస్తున్న మెగాస్టార్ చిరంజీవి దాని తర్వాత లూసిఫర్ రీమేక్ లో అడుగుపెట్టనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దర్శకుడు సుజిత్ స్క్రిప్ట్ ని లాక్ చేసే పనిలో ఉన్నాడు. ఫైనల్ గా చిరు మొత్తం చూశాక ఓకే చేస్తే ఇక ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలుపెడతారు. అయితే యూనిట్ కి క్యాస్టింగ్ పెద్ద సమస్యగా మారింది . లూసిఫర్ ఆషామాషీ కమర్షియల్ సినిమా కాదు . పవర్ ఫుల్ పొలిటికల్ డ్రామా. చాలా పాత్రలు ఉంటాయి. అన్నింటికి ప్రాధాన్యం ఉంటుంది. ఆఖరికి ఓ చిన్న పోలీస్ ఆఫీసర్ కూడా కీలక మలుపుకు కారణం అవుతాడు. అందుకే ఎవరినిబడితే వాళ్ళను తీసుకోలేరు. తాజా అప్ డేట్ ప్రకారం ఇందులో విలన్ పాత్ర చాలా కీలకమైనది.
దాని కోసం జగపతిబాబు పేరు పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. మలయాళం వర్షన్ లో వివేక్ ఒబెరాయ్ దాన్ని అద్భుతంగా పోషించాడు. అతన్నే తీసుకుందామంటే నో అనడానికి రెండు కారణాలు ఉన్నాయి. వినయ వినయ విధేయ లాంటి డిజాస్టర్లో వివేక్ చేసిన విలనీ అంతగా పండలేదు. సెంటిమెంట్ గా ఫ్యాన్స్ నెగటివ్ గా ఫీలయ్యే ఛాన్స్ ఉంది. ఇక రెండో కారణం ఇప్పటికే తెలుగులో డబ్ చేసి ఉంచిన లూసిఫర్ ని అమెజాన్ ప్రైమ్ లో లక్షల్లో చూసేశారు. కాబట్టి ఆ కోణంలో చూస్తే ఫ్రెష్ నటుడైతేనే బెటర్. అందుకే జగపతిబాబు వైపు మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. అధికారికంగా చెప్పకపోయినా టాక్ అయితే జోరుగా నడుస్తోంది.
సీనియర్ నటి మంజు వారియర్ రోల్ కోసం సుహాసిని పేరు వినిపిస్తుండగా అసలు హీరొయినే లేని ఈ కథలో ఏ భామను సెట్ చేస్తారో అని అభిమానుల్లో ఆసక్తిగా ఉంది. చిరంజీవి జగపతిబాబు ఇన్నేళ్ళ సినిమా కెరీర్లో మొదటిసారి నటించింది సైరా నరసింహారెడ్డిలోనే. అంతకు ముందు ఎప్పుడూ ఈ కలయిక సాధ్యపడలేదు. ఒకవేళ ఇప్పుడు నిజంగా జగపతిబాబును తీసుకుంటే లెజెండ్లో బాలయ్యతో పండిన పవర్ ఫుల్ క్లాష్ తరహాలో ఇందులో కూడా చాలా ఆశించవచ్చు. ప్రస్తుతం ఆచార్య ఎప్పుడు మొదలుపెట్టాలా అనే ఆలోచనలో ఉన్న చిరు దాంతో పాటే లూసిఫర్ వ్యవహారాలు కూడా చూస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి పూజాతో మొదలుపెట్టే విధంగా ప్లానింగ్ జరుగుతోందట