iDreamPost
android-app
ios-app

విద్యార్థులకు “అపురూప కానుక” -జగనన్న విద్యా కానుక ..

  • Published Oct 08, 2020 | 2:15 AM Updated Updated Oct 08, 2020 | 2:15 AM
విద్యార్థులకు “అపురూప కానుక” -జగనన్న విద్యా కానుక ..

పోటీ ప్రపంచంలో విద్య ఖరీదైన వ్యాపారం అయ్యిందన్నది నిష్ఠుర సత్యం . సంపన్న వర్గాలకు ఈ ఖరీదైన వ్యాపారం పెద్ద భారం కాకపోవచ్చు కానీ మధ్యతరగతి , అల్పాదాయ వర్గాల వారికీ పిల్లల చదువు యాడాది యాడాదికి మోయరాని భారమైపోతుంది. నాణ్యమైన విద్య , వైద్యం ప్రభుత్వ బాధ్యత అనే మాట నానుడిగానే మిగిలిపోయింది నిన్నటి వరకూ . మన రాష్ట్రంలో పేరుకి వేల కొద్దీ ప్రభుత్వ పాఠశాలలు , టీచర్లు , ఉద్యోగులు , మంత్రిత్వ శాఖలతో పెద్ద విద్యా వ్యవస్థ ఉన్నా కానీ ప్రయోజనం నామమాత్రమే అని చెప్పొచ్చు. 

గత ఇరవై ఐదేళ్లుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్య అభ్యసించేవారి సంఖ్య తగ్గిపోతూ ఇంగ్లీష్ మీడియం ప్రయివేటు పాఠశాలల ప్రాబల్యం గణనీయంగా పెరుగుతూ వచ్చింది . జాతీయ , అంతర్జాతీయ వేదికల్లో ఉన్నత ఉద్యోగాల కోసం ఇంగ్లీష్ మీడియం , నాణ్యమైన విద్య , పిల్లలకి సరైన వసతులు ప్రయివేటు స్కూల్స్ లోనే లభ్యమవుతున్నాయి అనే ఆలోచనతో ఎక్కువ మంది ప్రయివేటు విద్యకే మొగ్గు చూపటం రోజురోజుకూ పెరుగుతూ వచ్చింది .

ప్రయివేట్ స్కూల్ల ఫీజుల భారం సంపన్న వర్గాలకు మోయలేనిది కాకపోయినా , మధ్యతరగతి , అల్పాదాయ వర్గాల వారికి రాన్రాను పెనుభారం కాసాగింది . ఇందుకోసం ఉద్యోగ , వ్యాపార వర్గాలు అప్పులు చేయటం , రైతువారీ కుటుంబాలు పొలం అమ్మి మరీ ఖరీదైన పాఠశాల , కాలేజీల్లో చదివించడం మనం చూస్తూనే ఉన్నాం .

ఇహ దారిద్ర్య రేఖ దిగువున ఉన్నవారు , అట్టడుగు వర్గాలు ప్రయివేట్ స్కూల్స్ లో చదివించే స్థోమత లేక ప్రభుత్వ పాఠశాలల్లో మొక్కుబడిగా చదువుతూ , ప్రాధమిక విద్య పూర్తి కాకుండానే చదువు వదిలేసి పొలానికో , కార్ఖానాకో కూలీ పనులకు పోసాగారు .
వీరినే ప్రభుత్వ గణాంకాల్లో డ్రాపవుట్స్ అంటారు . ఈ సమస్యల నివారణ కోసం , ప్రభుత్వ పాఠశాలల పనితీరు మెరుగు కోసం ఎన్నో చర్యలు తీసుకుంటున్నామని గత ప్రభుత్వాలు చెప్పుకొంటూ వచ్చాయి కానీ ఫలితం సూన్యం .

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు మొదటగా ప్రభుత్వ పాఠశాలల్లో డ్రాపవుట్స్ తగ్గించే లక్ష్యంతో విద్యార్థుల తల్లి ఖాతాలో అమ్మవడి పధకం ద్వారా ఒక్కో తల్లికి పదిహేను వేల చొప్పున ఆర్ధిక సాయం చేసి మీ పిల్లవాణ్ణి స్కూల్ మాన్పించి పనికి తీసుకెళితే మిగిలే డబ్బు వైసీపీ ప్రభుత్వం ఇస్తుంది . మీరు పిల్లవాణ్ణి చదివించండి అనే బలమైన సందేశమిచ్చారు . అంతకుముందు కేంద్ర ప్రభుత్వ సాయంతో అమలవుతున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకంలో అందిస్తున్న మెనూ నాసిరకంగా ఉండటంతో దాన్ని మరింత మెరుగు పరిచి పిల్లల ఎదుగుదలకు కావలసిన పౌష్టికాహారం , వారు ఇష్టపడేట్లు ఆకర్షణీయమైన రోజువారీ మెనూతో అందించడమే కాక ఈవెనింగ్ స్నాక్స్ , పాలు వంటివి కూడా 40 లక్షల మంది విద్యార్థులకు అందించే ఏర్పాట్లు చేశారు .

స్కూల్స్ నిర్వహణ విషయానికి వస్తే విశాలమైన స్థలాలు , భవనాలు ఉన్నా కనీస త్రాగునీరు , ఆడపిల్లల టాయిలెట్స్ వంటి వసతుల లేమితో , తీవ్ర నిర్లక్ష్యంతో పాడుబడిన బంగ్లాళ్ళా ఉన్న ప్రభుత్వ పాఠశాలలను నాడు నేడు పధకం ద్వారా సురక్షిత త్రాగునీరు , పరిశుభ్రమైన టాయిలెట్స్ , ఆకర్షణీయమైన తరగతి గదులు , ఫర్నిచర్ , క్రీడాసామగ్రితో ఆహ్లాదకరమైన వాతావరణంతో సిద్ధం చేసిన ప్రభుత్వ పాఠశాలల్ని చూస్తే అత్యంత ఖరీదైన ప్రయివేటు పాఠశాలలు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల ముందు వెలవెలబోక మానవు .

గోడ మీద రాతగా మిగిలిపోయిన విద్య ప్రాధమిక హక్కు అనే నినాదాన్ని నిజం చేస్తున్న యజ్ఞంలో భాగంగా మరో బృహత్తర కార్యక్రమాన్ని నేడు ప్రారంభించబోతున్నారు జగన్ . విద్యార్థుల తల్లిదండ్రులకు మొదటి భారం ఫీజు కాగా, రెండవ భారం బుక్స్, యూనిపారం, స్టేషనరీ.

ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్ తీసుకొన్న 43 లక్షల మంది విద్యార్థులందరికీ ఇవన్నీ కూడా జగనన్న విద్యా కానుక పధకం ద్వారా నేడు ఉచితంగా అందిస్తుంది వైసీపీ ప్రభుత్వం . ఈ పధకం ద్వారా ఒక్కో విద్యార్థికి విద్యా సంవత్సరానికి సరిపోయే విధంగా టెక్స్ట్ బుక్స్ , నోట్ బుక్స్ , వర్క్ బుక్స్ , షూస్ , బెల్ట్లు , స్టేషనరీతో పాటు మూడు జతల యూనిఫార్మ్ క్లాత్స్ , కుట్టుగూలీతో సహా స్కూల్స్ ఓపెన్ చేయడానికి ముందే అందిస్తున్నారు.

ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఎరువుల గోతాలతో స్కూల్ బాగ్స్ కుట్టించుకొని , అరాకొరా స్టేషనరీతో స్కూల్ కెళ్లే పిల్లలున్నారు . పొద్దున్నే ఓ ముద్ద వండుకొని తిని పిల్లవాణ్ణి బడికి పొమ్మని కూలీకి పరిగెత్తే దినసరి కూలీలు ఉన్నారు . పిల్లవాడు మధ్యాహ్నం ఏం తిన్నారో తెలియక పడే వారి ఆందోళనకి , చాలీచాలని బుక్స్ స్టేషనరీతో పడే ఇబ్బందులకు జగనన్న విద్యా కానుక పథకంతో తెర పడనుంది.

ప్రాధమిక విద్య పట్ల అమితమైన శ్రద్ధ కనబరుస్తూ , అన్ని వర్గాల వారి పిల్లలకి నాణ్యమైన విద్య అందించటానికి ఆర్ధిక భారానికి వెరవకుండా జగన్ ప్రభుత్వం తీసుకొంటున్న చర్యలు మున్ముందు కాలంలో సాధారణ విద్యార్థులు పోటీ ప్రపంచంలో అత్యుత్తమ ఫలితాలు సాధించటానికి తోడ్పడతాయి అని చెప్పొచ్చు …