iDreamPost
iDreamPost
ఆంధ్రప్రదేశ్ లో అధికారం సాధించడమే లక్ష్యంగా కాకుండా దానిని మూడు దశాబ్దాల పాటు నిలబెట్టుకోవాలనే లక్ష్యంతో పనిచేస్తానని సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తొలినాళ్లలో వైఎస్ జగన్ ప్రకటించారు. దానికి అనుగుణంగా పలు మార్పులు తీసుకొచ్చారు. రాజకీయంగానూ, సామాజికంగానూ, పాలనా పరంగానూ ఈ మార్పులన్నీ ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. త్వరలోనే వాటి ప్రభావం అందరికీ అర్థమయ్యే దిశలో సాగుతున్నాయి. కొత్త తరాన్ని తీర్చిదిద్దేక్రమంలో అన్ని రంగాల్లోనూ జగన్ తనదైన ప్రయత్నాలు చేశారు. తొలినాళ్లలో వాటి గురించి పెదవి విరిచిన వారుంటారనడంలో సందేహం లేదు. కానీ ఫలితాలు రావడం మొదలయిన తర్వాత వాస్తవాన్ని అంగీకరించాల్సిన స్థితి అందరికీ వస్తుంది.
ఉదాహరణకు విద్యార్థి దశలోనే మెరుగైన చదువుల కోసం శ్రమిస్తున్నారు. మౌలిక వసతుల కల్పనవైపు దృష్టి పెట్టారు. ఆ తర్వాత కేవలం డిగ్రీ పట్టాలు కాకుండా స్కిల్ డెవలప్ చేసేందుకు ప్రత్యేకంగా యూనివర్సిటీ కూడా ప్రారంభించే పనిలో ఉన్నారు. దానికి తోడుగా స్థానికులకే ఉపాధి అవకాశాలు కల్పించాలనే చట్టం రూపొందించారు. ఓవైపు నాణ్యమైన విద్య, మరోవైపు ఉపాధి అవకాశాలు విస్తృతం చేసే దిశలో చేసిన ప్రయత్నాలు నాడు-నేడు ద్వారా ఆరంభ దశలో ఉన్నాయి. వాటి ఫలితాలు అందరికీ అందేందుకు కొంతకాలం వేచి చూడక తప్పదు. ఉదాహరణకు వైఎస్సార్ హయంలో ఫీజు రీయంబెర్స్ మెంట్ ఇచ్చి పేదలకు ఉన్నత విద్య అందుబాటులోకి తీసుకొచ్చిన కారణంగానే ప్రస్తుతం సాఫ్ట్ వేర్ సహా వివిధ రంగాల్లో దిగువ తరగతి నుంచి కూడా వచ్చి స్థిరపడేందుకు దోహదపడింది. ఆయన మరణించిన తర్వాత కూడా ఫలితాలు పొందిన వారు ప్రస్తావించుకునే పరిస్థితి కొనసాగుతోంది. జగన్ పథకాల ప్రభావం కూడా దీర్ఘకాలంలో కొత్తతరానికి దిశానిర్ధేశం చేసే దిశలో ఉన్నాయనే చెప్పాలి.
Also Read : Mangalagiri Lokesh లోకేష్ ఇలాఖాలో టీడీపీకి షాక్.. ఎంపీపీ డౌటే?
రాజకీయంగా చూసినా తన క్యాబినెట్ సహా అన్ని చోట్లా యువతకు పెద్ద పీట వేస్తున్నారు. ఏపీ క్యాబినెట్ లో సీఎం సహా మూడొంతుల మంది 50 ఏళ్ల లోపు వారే. అంటే కనీసంగా రాబోయే 20 ఏళ్ల పాటు వివిధ స్థానాల్లో ప్రజా జీవితంలో గడిపే అవకాశం వారందరికీ ఉంటుంది. అలాంటి కొత్త తరాన్ని ప్రోత్సహించడం ద్వారా దీర్ఘకాలిక రాజకీయ లక్ష్యాల సాధనలో జగన్ అడుగులు వేసినట్టు స్పష్టమవుతోంది. తన తొలి క్యాబినెట్ కూర్పులో అనేక మంది సీనియర్లు పోటీ పడినా ఆయన మాత్రం ముందస్తు వ్యూహాలకు అనుగుణంగానే వ్యవహరించారు. అనుభవం కన్నా ఆసక్తికి ప్రాధాన్యతనిచ్చారు. కొందరు మంత్రులు దానికి తగ్గట్టుగానే ఈ కాలంలో రాటుదేలారు. అనుభవం గడించారు. భవిష్యత్తులో మరింత మెరుగ్గా రాణించే అవకాశం దక్కించుకున్నారు. వారంతా సుదీర్ఘకాలం పాటు జగన్ కి చేదోడుగా నిలిచే టీమ్ లో కొనసాగే అవకాశం కనిపిస్తుండడం జగన్ టీమ్ బలం స్పష్టమవుతుంది.
వాటికితోడుగా సామాజికంగానూ జగన్ సమూల మార్పులు తీసుకొస్తున్నారు. అన్ని స్థాయిల్లోనూ కొత్త మార్పులకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే ఐదుగురు డిప్యూటీ సీఎంలు , వారి కూడా వివిధ కులాల నుంచి ప్రాతినిధ్యం వహించేలా ఎంపిక చేయడంతో మొదలుపెట్టి, ఆలయ కమిటీల పదవుల్లో కూడా మహిళలు, బీసీలకు పెద్ద పీట వేసేందుకు పూనుకోవడం ఓ సంచలనం అవుతుంది. నామినేటెడ్ పోస్టుల నుంచి స్థానిక సంస్థల పదవుల వరకూ జనరల్ సీట్లలో కూడా బీసీలకు ప్రాధాన్యతనివ్వడం ఆయా కులాల్లో కదలికను తెచ్చింది. చరిత్రలో ఎన్నడూ లేనిరీతిలో శెట్టిబలిజ, మత్స్యకారులను రాజ్యసభకు పంపించడం నుంచి జెడ్పీ పీఠాలపై కృష్ణా జిల్లా వంటి చోట్ల కూడా బీసీ మహిళకు అవకాశం ఇవ్వడం వరకూ జగన్ ముద్ర కనిపిస్తోంది.
Also Read : DevineniAvinsh : విజయవాడ తూర్పులో అన్నీ మంచి శకునములే!
బీసీలకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తున్న తీరు స్పష్టమవుతోంది. ఇది భవిష్యత్ రాజకీయాల్లో ఓ ముద్రని వేసి, మార్పునకు దోహదం చేయబోతోంది. జనరల్ సీట్లలో కూడా అందరికీ అవకాశం ఇచ్చే సంప్రదాయాన్ని జగన్ ఆచరించడంతో ఇక అందరూ అనుసరించాల్సిన పరిస్థితి వస్తుంది. బీసీలకు జనాభాకి తగ్గట్టుగా పదవులు దక్కుతాయి. ఇది సామాజిక మార్పులకు శ్రీకారం చుట్టినట్టవుతుంది.
పాలన విషయంలో కూడా జగన్ పలు విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. మూడు రాజధానులు, ముగ్గురు జాయింట్ కలెక్టర్లు వంటి అనేక నిర్ణయాలు తీసుకున్నారు. కొత్త జిల్లాలు, జిల్లాకో మెడికల్ కాలేజ్ వంటివి కూడా కార్యరూపం దాల్చబోతున్నాయి. ఇలాంటి నయా రాజకీయాలతో రెండున్నరేళ్ల పాలన ముగించుకుంటున్న జగన్ రాబోయే రెండున్నరేళ్ల కాలాన్ని కీలకంగా భావిస్తున్నారు. ముఖ్యంగా ఏపీలో విపక్షం, ఓ సెక్షన్ మీడియా చేస్తున్న దుష్ప్రచారం ప్రజల్లో బలపడే ప్రమాదం ఉందని ముఖ్యమంత్రి గుర్తించారు. దానిని తిప్పికొట్టేందుకు తానే స్వయంగా రంగంలో దిగాలని నిర్ణయించుకున్నారు. తనతో పాటుగా టీమ్ అంతా మరింత క్రియాశీలకంగా మారాల్సిన ఆవశ్యాన్ని ఇటీవల క్యాబినెట్ భేటీలో కూడా ప్రస్తావించారు.
ఎన్నికలకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యిందన్నట్టుగా సంసిద్ధులు కావాలని సూచించారు. రాబోయే రెండున్నరేళ్లలో కుట్రలు ఎదుర్కొంటే ఆ తర్వాత విపక్షాలకు అవకాశం లేని రీతిలో దూసుకుపోవచ్చని ఆయన భావిస్తున్నారు. కరోనా సహా వివిధ విపత్తుల నుంచి గట్టెక్కుతున్న తరుణంలో విపక్ష ఎత్తులను కూడా తిప్పికొడితే మళ్లీ ప్రజల్లో పట్టు నిలుపుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దాంతో త్వరలోనే క్యాబినెట్ కూర్పు సహా పలు మార్పులు జరగబోతున్నాయి. ఏపీలో పాలన పరుగులు పెట్టించే పని జరగోబోతోంది.
Also Read : DL Ravindra Reddy – మళ్లీ రాజకీయాల్లోకి వస్తున్నా: డీఎల్