ఏపీ సీఎం మాటల కన్నా చేతలకు ప్రాధాన్యతనిస్తారు. తన మీద ఎన్ని విమర్శలు వచ్చినా వెనకడుగు వేయని తత్వం ఆయనది. కష్టకాలంలో కూడా ఎదురీదడం జగన్ తత్వం. సమస్యల్లోంచి చెలరేగాలని ఆయన ఆశిస్తారు. అందుకు తగ్గట్టుగానే ఉంటుంది ఆయన ప్రస్థానం. తండ్రి మరణం తర్వాత తీసుకున్న ప్రతీ నిర్ణయం ఆరంభంలో అనేక మంది అనుచరులను సైతం ఆందోళనకు గురిచేసిందే. ఆ తర్వాత అర్థం చేసుకున్న వారికి ఎంతో ఉపశమనం ఇచ్చినట్టుగానే ఉంటుంది. చివరకు సొంత పార్టీ, వరుస కేసులు, జైలు జీవితం, తొలి ఎన్నికల్లో ఓటమి, అసెంబ్లీని బాయ్ కాట్ చేసి ప్రజల్లోకి వెళ్లడం ఇలా అన్ని కీలక సందర్భాల్లోనూ జగన్ నిర్ణయాలు చర్చనీయాంశాలే. పైగా వాటి గురించి జగన్ చెప్పింది చాలా తక్కువ. ఆయన ప్రత్యర్థులే అనేక విషయాలను ప్రజల ముందుకు తీసుకురావడం ద్వారా జగన్ ని బలోపేతం చేసినట్టుగా కొందరు భావిస్తారు. చివరకు సీఎం అయిన తర్వాత కూడా జగన్ తీరు మారలేదు. తానేమీ చెప్పకుండానే చేయాల్సినదంతా చేయడం ఆయన అలవాటు చేసుకున్నట్టు ఈ ఏడాదిన్నర అనుభవం మరోసారి రుజువు చేస్తోంది.
జగన్ ధోరణికి పూర్తి రివర్స్ చంద్రబాబు. పైగా తానో పాలనాధ్యక్షుడినని, చివరకు సీఈవో గా పిలవాలని కూడా చెప్పుకున్న చంద్రబాబులో అలాంటి లక్షణాలేవీ కనబడవు. జగన్ ప్రభుత్వంలో మంత్రులంతా స్వేచ్ఛగా తమ బాధ్యతలు నిర్వహిస్తుంటే చంద్రబాబు అందరి వ్యవహారాల్లోనూ జోక్యం చేసుకునే అలవాటు ప్రదర్శించారు. ప్రస్తుతం మంత్రులు స్వయంగా ఢిల్లీ వెళ్లడం, పెట్టుబడుల విషయంలో మంతనాలు సాగించడం చేస్తుంటే బాబు పాలనలో అన్నీ ఆయనే. పైగా చేసిన దానికన్నా చెప్పుకోవడానికే ఇచ్చే ప్రాధాన్యత నేటికీ తగ్గలేదు. పైగా మీడియా ముందు గంటల తరబడి గడపాలనే ఆయన తపన తీవ్రమయ్యింది. ఈ విషయాలన్నీ ప్రజలు గ్రహించినట్టే కనిపిస్తోంది. జగన్ చేతల సీఎం అయితే బాబు మాటల నాయకుడిగా ముద్రపడింది. పరిణామాలు చివరకు టీడీపీ పుట్టి ముంచే దిశగా సాగుతున్నాయి.
వ్యక్తిగత దాడికి కూడా మౌనమే సమాధానం..
చంద్రబాబు మీద అవినీతి ఆరోపణలు రాగానే ఆయన భుజాలు తడుముకుంటారు. తాను నిప్పు అని చెప్పుకోవడానికి వెనకాడరు. చివరకు తన గురించి తానే అన్నీ చెప్పుకోవడం ఆయనకు తెలిసిన విద్య. కానీ జగన్ పూర్తి విరుద్ధం. తన మీద వ్యక్తిగత దాడి జరుగుతున్నా దానికి సమాధానమిచ్చేందుకు ప్రయత్నం చేయరు. అవకాశం వచ్చిన సమయంలో వివరణ ఇచ్చి చాలిస్తారు. గతంలో అసెంబ్లీలో జగన్ విధాన పరంగా నిలదీసిన సమయంలో ఆయన మీద వ్యక్తిగత దాడికి టీడీపీ ప్రయత్నాలు చేసింది. అలాంటి సమయంలో కూడా జగన్ తన చదువులు, వ్యాపారాలు, జీవితం గురించి స్వల్పంగానే వివరించారు. అవి చాలన్నట్టుగా జనం భావించారు. కానీ చంద్రబాబు అలా కాదు..తాను శోభన్ బాబు అనే దగ్గర మొదలు పెట్టి, చాంతాండంత భారతం వల్లిస్తారు. జనాలకు ఉన్న కొద్దిపాటి విశ్వాసం కూడా కోల్పోతూ ఉంటారు.
అవినీతి విషయంలో, అంతకుముందు ఫ్యాక్షనిస్టు, మొండివాడు, ఎవరి మాట వినడు ఇలా అనేక ముద్రలు వేసిన సమయంలో కూడా అదే తంతు. తాజాగా హిందూవ్యతిరేకిగా ఆయన్ని చిత్రీకరించేందుకు టీడీపీ, బీజేపీలోని ఓ వర్గం బలంగా ప్రయత్నం చేస్తోంది. అయినా వ్యక్తిగత అంశాలను సంస్థాగతం చేయకూడదన్న వైఎస్ బాటలోనే జగన్ సాగుతున్నట్టు కనిపిస్తోంది. జగన్ మాత్రం స్థితప్రజ్ఞత చాటుతున్నారు. సమాధానం మాటల కన్నా చేతలకే విలువ ఎక్కువ ఉంటుందనే భావిస్తున్నట్టు రుజువవుతోంది. టీటీడీ డిక్లరేషన్ అంశంలో ఎంత రాద్ధాంతం చేసినా జగన్ మాత్రం తాను చేయాల్సింది చేశారు. గడిచిన ఏడెనిమిదేళ్లుగా తిరుమల వెళ్లిన ప్రతీసారి ఏం చేస్తున్నారో అదే చేశారు. చంద్రబాబు బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు విపక్ష నేతగా తిరుమల దర్శనాలకు వెళ్లిన సమయంలో ఎలా వ్యవహరించారో అతే పంథాలో సాగారు. గత ఏడాది సీఎంగా తాను వ్యవహరించిన పద్ధతినే మరోసారి ఆశ్రయించారు.
విపక్షాల విమర్శాలు, కొందరు మరీ బరి తెగించి పరిపూర్ణానందలాగ మాట్లాడినా జగన్ తొణికలాడలేదు. అది ఆయన ఆత్మవిశ్వాసానికి అద్దంపడుతుందని మానసిక పరిశోదకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఎవరో ఏదో అన్నారని, వ్యక్తిత్వం కోల్పోకుండా, తాను నమ్ముకున్న దానికి కట్టుబడి అడుగులు వేయడం ఏ కొందరికో సాధ్యమవుతుందని, ప్రస్తుతం జగన్ అలాంటి తీరు గమనించవచ్చని అంటున్నారు. ఆధ్యాత్మిక ఉట్టిపడేలా వ్యవహరిస్తూ, నిబంధనలకు అనుగుణంగా ముఖ్యమంత్రి హోదాలో ప్రజల ప్రతినిధిగా ముందుకు సాగిన తీరు సామాన్యులను సైతం ఆకట్టుకుంటుందని అంటున్నారు. జగన్ ప్రజాబలానికి ఈ ధోరణి చాలా ఉపయోగపడిందని కూడా చెబుతుంటారు. గాలివాటు నేతల్లా కాకుండా ధృఢచిత్తంతో సాగిపోయే వారే ఎప్పటికైనా ప్రజల హృదయాల్లో నిలుస్తారని చెప్పడానికి జగన్ ఓ సాక్ష్యంగా భావిస్తున్నారు. విమర్శలు, కువ్యాఖ్యలు, విషపురాతలకు కూడా జగన్ వ్యవహారశైలి సమాధానమే తప్ప ఆయన నోరు ఎంత మాత్రం కాదని పదే పదే రుజువు చేస్తున్న తీరు ప్రజల మనోభావాలపై చెరగని ముద్ర వేస్తుందని చెబుతున్నారు.