Idream media
Idream media
ప్రత్యేక హోదా.. ఏపీ అభివృద్ధికి అత్యంత అవసరం. 2014 ఎన్నికల సందర్భంగా బీజేపీ, టీడీపీ, జనసేన ప్రత్యేక హోదా సాధిస్తామని మూకుమ్మడిగా హామీ ఇచ్చాయి. చంద్రబాబు అయితే, అది నా బాధ్యత అన్నారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్యాకేజీ కోసం హోదాను తాకట్టు పెట్టారు. అది ముగిసిన అధ్యాయమని గతంలో బీజేపీ పేర్కొంది. కానీ వైసీపీ ప్రభుత్వం మాత్రం 2019 ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు హోదా కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉంది. పూర్తి మెజార్టీతో ఉన్న కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడే పరిస్థితి లేకపోవడంతో ఏపీ సీఎం జగన్ ప్రత్యామ్నాయ విధానాల ద్వారా హోదా ఆవశ్యకతను ఎప్పటికప్పుడు కేంద్రం దృష్టికి తీసుకెళ్తూనే ఉన్నారు. మరికొద్ది రోజుల్లో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానుండడంతో హోదా కోసం అనుసరించాల్సిన వ్యూహాన్ని ఎంపీలకు దిశా నిర్దేశం చేశారు.
ఆ విషయం ప్రస్తావిస్తూ గొంతెత్తండి..
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సింది కేంద్ర ప్రభుత్వమే. కానీ కేంద్రాన్ని డిమాండ్ చేయాల్సిన విపక్ష పార్టీలు రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడం పరిపాటిగా మారింది. జగన్ మాత్రం ఆర్బాటపు ప్రచారాల జోలికి వెళ్లకుండా నిశ్శబ్దంగా తన కర్తవ్యాన్ని నెరవేరుస్తున్నట్లు గత నెలలో సాగిన ఢిల్లీ పర్యటన ద్వారా స్పష్టమైంది. తాజాగా ఇటీవల జరిగిన పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఇచ్చిన హామీ ఆధారంగా ప్రత్యేక హోదా అంశంపై గొంతెత్తాలని వైసీపీ నిర్ణయించింది. 14వ ఆర్ధిక సంఘం సిపార్సుల మేరకు దేశంలో ఏ రాష్ట్రానికీ, కేంద్ర పాలిత ప్రాంతానికీ ప్రత్యేక హోదా ఇవ్వడం లేదంటూ గతంలో చెప్పిన బీజేపీ పుదుచ్చేరికి మాత్రం ప్రత్యేక కేంద్ర పాలిత ప్రాంత హోదా ఇస్తామంటూ ఎన్నికల హామీ ఇచ్చింది. ఈ అంశాన్ని లేవనెత్తుతూ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని గళమెత్తండి అంటూ వైసీపీ ఎంపీలకు జగన్ దిశా నిర్దేశం చేశారు.
జగన్ ఆదేశాల మేరకు పోరాడుతాం..
వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ భేటీ ముగిసిన అనంతరం ఎంపీ వి. విజయసాయిరెడ్డి మాట్లాడుతూ పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారని తెలిపారు. జగన్ ఆదేశాల మేరకు విభజన హామీలన్నింటినీ అమలు చేయాలని పార్లమెంట్ లో కోరతామని చెప్పారు. ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్‌సీపీ మొదట్నుంచీ పోరాడుతుందని గుర్తు చేశారు. ప్రత్యేక హోదా విషయంలో రాజీపడే ప్రసక్తే లేదన్నారు. అలాగే, పోలవరం సవరించిన అంచనాల గురించి పార్లమెంట్‌లో ప్రస్తావిస్తామని తెలిపారు. వీటితో పాటు విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నామని, తెలంగాణ నుంచి రూ.6,112 కోట్లు విద్యుత్ బకాయిలు రావాలని, దిశ చట్టాన్ని ఆమోదించాలని, జగనన్న కాలనీల్లో మౌలిక వసతుల కోసం పీఎంఏవై కింద నిధులు ఇవ్వాలని తదితర అంశాలపై గళమెత్తనున్నట్లు తెలిపారు.