iDreamPost
android-app
ios-app

బాబు మెడకు టీటీడీ ఉచ్చు తప్పదా?

  • Published Sep 03, 2020 | 2:58 AM Updated Updated Sep 03, 2020 | 2:58 AM
బాబు మెడకు టీటీడీ ఉచ్చు తప్పదా?

తిరుమల తిరుపతి దేవస్థానం వ్యవహారాలు ఏపీ రాజకీయాల్లో ఎప్పుడైనా చర్చనీయాంశాలుగానే ఉంటాయి. అయితే వాటి చుట్టూ మతం కోణం రాజేసి వ్యవహారం పక్కదారి మళ్లించాలని ఇటీవల కొందరు ప్రయత్నాలు చేస్తున్నారు. అవి ఫలించకపోవడంతో సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలతో చిక్కులు కొనితెచ్చుకున్న వారు కూడా ఉన్నారు. ఆజాబితాలో కేసుల్లో ఇరుక్కున్న వారిలో టీడీపీ కార్యకర్తలు పలువురుండడం విశేషంగానే చెప్పాలి.

అయితే టీటీడీ ఆర్థిక వ్యవహారాల్లో ఆడిట్ విషయం ఇప్పుడు కలకల రేపుతోంది. గడిచిన 5 ఏళ్లలో టీటీడీ ఆర్థిక పరిస్థితులపై కాగ్ తో ఆడిట్ చేయించాలని కోరుతూ బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి గతంలోనే హైకోర్ట్ ని ఆశ్రయించారు. దానిపై అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం దాటవేత ధోరణి అవలంభించింది. టీటీడీ వ్యవహారాలను కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ తో విచారణకు సుబ్రహ్మణ్యస్వామి ప్రతిపాదనను విస్మరించింది. కానీ జగన్ మాత్రం కీలక నిర్ణయం తీసుకున్నారు. బాబు ముందుకు రాకుండా దాటవేసిన చోట జగన్ చిత్తశుద్ధి ప్రదర్శించారు.

2014-19 వరకూ టీటీడీ ఆదాయ, వ్యయాలను ఆడిట్ చేయించాలని నిర్ణయించారు. అంతటితో సరిపెట్టుకుండా గత రెండేళ్లుగా కూడా మొత్తం ఆర్థిక వ్యవహారాలను కాగ్ తో ఆడిట్ చేయించేందుకు నిర్ణయం తీసుకున్నారు. దానికి అనుగుణంగా ఆగష్ట్ 28 నాటి టీటీడీ బోర్డ్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. త్వరలో ఈ వ్యవహారం పూర్తి చేసే అవకాశం ఉంది. ఆడిటింగ్ పూర్తయిన తర్వాత ఆ వివరాలను హైకోర్ట్ కి అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ప్రభుత్వ తీరుపై సుబ్రహ్మణ్య స్వామి సంతృప్తి వ్యక్తం చేశారు. నిబద్ధత ప్రదర్శించిన జగన్ ప్రభుత్వానికి అబినందనలు తెలిపారు. జగన్ తో పాటుగా టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. తన ప్రతిపాదనకు సమ్మతించి ఆడిటింగ్ కి పూనుకోవడం గొప్ప నిర్ణయం అని కొనియాడారు. దాంతో ఇది ఇప్పుడు ఆసక్తిగా మారుతోంది.

ఈ పరిణామాలు చంద్రబాబుకి గొంతులో వెలక్కాయపడినట్టవుతుందని పలువురు భావిస్తున్నారు. దాంతో ఇప్పటి వరకూ టీడీపీ ఈ విషయంపై గొంతు విప్పలేదు. కాగ్ తో టీటీడీ ఆస్తుల ఆడిటింగ్ విషయంపై ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేయగా, మాజీ సీఎం మాత్రం మౌనం పాటించడం చర్చనీయాంశం అవుతోంది.

గతంలోనే టీటీడీకి సంబంధించిన ఆదాయ, వ్యయంపై ఆడిటింగ్ కోసం చేసిన ప్రయత్నాలను చంద్రబాబు ఖాతరు చేయలేదు. ఇప్పుడు 2014-19 తో పాటుగా తాజా లెక్కలు కూడా తేల్చాలని నిర్ణయంచుకున్న తరుణంలో బాబు మెడకు చుట్టుకునే అవకాశాలు లేకపోలేదని కొందరి సందేహం. ఇప్పటికే టీటీడీకి సంబంధించిన పలు అంశాల్లో చంద్రబాబు మీద రమణ దీక్షితులు సహా అనేక మంది ఆరోపణలు గుప్పించారు. ఈ పరిస్థితుల్లో కాగ్ ఆడిటింగ్ తో అలాంటివన్నీ బయటకు వచ్చే అవకాశాలు లేకపోలేదని అంచనా వేస్తున్నారు.

ఇప్పటికే చంద్రబాబు అనేక అంశాల్లో విచారణను అడ్డుకోవాలని చూస్తున్నారు. అవినీతిపై జగన్ ప్రభుత్వం చేస్తున్న దర్యాప్తుని అడ్డుకునేందుకు అడుగడుగునా యత్నిస్తున్నారు. ఈఎస్ఐ స్కామ్ నుంచి అన్నింటా అవినీతి ఉంటే నిరూపించాలని ఓవైపు సవాల్ చేస్తూ మరోవైపు దర్యాప్తు సాగడానికి వీలులేదని న్యాయపరమైన చిక్కులు సృష్టించడం చంద్రబాబుకే చెల్లించదనే వ్యాఖ్యలున్నాయి. ఇలాంటి సమయంలో టీటీడీ తెరమీదకు రావడంతో చంద్రబాబు ఎలా స్పందిస్తారో చూడాలి. కాగ్ రిపోర్టులో గత సర్కారు సాగించిన వ్యవహారాలు బయటకు వస్తే అసలు బండారం బయటపడుతుందని కొందరు ఆశిస్తుండగా, అది జరగడానికి బాబు సిద్ధపడతారా అనేది సందేహంగానే చెప్పాలి. ఏమయినా జగన్ ప్రభుత్వం మాత్రం జవాబుదారీతనంతో వేస్తున్న అడుగులు అందరూ ఆహ్వానించాల్సిందే.