iDreamPost
android-app
ios-app

YS Jagan, Andhra Pradesh CM – ప్రత్యర్థులకు అందనంత ఎత్తులో, అర్థం కానంత దూరంలో జగన్ 

  • Published Dec 21, 2021 | 7:01 AM Updated Updated Dec 21, 2021 | 7:01 AM
YS Jagan, Andhra Pradesh CM – ప్రత్యర్థులకు అందనంత ఎత్తులో, అర్థం కానంత దూరంలో జగన్ 

రాజకీయాల్లో విజయం సాధించాలంటే తన అనుచరులను తనకోసం నిలబడేలా ఉంచుకోవడమే కాదు ప్రత్యర్థులను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం కూడా ముఖ్యమే. అనుచరుల్లో విధేయత నిలబెట్టుకుంటూనే ప్రత్యర్థులను అర్థం చేసుకోవడం అంచనా వేయడం నాయకుడి విజయరహస్యం. ఈ విషయంలో ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి అందరికంటే అగ్రస్థానంలో ఉన్నారనే చెప్పుకోవాలి. ఆయనకు తన అనుచరుల్ని కాపాడుకోవడం తెలుసు. అంతకు మించి ప్రత్యర్థుల్ని అర్థం చేసుకోవడం, వారి ఎత్తుగడల్ని అంచనా వేయడం కూడా తెలుసు. అందుకే ఆంధ్ర ప్రదేశ్ చరిత్రలోనే కాదు మొత్తం భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలోనే అనూహ్యమైన విజయం సాధించారు.

శాసనసభలో రికార్డు విజయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన పార్టీ అధికారంలో రెండేళ్ళ పాటు కొనసాగిన తర్వాత స్థానిక సంస్థల్లో ఎంతో కొంత వ్యతిరేకత తెచ్చుకుంటుంది. అలాగే శాసనసభ ఎన్నికల్లో ఓటమి పాలయిన పార్టీ రెండేళ్ళలో ఎంతో కొంత పుంజుకుంటుంది. అయితే ఆంధ్రప్రదేశ్ లో ఇలాంటిదేమీ జరగలేదు. రెండేళ్ళ తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా అధికార పార్టీ అనూహ్యమైన, అసాధారణమైన విజయం సాధించింది. మరో వైపు ప్రతిపక్షం తన బలాన్ని పెంచుకోవడం సంగతి వదిలేస్తే మొత్తంగా తన అస్తిత్వాన్నే కోల్పోయింది. విజయానికి ఆమడ దూరంలో నిలబడింది. ఇంతటి విజయం సాధించి జగన్మోహన్ రెడ్డి తన ప్రత్యర్థులకు అందనంత, అర్థంకానంత ఎత్తులో నిలబడ్డారు. 

వాస్తవానికి జగన్మోహన్ రెడ్డిని రాజకీయాల్లోకి తెచ్చింది ప్రత్యర్థులే. ఏవో సొంత వ్యాపారాలు చూసుకుంటూ బెంగుళూరులో ఉంటున్న జగన్మోహన్ రెడ్డిని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అప్పటి టీడీపీ నేత పరిటాల రవి హత్యలోకి లాగి విస్తృత ప్రచారం చేశారు. అప్పటికి జగన్మోహన్ రెడ్డికి రాజకీయాలతో సంబంధం లేదు. ఆంధ్రప్రదేశ్ లో కూడా ఆయన నివసించడం లేదు. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు, టీడీపీ నేతలు తరచూ జగన్మోహన్ రెడ్డి పై రాజకీయ ఆరోపణలు చేస్తున్న పరిస్థితుల్లో ఆయన రాజకీయ ప్రవేశం చేశారు. కడప పార్లమెంటుకు పోటీ చేశారు. అలా మొదలయిన ఆయన రాజకీయ ప్రస్థానం ఇప్పుడు తిరుగులేని ఆధిక్యంతో ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నారు. ప్రతిపక్షం ఆయనకు సమీపంలో ఎక్కడా లేనంత ఆధిక్యత సంపాదించారు. 

రెండేళ్ళు మించి ముఖ్యమంత్రి పదవిలో జగన్మోహన్ రెడ్డి కొనసాగుతున్నా ఆయన ప్రత్యర్థులు మాత్రం ఇప్పటికీ ఆయన రాజకీయాలను అర్థం చేసుకోలేకపోతున్నారు. ఆయన వ్యూహాలను అంచనా వేయలేకపోతున్నారు. ప్రధాన ప్రత్యర్థి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు రాజకీయాల్లో నాలుగు దశాబ్దాల అనుభవం ఉన్న నేత. జాతీయ రాజకీయాల్లో కూడా అనేక కీలక పరిణామాల్లో ప్రముఖ పాత్ర పోషించిన అనుభవం ఆయనకు ఉంది. అలాగే అనేకమంది రాజకీయ ఉద్దండులతో కలిసి పనిచేసిన అనుభవం కూడా చంద్రబాబుకు ఉంది. ఓ దశాబ్దంన్నర పాటు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన పాలనానుభవం కూడా ఉంది. అయినా జగన్మోహన్ రెడ్డి రాజకీయాలను అంచనా వేయడంలో, అర్థం చేసుకోవడంలో విజయం సాధించలేకపోయారు. 

రాజారెడ్డిని చూశాను, రాజశేఖర్ రెడ్డిని చూశాను అంటున్న చంద్రబాబు నాయుడు ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డిని చేరుకోలేకపోతున్నారు. రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డిని చూడలేకపోతున్నారు. అందుకే కుప్పంలో చంద్రబాబుకు గట్టి దెబ్బ తగిలింది. నాలుగు దశాబ్దాల రాజకీయంలో తిరుగులేని విజయం సాధిస్తూ తనకు కంచుకోటగా మలచుకున్న కుప్పంలో పార్టీ ఘోరపరాజయం పొందడం అంటేనే చంద్రబాబు నాయుడు తన రాజకీయ ప్రత్యర్థిని అంచనా వేయలేకపోయారు అనుకోవాలి. రానున్న 2024 ఎన్నికల్లో గెలుపు కష్టమే అనే అభిప్రాయం టీడీపీ శ్రేణుల్లో కలిగేలా జగన్మోహన్ రెడ్డి చేస్తున్న రాజకీయం చంద్రబాబుకు అర్థం కావడానికి ఇంకా ఎంతకాలం పడుతుందో!

చిన్న వయస్సులోనే రాజకీయంగా దేశంలో ఎవరూ ఎదుర్కోని సవాళ్లను దాటుకుంటూ, డక్కీ మొక్కీలు తిని వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ప్రజా ఆశీర్వాదంతో తిరుగులేని నాయకుడి గా అధికారంలోకి వచ్చిన వైఎస్‌ జగన్‌.. ప్రజలకు తాను ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తూ.. తండ్రి వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి మాదిరిగా వారి హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుంటున్నారు. ఈ రోజు 50వ వడిలోకి అగుడుపెడుతున్న వైఎస్‌ జగన్‌ కు జన్మదిన శుభాకాంక్షలు. పరిపాలనా సంస్కరణలు, వినూత్నమైన ప్రజా సంక్షేమ పథకాలతో యువ సీఎం వైఎస్‌ జగన్‌ పాలనలో ఆంధ్రప్రదేశ్‌ ఉన్నత శిఖరాలకు వెళుతుందనడంలో సందేహం లేదు.

Also Read : ముఖ్యమంత్రిగా మూడో పుట్టిన రోజు, మరింత ఉత్సాహంతో ముందుకెళ్తున్న జగన్