iDreamPost
android-app
ios-app

ప‌ట్టుబిగిస్తున్న జ‌గ‌న్.. ఉలిక్కిప‌డుతున్న టీడీపీ

ప‌ట్టుబిగిస్తున్న జ‌గ‌న్.. ఉలిక్కిప‌డుతున్న టీడీపీ

ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్ర సంక్షేమం, క‌రోనా విప‌త్తు నుంచి పాల‌న‌ను గాడిలో పెట్ట‌డం వంటి కార్య‌క్ర‌మాల‌పై దృష్టి సారించిన ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఇప్పుడు రాజ‌కీయాల‌పై దృష్టి సారించిన‌ట్లు క‌నిపిస్తున్నారు. కీల‌క నిర్ణ‌యాల అమ‌లుకు కృత‌నిశ్చ‌యంతో ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఢిల్లీ వెళ్లే ముందు పోల‌వ‌రం ప్రాజెక్టును క్షుణ్నంగా ప‌రిశీలించిన జ‌గ‌న్ ప్రాజెక్టు ఎత్తు, త‌దిత‌ర అంశాల‌పై వ‌స్తున్న వివాదాల‌పై క్లారిటీ ఇచ్చారు. అనంత‌రం ఢిల్లీ వెళ్లిన జ‌గ‌న్ ఏపీ అభివృద్ధిలో కీల‌క‌మైన మూడు రాజ‌ధానుల విష‌యంపై కేంద్ర పెద్ద‌ల‌తో చ‌ర్చిస్తున్నారు. ఇంత కాలం వేచి చూసే ధోర‌ణి అవ‌లంబించిన జ‌గ‌న్ ఇక‌పై రాజ‌ధానుల అంశంపై సీరియ‌స్ గా దృష్టి సారించిన‌ట్లు అర్థ‌మ‌వుతోంది. మ‌రోవైపు జ‌గ‌న్ ప్ర‌తిపాద‌న‌ల‌కు కేంద్రం సుముఖంగా ఉన్న‌ట్లుగా వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ ప‌రిణామాల‌న్నింటినీ గ‌మ‌నిస్తున్న తెలుగుదేశం అధినాయ‌కుడి శిబిరంలో క‌ల‌వ‌రం మొద‌లైంది.

జ‌గ‌న్ వ్యూహాత్మ‌కంగా అడుగులు

మూడు రాజ‌ధానుల‌కు అనుకూలంగా కేంద్రం కోర్టులో అఫిడ‌విట్ ఇచ్చిన విష‌యం తెలిసిందే. అలాగే ఇప్పుడు రాజ‌ధానుల‌కు సంబంధించిన అంశాల‌పై కేంద్రం ముంద‌డుగు వేసేలా.. ఢిల్లీ వెళ్లిన జ‌గ‌న్ వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఏపీకి మూడు రాజ‌ధానుల అవ‌స‌రాన్ని గుర్తించి ఈ మేర‌కు ఆగ‌స్టులో చ‌ట్టం చేశాం. విశాఖను పాల‌నా ‌రాజ‌ధానిగా, అమ‌రావ‌తిని శాస‌న రాజ‌ధానిగా, క‌ర్నూలును న్యాయ రాజ‌ధానిగా చేసిన విష‌యాల‌ను ప్ర‌స్తావిస్తూ హైకోర్టును క‌ర్నూలుకు త‌ర‌లించేందుకు కావాల్సిన నోటిఫికేష‌న్ ను విడుద‌ల చేయాల‌ని కేంద్ర హోంమంత్రి అమిత్ షాను జ‌గ‌న్ కోరారు. ఇందుకు గ‌తంలో బీజేపీ ప్ర‌తిపాదించిన అంశాన్ని ఆయ‌న దృష్టికి తీసుకెళ్లారు. 2019 ఎన్నిక‌ల్లో భార‌తీయ జ‌న‌తా పార్టీ మేనిఫెస్టోలోనూ క‌ర్నూలులో హైకోర్టు ఏర్పాటు అంశం ఉంద‌ని గుర్తు చేస్తూ వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించారు. దాదాపు గంట పాటు అమిత్ షాతో చ‌ర్చ‌లు జ‌రిపిన జ‌గ‌న్ మూడు రాజ‌ధానుల అంశానికి సంబంధించి స్ప‌ష్ట‌మైన హామీ పొందిన‌ట్లుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. దీంతో పాటు రాష్ట్రానికి రావాల్సిన నిధులకు సంబంధించి పూర్తి వివ‌రాల‌తో కూడిన విన‌తిప‌త్రాన్ని ఆయ‌న‌కు అంద‌జేశారు.

ఈ ప‌రిణామాల‌పై స్పందించిన టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఉలిక్కిప‌డుతున్న‌ట్లుగా ఆయ‌న మాట‌ల‌ను బ‌ట్టి అర్థ‌మ‌వుతోంది. అమ‌రావ‌తిపై మోదీ స‌హా ప్ర‌ముఖులంద‌రూ సుముఖంగా ఉన్నార‌ని, అయినా జ‌గ‌న్ మొండిగా ప్ర‌య‌త్నాలు చేస్తున్నారంటూ వాపోతున్నారు. అయితే ఇక్క‌డ ఓ విష‌యాన్ని మ‌రిచిపోయారు. అమ‌రావ‌తికి కేంద్ర పెద్ద‌లంద‌రూ సుముఖంగా ఉన్నార‌ని చెబుతున్న కేంద్రం.. మూడు రాజ‌ధానులకు అనుకూలంగా అఫిడ‌విట్ ఇచ్చిన విష‌యాన్ని మ‌రిచిపోయిన‌ట్లు ఉన్నారు. అలాగే ఉద్యోగులు కూడా అమ‌రాతి వ‌ద్దు.. విశాఖ ముద్దు అంటున్నార‌ని ఆయ‌నే స్వ‌యంగా చెప్పారు. ఉద్యోగుల నిర్ణ‌యాన్ని బాబు జీర్ణించుకోలేక పోతున్నారు. వారిపై కూడా ఆరోప‌ణ‌లు చేసే స్థితికి చేరారు. ఇలా మొత్త‌మ్మీద ఢిల్లీలో జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను తెలుగుదేశం నిశితంగా ప‌రిశీలిస్తోంద‌ని అర్థ‌మ‌వుతోంది.