ప్రభుత్వ కార్యాలయాలు అంటేనే అవీతికి నిలయాలుగా ప్రజలు మనసుల్లో ఎప్పటినుండో ఒక ముద్ర పడిపోయింది. కొంతమంది ప్రభుత్వ అధికారులకి చేయి తడిపితే కానీ ఏ పని జరగదని చెప్పడంలో కొంత వాస్తవం కూడా లేకపోలేదు, ప్రజలకు మేలు చేయాలి అనే లక్ష్యంతో నాయకులు ఎన్ని పథకాలు రూపొందించినా అవి లబ్దిదారుల దగ్గరకు చేరే సమయంలో అధికారులు చేతివాటం చూపుతూ ఉంటారు. ఇటువంటి ప్రభుత్వ వ్యవస్థ పనితీరులో మార్పు రానంతవరకు ఎన్ని సంక్షేమ పథకాలు రూపొందించినా తాను ఆశించిన సత్ఫలితాలు రావు అని భావించిన ముఖ్యమంత్రి జగన్, ప్రభుత్వ ఆఫీసులలో జరిగే అవినీతిని సమూలంగా ప్రక్షాళణ చేసే విధంగా మరొక ముందడుగు వేశారు.
వివిధ ప్రభుత్వ శాఖలలో అవినీతికి ఆస్కారం ఉన్న అంశాలను గుర్తించి వాటిని సమూలంగా నివారించేందుకు ఒక పారదర్శకతతో కూడిన అధ్యయనం అవసరం అని భావించిన ముఖ్యమంత్రి జగన్, అహ్మదాబాద్ ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ తో ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. అహ్మదాబాద్ ఐ.ఐ.యం ప్రజా విధానాల బృందానికి చెందిన ప్రొఫెసర్ సుందరపల్లి నారాయణ స్వామి నేతృత్వంలో ప్రభుత్వ శాఖలలో అవినీతికి ఆస్కారం ఉన్న అంశాలను గుర్తించి వాటిని పరిష్కరించే సూచనలను వచ్చే ఫిబ్రవరి 3వ వారం నాటికి ప్రభుత్వానికి ఒక నివేదిక రూపంలో ఇవ్వనున్నారు.
ప్రభుత్వ వ్యవస్థలో ఇప్పుడున్న, జరుగుతున్న లోపాలను గుర్తించి ప్రక్షాళణ చేసి సామాన్యులకి పూర్తిస్థాయిలో లబ్ది చేకూరేలా జగన్ తీసుకున్న ఈ నిర్ణయం విజయవంతం అయితే ఒక సరికొత్త ఆంధ్రప్రదేశ్ ఆవిష్కృతం అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు ప్రజాస్వామ్య వాదులు, జగన్ తీసుకున్న ఈ నిర్ణయం ఎలాంటి ఫలితాలు ఇస్తుందో వేచి చూడాలి.