Idream media
Idream media
పేదలకు సంక్షేమ పథకాల అమలు కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోట్లాది రూపాయలను ఖర్చు పెట్టడమే కాదు.. విప్లవాత్మక మార్పుల ద్వారా కోట్లాది రూపాయల ఆదా చేసుకునే మార్గాలను కూడా అన్వేషిస్తోంది. ఆదాయం పెంపు మాత్రమే కాకుండా అవినీతికి కూడా అడ్డుకట్టపడేలా చర్యలు చేపడుతోంది. దానికి నిదర్శనమే రివర్స్ టెండరింగ్. ప్రాజెక్టుల అవినీతి అరికట్టేందుకు రివర్స్ టెండరింగ్ చేపడతామని అధికారంలోకి రాకముందే ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. అధికారంలోకి వచ్చాక దాన్ని అమలు చేస్తున్నారు. దీని వల్ల ప్రభుత్వానికి ఆదాయం రావడమే కాకుండా పారదర్శకంగా పనులు జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే కొన్ని సంస్థల్లో మాత్రమే రివర్స్ టెండరింగ్ ప్రక్రియ ఉండేది. ఈ విధానాన్ని అవలంబిస్తున్న మొట్టమొదటి రాష్ట్రంగా ఏపీని చెప్పుకోవచ్చు. గత ఆగస్టు నుంచి ఇప్పటి వరకూ 14,285 కోట్ల విలువైన 45 ప్రాజెక్టుల్లో రివర్స్ టెండరింగ్ విధానాన్ని ప్రభుత్వం అవలంభించింది.
పోలవరం నుంచే మొదలు…
జగన్ అధికారంలోకి వచ్చాక రివర్స్ టెండరింగ్ విధానాన్ని పోలవరం ప్రాజెక్ట్ నుంచే మొదలుపెట్టారు. పోలవరం ప్రాజెక్టు హెడ్ వర్క్స్ నుంచి ఎడమ కాలువకు అనుసంధానం చేసే 65వ ప్యాకేజీ పనులకు రివర్స్ టెండరింగ్ పద్ధతి నిర్వహించారు. దాని ద్వారా ప్రభుత్వానికి రూ. 58 కోట్ల వరకూ ఆదా అయింది. ఆరు సంస్థలు టెండర్లు దాఖలు చేయగా, అందులో ఎల్ 1 సంస్థ రూ.260.26 కోట్లకు టెండర్ దాఖలు చేసింది. రూ.274 కోట్ల విలువ చేసే పనులను 6.1 శాతం తక్కువకు పూర్తి చేయడానికి అంగీకరించిన ఎల్ 1 కన్నా ఎవరైనా తక్కువకు చేస్తారా అంటూ రివర్స్ టెండరింగ్ నిర్వహించారు. దాంతో రూ.231.47 కోట్లతో పూర్తి చేసేందుకు మ్యాక్స్ ఇన్‌ఫ్రా సంస్థ ముందుకొచ్చింది. ఇది అంచనా విలువ కన్నా 15.66 శాతం తక్కువ. గతంలో నిర్వహించిన టెండర్‌తో పోలిస్తే ఈసారి రూ.58.53 కోట్ల ప్రజాధనం ఆదా చేసినట్టు ప్రభుత్వం వెల్లడించింది.
మరో 782 కోట్లు ఆదా…
ప్రాజెక్టులో కీలకమైన హెడ్ వర్క్స్, పవర్ స్టేషన్ పనులకు కూడా గతంలో రివర్స్ టెండర్లు పిలిచారు. రూ. 4,987.55 కోట్ల విలువచేసే పనులకు టెండర్లు పిలువగా.. 12.6 శాతం తక్కువ మొత్తానికే ఈ పనులు చేపట్టేందుకు ‘మేఘా’ సంస్థ ముందుకొచ్చింది. ఈ పనుల కోసం రూ. 4,358.11 కోట్లు కోట్ చేస్తూ.. మేఘా సంస్థ బిడ్డింగ్ వేసింది. దీంతో ప్రభుత్వ ఖజానాకు రూ. 628.43 కోట్లు ఆదా అవుతుందని నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. అంతేకాదు, గతంలో 4.8 శాతం అధిక ధరకు కాంట్రాక్టు ఇవ్వడం వల్ల ప్రభుత్వానికి రూ. 154 కోట్ల అదనపు భారం పడిందని, ఇప్పుడు ఆ భారం కూడా తగ్గడంతో ప్రభుత్వానికి మొత్తం రూ. 782 కోట్లు ఆదా అయినట్టు అధికారులు గతంలోనే ప్రకటించారు.
788 టెండర్లకు రివర్స్ టెండరింగ్
ఆంధ్రప్రదేశ్ లో విప్లవాత్మక మార్పులకు కారణమవుతోంది రివర్స్ టెండరింగ్ విధానం. ఇప్పటి వరకూ మొత్తం 788 టెండర్లకు రివర్స్ టెండరింగ్ నిర్వహించినట్లు అధికారులు చెబుతున్నారు. సాధారాణ టెండర్ల ప్రక్రియ ద్వారా 7.7 శాతం మిగులు ఉండగా, రివర్స్ టెండరింగ్ ద్వారా 15.01 శాతం మిగులు ఉంటోందని వారు ఇటీవల సీఎం జగన్ కు వివరించారు. ఇప్పటి వరకూ పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి చేపట్టిన కొన్ని రివర్స్ టెండర్ల ద్వారానే 800 కోట్ల వరకూ ఆదాయం మిగిలినట్లు లెక్కల ద్వారా తెలుస్తోంది. మిగతా ప్రాజెక్టుల్లో కూడా ఈ విధానం అమలైతే ప్రభుత్వానికి వేల కోట్లు ఆదా అవుతాయని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు.
రూ.కోటి దాటిన ప్రతి లావాదేవీలపై రివర్స్ టెండరింగ్
అవినీతి నిర్మూలనకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంటూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. కోటి రూపాయలు దాటిన వస్తు, సేవల కొనుగోళ్లకు ఏపీ ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ చేపట్టనుంది. కొనుగోళ్లలో పారదర్శకత కోసం రివర్స్ టెండరింగ్ విధానాన్ని అమలు చేయాల్సిందిగా ఆదేశించింది. కోటి రూపాయల విలువదాటిన ప్రతీ లావాదేవీని రివర్స్ టెండరింగ్ ద్వారా చేపట్టాలని ప్రభుత్వశాఖలకు ఆదేశాలు జారీ చేసింది. టెండర్ కమ్ రివర్స్ ఆక్షన్ విధానం ద్వారానే కొనుగోళ్లు చేయాలని స్పష్టం చేసింది.
విధిగా పాటించాల్సిందే
ఇప్పటి వరకూ ఇంజనీరింగ్ పనుల్లో చేపట్టిన రివర్స్ టెండరింగ్ ద్వారా ప్రజాధనం ఆదా అయ్యిందని ప్రభుత్వం పేర్కొంది. టెండర్ కమ్ రివర్స్ ఆక్షనింగ్ లేదా రివర్స్ టెండర్ల విధానాన్ని ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలు, సొసైటీలు, విశ్వవిద్యాలయాలు, స్థానిక సంస్థలు, ఇతర ప్రభుత్వ సంస్థలు విధిగా పాటించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. రివర్స్ టెండరింగ్ లో ఈ-ప్రోక్యూర్ మెంట్ విధానం అమలు చేసేందుకు తగిన ఏర్పాట్లు చేయాల్సిందిగా ఏపీ టెక్నాలజీ సర్వీసెస్‌ను ప్రభుత్వం ఆదేశించింది. చెల్లింపుల విధానంలోనూ మార్పులు చేయాల్సిందిగా ఏపీ ప్రభుత్వం సీఎఫ్ఎస్ఎస్‌కు సూచనలు చేసింది. రివర్స్ టెండరింగ్ ద్వారా ప్రభుత్వానికి డబ్బు ఆదా కావడంతో పాటు అవినీతికి అడ్డుకట్ట పడడం ఖాయమని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.