Idream media
Idream media
రాష్ట్రంలోని మూడు ప్రాంతాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా.. ప్రాంతీయ సమానాభివృద్ధి దిశగా పరిపాలన వికేంద్రీకరణకు ఏపీ సర్కారు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా అమరావతి ప్రాంత అభ్యున్నతికి కూడా ప్రభుత్వం కృషి చేస్తోంది. రైతులకు సంబంధించి పలు ప్రయోజనకర నిర్ణయాలను ఇప్పటికే తీసుకుంది. వారి అవసరాలను ఎప్పటికప్పుడు తెలుసుకుని తీర్చేందుకు ప్రణాళికలు రచిస్తోంది.
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అమరావతిలో భూమి లేని నిరుపేదలకు ఇచ్చే పరిహార భృతిని (పెన్షన్) రూ.2,500 నుంచి ఏకంగా రూ.5 వేలకు పెంచిన ప్రభుత్వం వాటిని ఎప్పటికప్పుడు వారి ఖాతాల్లో జమ చేస్తూ వారికి ఆర్థిక ఆసరా కల్పిస్తోంది. ప్రభుత్వం నిర్ణయంతో అమరావతి పరిధిలోని 29 గ్రామాల్లో 20,100 మంది భూమి లేని పేదలు లబ్ది పొందుతున్నారు. ఈ పెన్షన్ పొంపుతో ప్రభుత్వం ఏడాదికి రూ.60.30 కోట్ల భారం మోస్తోంది. సీఆర్ డీఏ చట్టంలో పేర్కొన్నదానికంటే అదనపు ప్రయోజనాలను రైతులకు కలిగిస్తోంది. 29 గ్రామాల్లో భూములిచ్చిన రైతులకు పదేళ్ల పాటు కౌలు ఇవ్వనున్నట్లు ఆ చట్టంలో పేర్కొన్నారు. ఈ కౌలు వ్యవధిని 10 ఏళ్ల నుంచి 15 ఏళ్లకు పెంచాలని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నిర్ణయించింది. జరీబు భూమి ఎకరానికి రూ.50 వేలు, మెట్ట భూమి ఎకరానికి రూ.30 వేల చొప్పున కౌలు ఇవ్వాలని నిర్ణయించారు. ప్రతిఏటా జరీబు భూములకు రూ.5 వేలు, మెట్ట భూములకు రూ.3 వేల చొప్పున కౌలు పెంచనున్నారు. పదేళ్ల తరువాత జరీబు భూమికి ఎకరాకు రూ.లక్ష, మెట్ట భూమికి ఎకరాకు రూ.60 వేల చొప్పున ఇవ్వనున్నారు. 29 గ్రామాల్లో 28,586 మంది రైతులు 34,385.275 ఎకరాల భూమిని ఇచ్చారు. వీరంతా పదేళ్ల తర్వాత కూడా లబ్ధి పొందనున్నారు. పట్టా భూములు ఇచ్చిన రైతులతో సమానంగా అసైన్డ్ భూములు ఇచ్చిన వారికి కూడా ప్రభుత్వం ప్లాట్లు కేటాయించనుంది.
రూ.167.73 కోట్లు రైతుల అకౌంట్లలో జమ
అమరావతి ప్రాంత రైతులకు వార్షిక కౌలు, రెండు నెలల పెన్షన్‌ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా విడుదల చేసింది. వార్షిక కౌలు కింద రూ.158 కోట్లతో పాటు రెండు నెలల పెన్షన్ 9.73 కోట్లను ఆయా రైతుల అకౌంట్లలో జమ చేయనుంది. భూ సమీకరణలో భాగంగా భూములు ఇచ్చిన అమరావతి రైతుల బ్యాంకు అకౌంట్లలో ఈ సొమ్ము జమ అవుతుందని ప్రభుత్వం పేర్కొంది. ఇందుకు సంబంధించిన సర్వే జరుగుతోందని.. అదే విధంగా అమరావతి కౌలు రైతులకు పెన్షన్ ఐదువేల రూపాయిలకి పెంచాలని ప్రభుత్వం భావించిందని తెలిపారు. కానీ ప్రతిపక్షాలు కోర్టుకు వెల్లడంతో సాధ్యపడలేదన్నారు. అందుకే ఈ దఫా 2500 రూపాయలే చెల్లించడం జరిగిందని స్పష్టం చేశారు. అమరావతిలో రాజధానికి భూములిచ్చిన రైతులకు కౌలు ఇవ్వలేదని ప్రజలకు రెచ్చగొడుతూ నిరసనకు దిగిన ప్రతిపక్ష నేతల తీరుపై మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము బుధవారమే అర్హులైన రైతుల బ్యాంక్ అకౌంట్‌లో డబ్బులు జమ చేశామని… అయితే కొన్ని సాంకేతిక సమస్యల వల్లే ఆలస్యం జరిగిందని స్పష్టం చేశారు.