iDreamPost
android-app
ios-app

మొదటి సొరంగం పూర్తి చేసుకున్న వెలిగొండ ప్రాజెక్టు

  • Published Jan 14, 2021 | 6:23 AM Updated Updated Jan 14, 2021 | 6:23 AM
మొదటి సొరంగం పూర్తి చేసుకున్న వెలిగొండ ప్రాజెక్టు

ప్రకాశం, నెల్లూరు, వైయస్సార్ కడప జిల్లాల్లో మెట్ట ప్రాంతాల్లో ఉన్న 4.47 లక్షల ఎకరాలను సస్యశ్యామలం చేయడానికి, 15.25 లక్షల మందికి దాహార్తి తీర్చాలన్న లక్ష్యంతో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి 2005లో శ్రీకారం చుట్టిన పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు అనేక అవాంతరాలను ఎదుర్కుని ఎట్టకేలకు ముఖ్యమంత్రి జగన్ చూపిన చొరవ మూలాన మొదటి సొరంగం బుధవారం రాత్రితో (13 జనవరి 2021) పూర్తి చేసుకుంది.

వెలుగొండ సొరగం పూర్తి పొడవు 18.8 కిలోమీటర్లు కాగా వైయస్సార్ మరణించే నాటికి పనులు వేగంగా పూర్తి చేసి కాంగ్రెస్ ప్రభుత్వంలో 2014 నాటికి 15.2 కిలోమీటర్లు తవ్వారు. రాష్ట్ర విభజన అనంతరం ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు ఈ ప్రాజెక్టు విషయంలో తీవ్ర నిర్లక్ష్యం చూపడం మూలానా పనుల్లో తీవ్ర జాప్యం ఏర్పడింది. 2014 నుండి 2019 వరకూ చంద్రబాబు అధికారంలో ఉన్న ఐదేళ్ళూ రోజుకు అడుగు చొప్పున కేవలం 0.6 కిలోమీటర్లు (600 మీటర్లు) సొరంగం పనులు మాత్రమే పూర్తి చేశారు. టీడీపీ ప్రభుత్వం 2016 నాటికే ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తాం అని ప్రకటించి ఆ తరువాత నిబంధనలకు విరుద్ధంగా టన్నెల్‌ బోరింగ్‌ మెషిన్ల మరమ్మతుల పేరుతో కాంట్రాక్టర్లకు రూ.66.44 కోట్లను దోచి పెట్టారు.

2019 ఎన్నికల తరువాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి జగన్ ఈ ప్రాజెక్టుపై రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా రూ.61.76 కోట్లను ఆదా చేయడమే కాకుండా కేవలం 15 నెలల కాలంలోనే 2019 నవంబర్‌ నుంచి జనవరి 13,2021 వరకూ మొదటి సొరంగంలో 3.6 కి.మీ. తవ్వి పనులను పూర్తి చేశారు. ఈ 15 నెలల కాలంలో కూడా లాక్‌డౌన్‌ ఒక పక్క, జూన్‌ నుంచి నవంబర్‌ వరకూ నల్లమల అడవుల్లో భారీ వర్షాలు లాంటి ప్రతీకూల పరిస్థితిల్లోను రోజుకు సగటున 9.23 మీటర్ల చొప్పున తవ్వుతూ సొరంగాన్ని పూర్తి చేశారు. ఇదే ప్రాజెక్ట్‌లో భాగమైన రెండో సొరంగం పనులను వేగవంతం చేశారు. సొరంగం పనులను రికార్డు సమయంలో పూర్తి చేసిన జల వనరుల శాఖ అధికారులు, కాంట్రాక్ట్‌ సంస్థ మేఘాను మంత్రి పి.అనిల్‌కుమార్‌ యాదవ్‌ ఫోన్ ద్వారా అభినందించారు.