iDreamPost
android-app
ios-app

నియోజ‌క‌వ‌ర్గం చంద్ర‌బాబుది.. అభివృద్ధి జ‌గ‌న్ ది..!

నియోజ‌క‌వ‌ర్గం చంద్ర‌బాబుది.. అభివృద్ధి జ‌గ‌న్ ది..!

“పార్టీలు చూడం.. రాజకీయాలు చూడం.. అందరికీ సంక్షేమ, అభివృద్ధి ఫలాలు అందిస్తాం.’’ ఈ డైలాగు గుర్తుందా? ముఖ్య‌మంత్రి కాక ముందు, ఎన్నిక‌ల ప్ర‌చారంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పిన మాట‌. చెప్పిన‌ట్లుగానే చేస్తున్న సీఎం జ‌గ‌న్. కులాలు, మతాలు, వర్గాలే కాదు.. రాజకీయలకు అతీతంగా కూడా అభివృద్ధి ఫలాల్లో అందరికీ సమ ప్రాధాన్యం కల్పిస్తున్నారు.

ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గమే. ఇచ్చిన మాట, చేసిన వాగ్దానం ఏదీ మ‌రువ‌డం లేదు.. జ‌గ‌న్ అని చెప్ప‌డానికి కూడా దీన్నొక ఉదాహ‌ర‌ణ‌గా చూపొచ్చు. ఈ నియోజకవర్గ ప్రజలను చంద్రబాబు కేవలం ఓటు బ్యాంకుగానే పరిగణించినా.. ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇక్కడి ప్రజలకు పెద్ద దిక్కుగా అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు. ప్ర‌భుత్వ ఫ‌లాలు అందిస్తున్నారు.

నాడు – నేడు.. తేడా ఇదే

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు ఏపాటి విలువ ఉండేదో అందరికీ తెలిసిందే. శాసనసభ సమావేశాల్లో మాట్లాడే అవకాశం మొదలు.. విపక్ష ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు నిధుల విడుదల వరకు పూర్తిస్థాయిలో వివక్ష కొనసాగింది. ఇప్పుడు ఎన్నికల వరకే రాజకీయాలు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో అధికార, ప్రతిపక్ష పార్టీలనే భేదం చూడబోం అని చెప్పిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆ దిశగానే పాలన సాగిస్తున్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు రాసే ప్ర‌తీ లేఖ‌కూ స్పందిస్తూ కుప్పం నియోజకవర్గానికి రూ.కోటి నిధులు విడుదల చేశారు తాజాగా. అభివృద్ధి ప‌నులు కూడా ప్రారంభించారు.

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు ఎమ్మెల్యేలకు ప్రభుత్వం రూ.కోటి చొప్పున నిధులు కేటాయించడం ఆనవాయితీ. కానీ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు నిధులు విడుదల ఓ ప్రçహసనంగా ఉండేది. 2014–19 కాలంలో స్పెషల్‌ డెవలప్‌మెంట్‌ ఫండ్‌(ఎస్‌డిఎఫ్‌) కింద బాబు తన ఇష్టానుసారం నిధులు విడుదల చేయించారు. కేవలం టీడీపీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలకే నిధులు మంజూరయ్యాయి.అప్పటి ప్రతిపక్ష వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు పలుమార్లు అడిగినా ప్రయోజనం లేకపోయింది.

కానీ రెండేళ్ల కిందట వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ పథకం పేరును ముఖ్యమంత్రి అభివృద్ధి నిధులు (సీఎండీఎఫ్‌)గా మార్పు చేసి.. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలకూ నిధులు విడుదల చేయాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలిచ్చారు. అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్యేలనే తేడా లేకుండా ఆయా నియోజకవర్గాల్లో పనుల కోసం అడిగిన ప్రతి ఒక్క ఎమ్మెల్యేకూ నిధులు మంజూరు చేయాలని స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు. ఆ క్రమంలోనే చంద్రబాబు కోరిన వెంటనే కుప్పానికి రూ.కోటి నిధులు మంజూరు చేశారు.

బాబు లేఖ రాసిన వెంట‌నే స్పంద‌న‌

2020 మే 16న సీఎండీఎఫ్‌ కింద నిధులు మంజూరు చేయాలని చంద్రబాబు మొదటి లేఖ రాశారు. ఆ లేఖ అందిన వెంటనే అప్పటి కలెక్టర్‌ నారాయణభరత్‌గుప్త రూ.70.85 లక్షలను విడుదల చేశారు. ఆ నిధులతో శాంతిపురం, గుడుపల్లి, కుప్పం, రామకుప్పం మండలాల్లో ఆర్‌డబ్ల్యూఎస్‌ ద్వారా 32 తాగునీటి పనులు చేపట్టారు. ఆ తర్వాత 2020 సెప్టెంబర్‌ మూడో తేదీన బాబు లేఖ రాయడంతో అధికారులు రూ.29.15లక్షలు విడుదల చేశారు. మొత్తంగా రూ.కోటి నిధులతో ఆయా మండలాల్లోని గ్రామాల్లో ప్రధానంగా తాగునీటి పనులకు శ్రీకారం చుట్టారు. ఎన్నో ఏళ్లుగా గుక్కెడు నీటికి నోచుకోని జనం సంబరాలు చేసుకున్నారు.

పేద‌ల‌కు స్థ‌లాలు

కుప్పం నియోజకవర్గంలో ఈ రెండేళ్లలోనే 14,653 మంది లబ్ధిదారులకు ఇళ్లపట్టాలు అందజేశారు. గత టీడీపీ హయాంలో 5,158 మందికి ఇళ్లపట్టాలకు అనుమతి ఇచ్చి 4,150 మందికి మాత్రమే పంపిణీ చేశారు. హౌసింగ్‌ ఫర్‌ ఆల్‌ పథకం కింద గతంలో ఐదేళ్లలో 4,691 మంది లబ్ధిపొందగా.. ఈ రెండేళ్లలోనే 3,712 మందికి లబ్ధిచేకూరింది. గత ప్రభుత్వ హయాంలో జన్మభూమి కమిటీల ఆమోదం ఉంటేనే పథకాలు లభించేవి. ప్రస్తుతం అలా కాకుండా గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా అర్హులైన ప్రజలందరికీ నేరుగా సంక్షేమ పథకాలను వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం అందిస్తోంది. కుప్పం నియోజకవర్గంలో 2014–19 మధ్య 30,970 మందికి పింఛన్లను పంపిణీ చేశారు. ఇందుకు కేటాయించిన నిధులు రూ. 653.41 లక్షలు. ప్రస్తుతం అదే నియోజకవర్గంలో గతంకన్నా ఎక్కువగా 34,956 మందికి రూ.844.83 లక్షల మేర పింఛన్లు అందిస్తున్నారు.

కుప్పం బ‌డుల‌కు కొత్త వెలుగు

కుప్పం నియోజకవర్గంలోని సర్కారు, ఇతర యాజమాన్యాల బడుల్లో చదువుతున్న విద్యార్థులను రాష్ట్ర ప్రభుత్వం అమ్మఒడి పథకం ద్వారా ఆదుకుంది. 53,187 మంది తల్లుల ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం రూ.7978.05 లక్షలను జమచేసింది. గత పాలనలో పిల్లల చదువులకు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయని పరిస్థితి. ప్రస్తుతం ఆ నియోజకవర్గంలో పిల్లల చదువులకు అమ్మఒడి పథకంలో ఏడాదికి రూ.15 వేలు చొప్పున ఆర్థిక సహాయం అందిస్తున్నారు.

అలాగే కుప్పం నియోజకవర్గంలోని సర్కారు బడుల బలోపేతానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. 2019–20 సంవత్సరాల్లో 46 సర్కారు బడుల నూతన భవనాలను రూ.715.84 లక్షలను ఖర్చు చేసి నిర్మిస్తున్నారు. అలాగే 43 సర్కారు బడులను నాడు–నేడు పథకం ద్వారా రూ.1138 లక్షలతో మౌలిక వసతులు కల్పించి కార్పొరేట్‌ బడులకు దీటుగా తీర్చిదిద్దుతున్నారు. గత సర్కారు 85 పాఠశాలల్లో అదనపు తరగతి గదులు నిర్మించి చేతులు దులుపుకుంది.

ద‌శాబ్దాల నాటి సమస్యలకు పరిష్కారం

కుప్పం నియోజకవర్గంలోని పలు ప్రాంతాల నుంచి ఉపాధి కోసం ప్రజలు బెంగళూరుకు వెళ్లాల్సిన దుస్థితి. ఈ నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే దాదాపు లక్ష మందికి ఉపాధి కల్పించేలా గ్రానైట్‌ సర్వే స్టోన్‌ కటింగ్, పాలిషింగ్‌ యూనిట్‌ను నెలకొల్పేందుకు రంగం సిద్ధం చేసింది. కుప్పం పరిధిలోని దళవాయి కొత్తపల్లి సమీపంలో పల్లార్లపల్లి వద్ద 4 ఎకరాల స్థలంలో యూనిట్‌ ఏర్పాటవుతోంది.

కుప్పం నడిబొడ్డున ఉన్న గంగమ్మ దేవాలయాన్ని పునర్నిర్మించాలన్నది స్థానికుల కల. ఏటా నిర్వహించే జాతరకు సమీపంలోని కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల నుంచి భక్తులు వస్తుంటారు. మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ రెడ్డెప్ప దేవాలయ పునర్నిర్మాణానికి రూ.3.5 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేయించారు. గుడి ముందు 70 సెంట్ల డీకేటీ స్థలాన్ని అగ్నిగుండంకు కేటాయించనుండటం విశేషం.

కుప్పంకు సమీపంలోని డీకేపల్లి, కుప్పం నగరంలోని రైల్వేబ్రిడ్జిల సమస్య 2004వ సంవత్సరం నుంచి అపరిష్కృతంగానే ఉంది. ఈ సమస్య వల్ల సమీపంలోని 60 గ్రామాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమస్య పరిష్కారానికి చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప చొరవ చూపి అధికారంలోకి వచ్చిన 8 నెలల్లోనే రెండు నూతన రైల్వే అండర్‌ గ్రౌండ్‌ బ్రిడ్జిలను నిర్మించి ప్రారంభించారు.