iDreamPost
iDreamPost
జగన్ ఏది చేసినా వ్యతిరేకించడమే పనిగా పెట్టుకున్న విపక్షాలకు మింగుడుపడని నిర్ణయం ఏపీ ప్రభుత్వం తీసుకుంది. శాసనమండలి విషయంలో గతంలో రద్దు చేయాలనే ప్రతిపాదనను ఉపసంహరించుకోవడం ప్రధాన ప్రతిపక్షం టీడీపీకి నోరు తెరవలేని స్థితికి తెచ్చింది. వాస్తవానికి గత ఏడాది మండలిని రద్దు చేయాలని అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని టీడీపీ తీవ్రంగా వ్యతిరేకించింది. కాబట్టి ప్రస్తుతం మండలి రద్దు ప్రతిపాదనను ఉపసంహరించుకోవడం ఆపార్టీ ఆహ్వానించాలి. ఇంకో అడుగు ముందుకేసి తమ ఒత్తిడి వల్లనే ప్రభుత్వం వెనక్కి తగ్గిందని చెప్పుకోవడానికి కూడా ఛాన్స్ ఉంది. కానీ టీడీపీ అందుకు అంగీకరించలేకపోయింది. జగన్ ఎత్తులను అర్థం చేసుకోలేక సతమతమవుతున్న తరుణంలో తాజా వ్యవహారాన్ని కూడా ఆపార్టీ జీర్ణం చేసుకోలేకపోయింది.
మండలి రద్దు విషయంలో ఏపీ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను కేంద్రం ఆమోదించాల్సి ఉంది. వాస్తవానికి ఏ రాష్ట్రంలోనైనా మండలి ఏర్పాటు గానీ, రద్దు గానీ ఆయా రాష్ట్ర ప్రభుత్వాల చేతుల్లో లేవు. కేంద్రం నిర్ణయమే దానికి మూలం. రాజ్యాంగం ప్రకారం ఉన్న ఈ నిబంధన ప్రకారం ఏపీ శాసనమండలితో పాటుగా వివిధ రాష్ట్రాల్లో మండలి కోసం చేసిన ప్రతిపాదనలను కేంద్రం పరిశీలించాల్సి ఉంది. అయినా అటు నుంచి స్పందన లేదు. సుమారు రెండేళ్లు గడుస్తున్నా ఎటూ నిర్ణయం తీసుకోకపోవడంతో సందిగ్ధ స్థితి ఏర్పడింది. రాష్ట్రాల్లో శాసనమండళ్లు ఏర్పాటు విషయంలో బీజేపీ విధానపరంగా వ్యతిరేకిస్తోంది. రద్దు విషయంలో ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలో దానికి అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని ఓ దశలో భావించినా మండళ్ల ఏర్పాటు కోసం వివిధ రాష్ట్రాలు చేసిన ప్రతిపాదనలు కూడా ఎదురుగా ఉండడంతో వెనక్కి తగ్గింది.
ఈ పరిస్థితిని తొలగించాలని జగన్ నిర్ణయం తీసుకోవడం టీడీపీకి బోధపడడం లేదు. 2020లో మండలి రద్దు చేయడాన్ని వ్యతిరేకించింది. అప్పట్లో అధికార పార్టీ రద్దు కోసం యత్నించింది. కానీ కేంద్రం ఎటూ తేల్చకపోవడంతో 2021లో రద్దు ప్రతిపాదనను వైఎస్సార్సీపీ వెనక్కి తీసుకుంది. కానీ ఇప్పుడు టీడీపీ మాట మారుస్తోంది. అప్పట్లో రద్దు కూడదన్న టీడీపీ ఇప్పుడు మాత్రం రద్దు చేయాలనే రీతిలో మాట్లాడడం ఆశ్చర్యంగా కనిపిస్తోంది. రాజకీయంగా జగన్ ఏది చేసినా వ్యతిరేకించడమే తప్ప తాము చేసిన డిమాండ్ ని అనుసరిస్తున్నా ఆపార్టీకి అయిష్టంగానే మారడం ఆశ్చర్యంగా కనిపిస్తోంది. ఏపీలో విపక్ష తీరులో ఢొల్లతనాన్ని ఇది చాటుతోంది. కేంద్రం ఇప్పటికే ఓ నిర్ణయం తీసుకుని ఉంటే ఏపీ ప్రభుత్వానికి ఇలాంటి అవకాశం ఉండేది కాదు. కాబట్టి అస్పష్టతను తొలగించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే దానిని కూడా విమర్శించ పూనుకోవడం టీడీపీ నేతల వైఖరిలో వైఫల్యాన్ని వెల్లడిస్తోంది.
Also Read : AP Council, Abolished Bill – మండలి యధాతథం.. ఏపీ శాసన సభలో కీలక పరిణామం