iDreamPost
android-app
ios-app

ప్రతిభకు పట్టం – జగన్ కుమార్తెకు ప్రముఖ బిజినెస్ స్కూల్లో పీజీ సీట్

  • Published Aug 24, 2020 | 5:27 AM Updated Updated Aug 24, 2020 | 5:27 AM
ప్రతిభకు పట్టం – జగన్ కుమార్తెకు ప్రముఖ బిజినెస్ స్కూల్లో పీజీ సీట్

రాజకీయనేతలు నిత్యం బిజీగా ఉంటారు. ప్రజాజీవితంలో క్షణం తీరిక లేకుండా గడుపుతూ ఉంటారు. అందులోనూ ప్రాంతీయ పార్టీ ప్రారంభించి, అధికారంలోకి తీసుకురావడం కోసం అహర్నిశలు శ్రమించిన జగన్ లాంటి వారి జీవితాల గురించి చెప్పనవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రనే మలుపుతిప్పిన ఆయన ప్రస్థానంలో పుష్కరకాలంగా నిత్యం ప్రజల మధ్యే గడుపుతున్నారు. దాంతో ఆయన కుటుంబానికి వెచ్చించే సమయంపై దాని ప్రభావం పడుతుంది. వారి పిల్లల బాగోగులు, వారి చదువుల గురించి తగిన శ్రధ్ద పెట్టడానికి అవకాశం స్వల్పంగా ఉంటుంది. అయితే జగన్ తన సమయాన్ని బ్యాలన్స్ చేసుకుంటున్నారు.జగన్ కుమార్తెలు ఉన్నతంగా రాణిస్తున్న తీరు అందరినీ ఆకట్టుకుంటుంది. తండ్రి తగ్గ కూతుళ్లనే మాట వినిపిస్తోంది.

వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కూతుళ్లలో పెద్ద కుమార్తె హర్షారెడ్డి ఇప్పటికే అన్నింటా రాణిస్తోంది. విద్యాపరంగా ఆమె అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు సాధిస్తోంది. గతంలో లండన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది అక్కడ కూడా ఆమె ఉన్నత శ్రేణిలో ఉత్తీర్ణురాలయ్యింది. దాంతో ఆమెకు ఇప్పుడు పారిస్ లోని ప్రముఖ బిజినెస్ స్కూల్ లో ఛాన్స్ వచ్చింది. మాస్టర్స్ పూర్తి చేయడానికి ఆమెకు ప్రపంచంలోనే టాప్ బిజినెస్ స్కూళ్లలో ఒకటిగా పేరున్న ఇన్ సీడ్ బిజినెస్ స్కూల్(Insead Business School) లో అవకాశం దక్కింది. గతంలో లండన్ స్కూల్లోనూ, ఇప్పుడు ఇన్ సీడ్ లోనూ పూర్తిగా హర్షారెడ్డి ప్రతిభ ఆధారంగా సీట్లు సాధించడం విశేషం, ఆమె ప్రతిభకు నిదర్శనం.

హర్షారెడ్డి మంగళవారం బెంగళూరు విమానాశ్రయం నుంచి పారిస్ బయలుదేరబోతున్నారు. సీఎం జగన్ సహా ఆయన కుటుంబం అంతా బెంగళూరు వరకూ వెళ్లి హర్షారెడ్డికి వీడ్కోలు పలకబోతున్నారు. ప్రాధమిక విద్యను బెంగళూరులో అభ్యసించిన హర్షారెడ్డి చిన్నతనం నుంచే చదువుల్లో చురుగ్గా ఉండేవారు. అయితే ఆమె ఇంకా ప్రైమరీ స్కూల్ పూర్తి చేయకముందే తండ్రి రాజకీయాల్లో బిజీ అయిపోయారు.

2009లో కడప ఎంపీ, ఆ తర్వాత కాంగ్రెస్ ని వీడడం,సొంతంగా పార్టీ ప్రారంభించడం,రాజకీయ వడిదుడుకులు, పాదయాత్ర ఇలా జగన్ పూర్తిగా ప్రజాజీవితంలోనే సాగుతున్నారు. మరోవైపు జగన్ రాజకీయాలలో బిజీ అవ్వటంతో ఆయన శ్రీమతి భారతి సాక్షితో పాటు సిమెంట్స్ మరియు ఇతర వ్యాపార బాధ్యతలు చూసుకొనేవారు. రాజకీయంగా మరియు వ్యాపారపరంగా ఎంత బిజీగా ఉన్నా పిల్లల విషయంలో జగన్ మరియు భారతి తగిన శ్రద్ధ చూపేవారు.పిల్లలు కూడా చాలా ఫోకస్డ్ గా చదువుకునే వారు.

వాస్తవానికి హర్షారెడ్డి ప్రతిష్టాత్మక లండన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేయడంతో ఇప్పటికే ఓ ఫైనాన్షియల్ సంస్థలో మంచి ఉద్యోగం దక్కింది. యూఎస్ కేంద్రంగా పనిచేస్తున్న మల్టీ నేషనల్ కంపెనీలో ఆమెకు ఆఫర్ వచ్చింది. అయినప్పటికీ మాస్టర్స్ పూర్తిచేయడమే లక్ష్యంగా ఆమె పారిస్ కి పయనమవుతున్నారు. గతంలో తాను కూడా టెన్త్, ఇంటర్ స్థాయిలో డిస్టెన్షన్ సాధించినట్టు అసెంబ్లీ సాక్షిగా సీఎం ప్రకటించారు. ఇప్పుడు ఆయనకు తగ్గట్టుగానే కుమార్తె కూడా విద్యాపరంగా విశేషంగా రాణిస్తుండడంతో తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకుందంటూ కుటుంబీకులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇక వైఎస్ భారతి కూడా భర్తకు తగ్గట్టుగా ఆయన సొంత సంస్థల వ్యవహారాలు చక్కదిద్దడంలో చొరవగా వ్యవహరిస్తున్నారు.

లండన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి మెరిట్ తో యూనివర్సిటీలలో వరల్డ్ మూడో ర్యాంక్ లో ఉన్న Insead Business Schoolలో సీటు సాధించిన హర్షారెడ్డికి అభినందనలు…