Idream media
Idream media
చారిత్రక కారణాలతో వెనుకబడి ఉన్న రాష్ట్రాలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు కేంద్ర ప్రభుత్వం కల్పించే వెసులుబాటు ప్రత్యేక హోదా. ఏపీకి ప్రత్యేక హోదా అవసరం చాలా ఉంది. రాష్ట్రం విడిపోయాక తొలిసారిగా అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం వింత పోకడ వల్ల ఆ హోదా ఏపీకి అందకుండా పోయింది. ప్యాకేజీ పేరిట కేంద్రం తెరపైకి తెచ్చిన ప్రణాళికకు నాడు అధికారంలో ఉన్న చంద్రబాబు ఊకొట్టడం, రాష్ట్రం విడిపోయినప్పుడు కేంద్రంలో ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ కూడా ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని లేవనెత్తిన విషయాన్ని మరిచిపోవడం కారణంగా ఈ దుస్థితి ఏర్పడింది.
తాను 29 సార్లు ఢిల్లీ వెళ్లినా ఫలితం లేకపోయిందని స్వయంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పదేపదే చెబుతుండే వారు. ప్రత్యేకహోదా అంశంలో బాబు పూటకో మాట మార్చేవారు. ఓవైపు ప్యాకేజీకి సై అంటూనే.. ప్రజలు ఆందోళనలు చేసినప్పుడల్లా మరోవైపు ప్రత్యేక హోదా తెస్తా అనేవారు. ప్యాకేజీకి ఒప్పుకున్నప్పుడు హోదా తేవడం బాబు వల్ల సాధ్యం కాని పని అని ప్రజలకు తెలిసిపోయింది. దీంతో 2019 ఎన్నికల్లో బాబు మాటలను ప్రజలు నమ్మలేదు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి అధికారం కట్టబెట్టారు.
బంపర్ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదాపై బాబులా పిల్లిమొగ్గలు వేయలేదు. రాజకీయ పరిస్థితులు, కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం బలాబలాలను పరిశీలించి ఉన్నది ఉన్నట్లు కుండబద్దలు కొట్టి క్లారిటీగా చెప్పేశారు. బీజేపీ ప్రభుత్వానికి పూర్తి మెజార్టీ ఉంది కనుక, ఒత్తిడి చేసి సాధించే అవకాశం లేదని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి ముందే పేర్కొన్నారు. అందుకు వినూత్న మార్గాన్నిఎంచుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరాన్ని కేంద్రం గుర్తించేలా వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారు. సమావేశాలు జరిగినప్పుడు ఓవైపు ఎంపీల ద్వారా పార్లమెంట్ లో ప్రత్యేక హోదా గళం వినిపిస్తూనే మరోవైపు తాను ఢిల్లీ వెళ్లినప్పుడల్లా రాష్ట్ర ఆర్థిక, మౌలిక, సామాజిక పరిస్థితులను కేంద్ర పెద్దలకు వివరిస్తూ, దాన్ని ప్రత్యేక హోదాతో ముడిపెడుతూ సావధానంగా సాధించే ప్రయత్నం చేస్తున్నారు.
తాజాగా రెండు రోజుల పాటు ఢిల్లీ లో పర్యటించి కేంద్రంలో కీలకనేతగా ఉన్న హోం మంత్రి అమిత్ షాతో సహా అయిదుగురిని కలుసుకున్నారు జగన్. రైల్వే మంత్రి పీయుష్‌గోయెల్, నీటి పారుదల మంత్రి గజేంద్ర షెకావత్, పర్యావరణ మంత్రి ప్రకాశ్ జవదేకర్, ఉక్కు గనుల శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌లతో పాటు నీటి ఆయోగ్‌వైస్‌ఛైర్మన్ రాజీవ్‌కుమార్‌ను కూడా కలిసి రాష్ట్రానికి రావలసిన నిధులు, కేంద్రంలో జరగాల్సిన పనులపై చర్చించారు. పోలవరం, ఉపాధి పనుల బకాయిలు, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ, పెట్రో కాంప్లెక్స్, పెట్రో వర్సిటీ ఏర్పాటు తదితర అంశాలతో పాటు ప్రత్యేక హోదా అంశాన్ని కూడా లేవనెత్తారు. రాష్ట్రంలో మహానగరాలు లేవు గనక సమగ్రాభివృద్ధికి కేంద్రం సహకారం అనివార్యమని, ఆర్థికంగా ఆదుకోవడానికి ప్రత్యేక హోదా ఒక్కటే మాత్రమే మార్గమని నొక్కి ఒక్కానించి కేంద్ర పెద్దలు ఆలోచించేలా చేశారు.
రాష్ట్ర ప్రయోజనాలను ఎలాగైనా సాధించుకోవాలన్న తలంపుతో సీఎం జగన్ అనుసరిస్తున్న వ్యూహాలు రాజకీయ పండితులను సైతం ఆశ్చర్యపరుస్తున్నాయి. ఇదే మరొకరైతే, ఈపాటికి.. ఏపీ ప్రత్యేక హోదా కోసం కేంద్రాన్ని గట్టిగా అడిగాం, దానికోసం ఎందాకైనా వెళ్తామని హెచ్చరించామంటూ ప్రకటనలు, సమావేశాల ద్వారా హడావిడి చేసేవారు. అలాంటి హడావిడి వల్ల ఏమాత్రం లాభం లేదని గుర్తించిన జగన్ లక్ష్య సాధనకు నిధానంగా, నిశ్శబ్దంగా సాగుతున్న వైనం ఆశ్చర్యకరమే. నిజంగా కేంద్రం ప్రత్యేక హోదా ప్రకటన చేస్తే అది జగన్ చేసిన నిశ్శబ్ధ విప్లవంగా పేర్కొనవచ్చు.