“కేంద్రంలోని బీజేపీతో జగన్‌కు సన్నిహిత సంబంధాలుంటే ఆయన ప్రతి వారం కోర్టుకు రావాల్సిందేనని సీబీఐ ఎందుకు పిటిషన్ వేస్తుంది? అందులోనూ కేసులో ఇరికించిన కాంగ్రెస్ హయాంలో కంటే దారుణంగా బీజేపీ పాలనలో తీవ్రమైన నేరారోపణ చేస్తూ సీబీఐ పిటిషన్ వేయడం ఏంటి ” అని ఇటీవల సీనియర్ రాజకీయనేత ఉండవల్లి అరుణ్‌కుమార్ అన్నమాటలు ఎంత నిజమో ఇప్పుడిప్పుడే జనానికి అర్థమవుతోంది.
ఉండవల్లి అరుణ్‌కుమార్ విలువైన ఓ పాయింట్‌ను లేవనెత్తారు. తన కేసులో జగన్ సాక్షులను ప్రభావితం చేస్తారని, అందువల్లే అతనికి మినహాయింపు ఇవ్వకూడదని వాదించడం అవివేకమని, శుక్రవారం మినహాయిస్తే మిగిలిన రోజుల సంగతేంటంటూ…ఇదంతా జగన్‌ను వేధించడానికే అని కూడా ఆయన కుండబద్దలు కొట్టారు.
ఈ మొత్తం పరిణామాలను ఒక్కసారి పరిశీలిస్తే ఉండవల్లి చెప్పింది నిజమేననిపిస్తోంది. ఒకవైపు పైకి మాత్రం బీజేపీ అగ్రనేతలతో జగన్‌కు మంచి సంబంధాలున్నాయనే ప్రచారం ఎప్పటి నుంచో జరుగుతోంది. కాని వాస్తవానికి వచ్చేసరికి అందుకు విరుద్ధంగా వ్యవహారాలు నడుస్తున్నాయి.
జగన్ అధికారం చేపట్టిన తర్వాత పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. వీటిలో ముఖ్యంగా విద్యుత్ కొనుగోలు ఒప్పందం (పీపీఏ)పై సమీక్షించాలనే నిర్ణయం కేంద్రప్రభుత్వానికి రుచించడం లేదు. పీపీఏలపై సమీక్షించి, ఒప్పందాలను రద్దు చేసుకుంటే ఏపీలో పరిశ్రమలు పెట్టేందుకు ఎవరూ ముందుకు రారని కేంద్రం వాదిస్తోంది. దీనికి జగన్ ససేమిరా అని భీష్మించారు. ఆరు నూరైనా, నూరు ఆరైనా సమీక్షిస్తానని, విద్యుత్ కొనుగోళ్లలో భారీ అవినీతి చోటు చేసుకొందని జగన్ గట్టిగా వాదిస్తున్నారు.
దీంతో పాటు పోలవరంలో అవినీతిపై జరిగిందని జగన్ సర్కార్ అంటుంటే కేంద్రసర్కార్ కాదంటోంది. అలాగే రాజధాని అమరావతిపై జగన్ సానుకూలంగా లేకపోవడం కూడా ఒక కారణం. అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం దెబ్బతినడంతో ఇటీవల బీజేపీలో చేరిన ఒక సామాజిక వర్గం వ్యాపారవేత్తల కూటమి గగ్గోలు పెడుతోంది. వీరంతా జగన్‌పై కేంద్ర పెద్దల్లో వ్యతిరేకత కలిగేలా ఇన్‌ఫుట్స్ ఇస్తున్నారని సమాచారం.
ఏది ఏమైనా తాము చెప్పిందానికి జగన్ తలొగ్గకపోవడంతో కేంద్ర పెద్దలకు అహం దెబ్బతిన్నది. జగన్‌ను ఎలాగైనా దారికి తెచ్చుకోవాలనే పట్టుదలతో బీజేపీ అగ్రనేతలున్నారు. ఈ నేపథ్యంలో జగన్‌పై సీబీఐ, ఈడీ కేసులను అస్త్రాలుగా వాడుకోవాలని కేంద్రపెద్దలు నిర్ణయించుకున్నట్టు సమాచారం. జగన్‌ను భయపెట్టేందుకే సీబీఐ కోర్టుకు తప్పనిసరిగా హాజరు కావాల్సిందేనని సంబంధిత అధికారులతో స్ర్టాంగ్ పిటిషన్ వేయించారన్న వాదన వినిపిస్తోంది.
దేశ వ్యాప్తంగా చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలు, కేంద్రంలో మోడీ, అమిత్‌షా ద్వయం వ్యవహారాలు తెలిసిన వారెవరైనా దేన్సీ తోసిపుచ్చలేమంటున్నారు. చివరికి సీబీఐ కోర్టుకు వారం వారం జగన్ హాజరు మినహాయింపు రాకపోవడాన్ని కూడా ఆ కోణంలో చూడాల్సిందేనని రాజకీయ పరిశీలకులు అంటున్నారు